తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు కాంగ్రెస్ మాజీ చీఫ్, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ హాజరు కావడంలేదు. అనారోగ్య కారణాలతో తెలంగాణ టూర్ ను సోనియా రద్దు చేసుకున్నారు. ఈ వేడుకలకు ప్రత్యేక అతిథిగా హాజరు కావాలంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీని ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానాన్ని మన్నించిన సోనియా గాంధీ.. వేడుకలకు హాజరవుతానని మాటిచ్చారు. షెడ్యూల్ ప్రకారం ఆదివారం ఉదయం సోనియా గాంధీ హైదరాబాద్ చేరుకోవాల్సి ఉంది.
కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న సోనియా ఈ టూర్ విషయంలో తన వ్యక్తిగత వైద్యుడి సలహా కోరారు. సోనియా ఆరోగ్యం దృష్ట్యా ఈ ప్రయాణం మానుకుంటేనే మేలని వైద్యుడు చెప్పడంతో తెలంగాణ టూర్ ను ఆమె రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. అనారోగ్య కారణాలతో రాష్ట్ర అవతరణ వేడుకలకు సోనియా హాజరు కావడంలేదని ఏఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది