తెలంగాణలో చిన్నారులకు వ్యాక్సిన్ల పంపిణీ షురూ
ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు హైదరాబాద్ బంజారాహిల్స్‌లో వ్యాక్సినేషన్ 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు కలిగిన పిల్లలకు కరోనా వ్యాక్సిన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… రాష్ట్ర వ్యాప్తంగా 1,014 కేంద్రాల్లో పిల్లలకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు చెప్పారు. అర్హులైన పిల్లలందరికీ కొవాగ్జిన్ వ్యాక్సిన్లు ఇస్తామని తెలిపారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో తెలంగాణ ముందంజలో ఉందని హరీశ్ రావు చెప్పారు. అర్హులైన పిల్లలు అందరూ వ్యాక్సిన్లు తీసుకునేలా ప్రోత్సహించాలని పాఠశాలలు, కళాశాలలకు కూడా సూచనలు చేశామని చెప్పారు. ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ పిల్లలకు టీకాలు ఇచ్చేందుకు అనుమతులు ఇచ్చామని తెలిపారు. తల్లిదండ్రులంతా విధిగా తమ పిల్లలను వ్యాక్సిన్ కేంద్రాలకు తీసుకొచ్చి టీకాలు వేయించాలని ఆయన కోరారు.
పిల్లలకు వ్యాక్సిన్ వేయించే బాధ్యత తల్లిదండ్రులదేనని హరీశ్ రావు చెప్పారు. వ్యాక్సిన్లు వేయించుకోని విద్యార్థులు అనేవారే లేకుండా అర్హులైన పిల్లలందరికీ వ్యాక్సిన్లు అందేలా టీచర్లు, లెక్చరర్లూ ప్రోత్సహించాలని చెప్పారు. పిల్లలకు వారి తల్లిదండ్రులు లేదా టీచర్ల సమక్షంలో వ్యాక్సిన్లు వేస్తున్నట్లు చెప్పారు. 18 ఏళ్లు నిండిన వారు సెకండ్ డోసు వ్యాక్సిన్ కూడా తప్పకుండా తీసుకోవాలని ఆయన సూచించారు. 60 ఏళ్లు పైబడి అనారోగ్యంతో బాధపడుతోన్న వారు, ఫ్రంట్ లైన్ వర్కర్లు అందరికీ బూస్టర్ డోసు కూడా ఇవ్వనున్నామని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ నెల 10 నుంచి బూస్టర్ డోసు ఇస్తామని ఆయన చెప్పారు.
వ్యాక్సిన్లు వేసుకుంటేనే రోగ నిరోధక శక్తి పెరిగి, వ్యాధిని నిరోధించడానికి అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. 100 శాతం మొదటి డోసు వ్యాక్సిన్లు వేసిన రాష్ట్రంగా కేంద్ర ప్రభుత్వ ప్రశంసలను తెలంగాణ అందుకుందని ఆయన చెప్పారు. థర్డ్ వేవ్ వస్తే కరోనా నుంచి వ్యాక్సిన్లు రక్షిస్తాయని హరీశ్ రావు చెప్పారు. థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. వైద్య పరికరాలు, అన్ని సదుపాయాలను సిద్ధం చేసిందని తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దని చెకోరారు.