అంతర్జాతీయం జాతీయం ముఖ్యాంశాలు

భారత్​ కు తొలి పతకం

వెండి పతకాన్ని అందించిన మీరాబాయీ చాను
కరణం మల్లేశ్వరి తర్వాత వెయిట్ లిఫ్టింగ్ లో పతకం

ఒలింపిక్స్ లో భారత్ తొలి పతకాన్ని సాధించింది. వెయిట్ లిఫ్టింగ్ లో మీరాబాయి చాను వెండి పతకాన్ని గెలిచింది. 49 కిలోల విభాగంలో ఆమె ఈ ఘనత సాధించింది. స్నాచ్, క్లీన్ అండ్ జెర్క్ లలో కలిపి ఆమె 202 కిలోల బరువునెత్తింది. స్నాచ్ లో 87 కిలోలు (84, 87, 89), క్లీన్ అండ్ జెర్క్ లో 115 (110, 115, 117) కిలోలు ఎత్తింది. చైనాకు చెందిన హూ ఝూహీ 210 కిలోల (94, 116) బరువునెత్తి స్వర్ణం సాధించింది.

10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ లో యువ కెరటం సౌరబ్ చౌదరి ఫైనల్ లో ఓడిపోయాడు. ఆరు సిరీస్ ల క్వాలిఫికేషన్ రౌండ్ లో 586 పాయింట్లు సాధించి టాప్ 8లో టాపర్ గా నిలిచి ఫైనల్ లోకి దూసుకెళ్లిన అతడు.. ఫైనల్ లో తడబడి నిష్క్రమించాడు. మొదటి సిరీస్ లో తొలి ఐదు షాట్లకు పదికి పది పాయింట్లు సాధించిన అతడు.. ఆ తర్వాత కొంచెం తడబడ్డాడు. తర్వాతి ఐదు షాట్లకు తొమ్మిది చొప్పున పాయింట్లు సాధించి.. మొత్తం 95 పాయింట్లతో నిలిచాడు. ఆ తర్వాతి సిరీస్ లలో పుంజుకున్న సౌరబ్.. వరుసగా 98, 98, 100, 98, 97 పాయింట్లను సాధించి.. భారత్ కు పతకం ఆశలను మరింత పటిష్ఠం చేశాడు. అయితే, ఫైనల్ లో పోటీ ఇవ్వలేకపోయాడు. ఇదే విభాగంలో అభిషేక్ వర్మ క్వాలిఫికేషన్ రౌండ్​ లోనే వెనుదిరిగాడు.

బ్యాడ్మింటన్ లో నిరాశే ఎదురైంది. తెలుగు తేజం సాయి ప్రణీత్ తొలి మ్యాచ్ లోనే ఓటమి పాలయ్యాడు. 17–21, 15–21 తేడాతో ఇజ్రాయెల్ క్రీడాకారుడు జిల్బర్ మ్యాన్ చేతిలో ఓడిపోయాడు. ఇటు ఆర్చరీ మిక్స్ డ్ డబుల్స్ లోనూ చేదు ఫలితాలే వచ్చాయి. క్వార్టర్ ఫైనల్స్ లో దీపికా కుమారి, ప్రవీణ్ జాధవ్ ల జోడీ ఓడిపోయింది. కొరియా జంట ఆన్ సాన్ , కిమ్ జే దియోక్ చేతిలో 2–6 తేడాతో ఓటమిపాలయ్యారు.