ECI
జాతీయం రాజకీయం

ఓట్ల లెక్కింపుకు…. సర్వం సన్నద్ధం

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఈ నెల 4న నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా. కె. శ్రీనివాసులు పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ లోని ఆయన ఛాంబర్ లో ఓట్ల లెక్కింపు ప్రక్రియపై జిల్లా ఎస్పీ కె. రఘువీర్ రెడ్డితో కలిసి మీడియా విలేకరులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా. కె. శ్రీనివాసులు మాట్లాడుతూ పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సజావుగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశామని తెలిపారు. నంద్యాల పట్టణ శివారు ప్రాంతంలోని ఆర్జిఎం ఇంజనీరింగ్ కాలేజీలో నందికొట్కూరు, శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గాలు, శాంతిరాం ఇంజనీరింగ్ కాలేజీలో నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలు, ఫార్మసీ కాలేజీలో డోన్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ నెల 4వ తేదీ ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అనంతరం అరగంటకు ఈవీఎంల ఓట్ల లెక్కింపు కార్యక్రమం ప్రారంభమవుతుందని కలెక్టర్ తెలిపారు. రాజకీయ పార్టీల ఏజెంట్లు జారీ చేసిన పాసులు తీసుకొని గంట ముందు వచ్చేలా రెండు పర్యాయాలు సమావేశం నిర్వహించి తెలియ జేశామన్నారు. మొదటి రాండ్నైజేషన్ పూర్తయిన కౌంటింగ్ సిబ్బందికి మొదటి ధపా శిక్షణ ఇచ్చామని, ఈనెల 3వ తేదీ రెండవ రాండ్నైజేషన్ పూర్తి చేసి వెంటనే రెండవ దఫా శిక్షణ ఇస్తామని కలెక్టర్ వెల్లడించారు.

ప్రతి నియోజకవర్గానికి అసెంబ్లీ సెగ్మెంట్ కు ఒక కౌంటింగ్ హాలు, పార్లమెంటు సెగ్మెంట్ కు మరొక కౌంటింగ్ హాల్ చొప్పున 12 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. నంద్యాల పార్లమెంట్ పోస్టల్ బ్యాలెట్ కోసం ప్రత్యేకంగా మరొక కౌంటింగ్ హాల్ ను కూడా సిద్ధం చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతి హాల్ కు 14 టేబుల్ చొప్పున… రౌండ్ల వారీగా అభ్యర్థులకు పోలైన ఓట్ల వివరాలను మీడియాకు వెల్లడి స్తామన్నారు. ఈవీఎంల ఓట్ల లెక్కింపు కోసం అసెంబ్లీకి 74 టేబుళ్లు, పార్లమెంటుకు 75 టేబుళ్లు…. పోస్టల్ ఓట్ల లెక్కింపు కోసం అసెంబ్లీకి 21 టేబుళ్లు, పార్లమెంటుకు 17 టేబుళ్ల చొప్పున ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని కలెక్టర్ వెల్లడించారు. ఓట్ల లెక్కింపు ఉత్కంఠ ఫలితాల వెల్లడి జూన్ 4వ తేదీ సాయంత్రం 5 గంటల లోపల పూర్తవుతుందని కలెక్టర్ తెలిపారు.

కౌంటింగ్ పరిసరాల పరిధిలో ఈనెల 7వ తేదీ వరకు 144 సెక్షన్ అమల్లో ఉందని నలుగురు వ్యక్తులు మించి ఎవరు కూడా గుమికూడకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రశాంత వాతా వరణంలో ఏ విధంగా పోలింగ్ జరిగిందో అదే రీతిలో కౌంటింగ్ ప్రక్రియ కూడా సజావుగా జరిగేందుకు అందరూ సహకరించాలని ఈ సందర్భంగా కలెక్టర్ కోరారు.

జిల్లా ఎస్పీ కె. రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ కౌంటింగ్ సందర్భంగా రాజకీయ పార్టీలు, ప్రజలు పాటించాల్సిన నియమ నిబంధనలపై వివరించామన్నారు. హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు, వారి ఏజెంట్లు మినహా ఇతరులెవ్వరికి కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతి లేదన్నారు. ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ మరియు 30 పోలీసు ఆక్ట్ అమలులో ఉంటుందన్నారు. కౌంటింగ్ కు వచ్చే సిబ్బంది మొబైల్స్, ఇతర ఎలక్ట్రికల్ పరికరాలు అనుమతించమన్నారు. ఏజెంట్లు ఒక్కసారి కౌంటింగ్ కేంద్రంలోకి ప్రవేశించిన తర్వాత కౌంటింగ్ పూర్తి అయ్యేవరకు బయటకు వెళ్లడానికి వీలు లేదని… ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే ముందుగానే వాటికి సంబంధించిన మందులు వెంట తెచ్చుకోవాలన్నారు. నియోజకవర్గాల నుండి వచ్చే ఏజెంట్లు తప్ప మిగిలిన వారిని ఎవరిని అనుమతించమని ఎస్పీ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వచ్చే ఊహాజనిత వార్తలను నమ్మి ఎట్టి పరిస్థితుల్లో వాటికి స్పందించరాదన్నారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే ప్రకటనలు, పోస్టులు పెట్టి ఏదైనా గొడవలకు కారణమైతే వారిపై కఠినమైన చర్యలు తీసుకోబడతాయన్నారు.

ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత విజయోత్సవ ర్యాలీలు, క్రాకర్స్ (టపాకాయలు) కాల్చటకు అనుమతిలేదన్నారు. టపాసులు మరియు ఇతర పేలుడు పదార్థాలను ఎక్కడ కూడా నిలువ ఉంచుకోకూడదని నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు. ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎస్పీ, ఒక అదనపు ఎస్పీ, DSP లు -4, CI లు -23, SI లు 35, ASI/HCలు-68, PCలు-133, HGలు-101 మంది విదులలో ఉంటారన్నారు. వీరితో పాటు స్పెషల్ పార్టీ, BSF బలగాలు, AR సిబ్బంది, APSP సిబ్బంది కూడా విదులలో ఉంటారన్నారు. జిల్లాలోని 75 సమస్యాత్మక ప్రాంతాలలో పోలీసు పికెట్ లు ఏర్పాటు చెయ్యడం జరిగిందన్నారు. ప్రతి పోలీసు స్టేషన్ పరిదిలో పెట్రోలింగ్ పార్టీలను QRTలను, స్పెషల్ పార్టీ టీంలను  ఏర్పాటు చేసామన్నారు.  పార్టీ కార్యాలయాలవద్ద, ప్రదాన పార్టీ అభ్యర్థుల ఇళ్ల వద్ద పోలీసు భద్రతా ఏర్పాట్లు చెయ్యడం జరిగిందన్నారు.

ఎన్నికల కౌంటింగ్ కేంద్రానికి వచ్చే మార్గాలలో కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసామన్నారు. RGM, శాంతిరామ్ ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాల ప్రాంతం మొత్తం కౌంటింగ్ వరకు రెడ్ జోన్ గా ఏర్పాటు చేసి ఆ మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. అన్య వ్యక్తులెవరూ డ్రోన్ లను ఎగురవేయరాదని… నిభందనలను ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ వివరించారు. కౌంటింగ్ కు హాజరయ్యే అధికారులు, సిబ్బంది, మీడియా మిత్రులకు చెందిన వాహనాలు ఆర్జీయం హాస్టల్ క్యాంపస్ లో  పార్కింగ్ చేసుకోవాలన్నారు.  శ్రీశైలం, నంద్యాల, ఆళ్లగడ్డ,నందికొట్కూర్ నియోజకవర్గాలకు సంబంధించిన వారి వాహనాలు పార్టీలు వారిగా కేశవరెడ్డి స్కూల్ లో నిర్దేశించిన ప్రదేశంలో మాత్రమే పార్కింగ్ చేసుకోవాలని ఎస్పీ సూచించారు.

డోన్, బనగానపల్లి నియోజకవర్గాలకు చెందిన టిడిపి పార్టీకి చెందిన వాహనాలు బీసీ వెల్ఫేర్ స్కూల్ లో, డోన్, బనగానపల్లి నియోజకవర్గాలకు చెందిన YSRCP పార్టీకి సంబందించిన వాహనాలు ఎస్టీ వెల్ఫేర్ స్కూల్ లో పార్కింగ్ చేసుకోవాలని ఎస్పీ వివరించారు.