ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

కార్యకర్త జల్లయ్య హత్యపై చంద్రబాబు ఆగ్రహం

వాటి వెనుక పిన్నెల్లి హస్తం ఉందని ఆరోపణ

టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ కార్యకర్త జల్లయ్య హత్యపై తీవ్రస్థాయిలో స్పందించారు. ఒక్క మాచర్ల నియోజకవర్గంలోనే ఐదుగురు బీసీలను హత్య చేశారని, ఆ హత్యల వెనుక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హస్తం ఉందని ఆయన ఆరోపించారు. ప్రత్యేక కోర్టులో విచారణ జరిపించి హత్యలు చేసిన వారికి ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు.

జల్లయ్య అంత్యక్రియలు, ఆయన కుటుంబ సభ్యుల పరామర్శ కోసం వెళుతున్న టీడీపీ నేతలను అడ్డుకోవడం, అరెస్ట్ చేయడం పట్ల చంద్రబాబు మండిపడ్డారు. ప్రాణాలను కాపాడలేని పోలీసులు.. తమ నేతలను అడ్డుకోవడమేంటని ఆయన నిలదీశారు. జల్లయ్య మృతదేహాన్ని ఎక్కడకు తీసుకెళ్లారో కూడా చెప్పలేదని మండిపడ్డారు. సొంత గ్రామంలో అంత్యక్రియలు చేసుకునే అవకాశం కూడా ఇవ్వరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.