రాబోయే వానాకాలం పంట సీజన్ కు మన జిల్లాలో సమృద్ధిగా విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, అన్ని రకాల పంటలకు సంబంధించి విత్తనాల స్టాక్ డీలర్ల వద్ద ఉందని, రైతులు అనవసరపు ఆందోళనలు చెందవద్దని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. శనివారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశం మందిరంలో వానాకాలం విత్తనాల లభ్యతను వివరిస్తూ రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ తో కలిసి మీడి యా సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ మన జిల్లాలో రైతులకు అవసరమైన అన్ని రకాల విత్తనాలు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని, వచ్చే వానాకాలం పంటకు ఎక్కడా విత్తనాల కొరత రాకుండా పట్టిష్ట చర్యలు చేపట్టామని కలెక్టర్ తెలిపారు.
జిల్లాలో ఉన్న 353 విత్తన డీలర్ల ద్వారా రైతులకు అవసరమైన విత్తనాలు సరఫరా చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఉన్న లక్షా 55 వేల 496 మంది రైతులకు 2 లక్షల 77 వేల 720 ఎకరాల సాగు భూమి ఉందని, వీటిలో 2 లక్షల 8 వేల ఎకరాలలో వరి పంట, 60 వేల ఎకరాలలో పత్తి పంట, 12 వేల ఎకరాలలో కూరగాయలు పండ్లు ఇతర పంటలు సాగు చేస్తున్నారని తెలిపారు. జిల్లాలో ప్రతి పంటకు సంబంధించి అవసరానికి మించి 50 శాతం అదనంగా విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, ఎక్కడా విత్తనాల కొరత లేదని, ఎక్కడైనా విత్తనాల రవాణా, తదితర అంశాలలో చిన్న, చిన్న ఇబ్బందులు వచ్చి ఒకటి, రెండు రోజులు రైతులకు చేరడంలో ఆలస్యం కావచ్చని, విత్తనల స్టాక్ కు ఎక్కడ కొరత లేదని కలెక్టర్ తెలిపారు. రైతులు క్షేత్రస్థాయిలో సాగు చేస్తున్న పంటలు వారు వినియోగిస్తున్న విత్తనాలపై వ్యవసాయ అధికారుల ద్వారా సర్వే నిర్వహించి, సదరు విత్తనాలు సమీప విత్తన డీలర్ల వద్ద అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ తెలిపారు.
వానకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులకు అవసరమయ్యే పచ్చి రొట్టె విత్తనాలు సైతం అందుబాటు లో ఉన్నాయని, వరి సన్న రకాల విత్తనాల స్టాక్ లు, పత్తి విత్తనాలలో 134 రకాల విత్తనాలు అధికంగా ఉన్నాయని తెలిపారు. బీజి3 వంటి పత్తి విత్తనాలను నిషేధించడం జరిగిందని, వీటిని ఎక్కడా డీలర్లు విక్రయించ కుండా చర్యలు తీసుకున్నామ ని, రైతులు ఎక్కడ కూడా ఈ విత్తనాలను ఉపయోగించవ ద్దని, ఎవరైనా ఈ విత్తనాలు విక్రయిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని కలెక్టర్ పేర్కొ న్నారు. జిల్లాలో ఉన్న ప్రతి విత్తనపు, ఎరువుల డీలర్ దుకాణాలను తనిఖీ చేస్తూ స్టాక్ పరిశీలిస్తున్నామని, ప్రతి దుకాణం వద్ద అందు బాటులో ఉన్న స్టాక్ వివరాలు, వాటి రేట్లను నోటీస్ బోర్డ్ పై ఏర్పాటు చేయాలని, ప్రతి విక్రయం వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేస్తున్నామని తెలిపారు. పోలీసు శాఖ సహకారంతో నకిలీ విత్తనాల విక్రయాలపై గట్టి నిఘా ఏర్పాటు చేశామని, రైతులు ప్రభుత్వం గుర్తించిన లైసెన్స్ విత్తన డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలను కొనుగోలు చేయాలని, విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో రైతులు తప్పనిసరిగా బిల్లు రశీదు తీసుకోవాలని, సీల్డ్ ప్యాకెట్లను మాత్రమే రైతులు కొనుగోలు చేయాలని కలెక్టర్ సూచించారు.
విత్తనాల లభ్యతపై రైతులకు ఉన్న అపోహలు తొలగించేందుకు కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని, రైతులకు అపోహలు సందేహాలు ఉంటే కాల్ సెంటర్ నెంబర్ 9573951060 కు ఫోన్ చేయాలని కలెక్టర్ కోరారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే అబద్ధపు ప్రచారాలను రైతులు నమ్మవద్దని, జిల్లాలో ఎక్కడా విత్తనాల కొరత లేదని , రైతులకు అవసరమైన విత్తనాలు సకాలంలో సరఫరా చేసేందుకు జిల్లా యంత్రాంగం పటిష్ట కార్యాచరణ అమలు చేస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు.
రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ మాట్లాడుతూ కల్తీ విత్తనాలను అరికట్టేందుకు పోలీసు యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, రైతులు ప్రభుత్వం గుర్తించిన సర్టిఫైడ్ డీలర్లు వద్ద నుంచి మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయా లని, విడిగా ఎక్కడా విత్తనాలు కొనుగోలు చేయవద్దని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి కల్తీ విత్తనాలను రాకుండా అంతర్ జిల్లా అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని తెలిపారు. నకిలీ విత్తనాలపై ఏదైనా సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని పోలీస్ కమిషనర్ కోరారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆదిరెడ్డి, సంబంధిత అధికారులు, మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.