పోలీస్ శాఖలో ఎవరైనా రిటైర్మెంట్ తీసుకుంటే వారికిచ్చే గౌరవం అంతా ఇంతా కాదు. తోటి సిబ్బంది, అధికారులు గౌరవప్రదమైన వీడ్కోలు చెబుతారు. కానిస్టేబుల్ అయినా, ఎస్సై అయినా, ఆ పై స్థాయి అధికారి అయినా ఒకే రకంగా ట్రీట్ చేస్తారు. స్వయంగా పదవీ విరమణ పొందిన అధికారిని ఇంటికి తీసుకెళ్తారు. ఆత్మీయ సత్కారం చేస్తారు. సొంత డబ్బులతో విందు ఏర్పాటు చేస్తారు. కానీ ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో కనీస గౌరవం ఇవ్వలేదు. కనీసం ఆయనకు శుభాకాంక్షలు చెప్పేవారు కూడా లేకుండా పోయారు. అయితే ఈ పరిస్థితికి వైసీపీ సర్కార్ కారణమని పోలీస్ శాఖలో బలమైన చర్చ నడుస్తోంది. పోలీస్ శాఖలో ఇప్పటివరకు ఒక సంప్రదాయం నడిచేది. డిపార్ట్మెంట్లో ఎవరైనా పదవీ విరమణ పొందితే.. ప్రత్యేకంగా ఒక వాహనాన్ని అలంకరిస్తారు. ఆ వాహనానికి తాళ్లు కట్టి.. స్థాయిని బట్టి కిందిస్థాయి సిబ్బంది లాగుతూ ఆయన ఇంటికి తీసుకెళ్తారు. అక్కడే ఆత్మీయ సభను ఏర్పాటు చేస్తారు.
అనంతరం అధికారులు, సిబ్బంది సామూహిక విందు చేస్తారు. కానీ ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో ఇవేవీ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఆయన కింద వేలాదిమంది సిబ్బంది పనిచేశారు. కీలక కేసులు చేదించి ఆయనతో అభినందనలు అందుకున్న వారు కూడా ఉన్నారు. ఆయన సహచరుల గురించి చెప్పనవసరం లేదు. కానీ ఒక్క ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమల తప్పించి.. ఆయనతో పనిచేసిన ఏ ఒక్క అధికారి వచ్చి శుభాకాంక్షలు తెలపలేదు. ఒక అయిదారుగురు సిబ్బంది వచ్చి భుజాలపై ఎత్తుకొని మాత్రమే సాగనంపారు. అయితే పోలీస్ శాఖలో ఏబీ వెంకటేశ్వరరావుకు జరిగిన అవమానం ఒక గుణపాఠమే. గత ఐదు సంవ త్సరాలుగా ఏబీ వెంకటేశ్వరరావును వైసీపీ సర్కారు వెంటాడింది. న్యాయస్థానాలు, క్యాట్ ఆదేశాలను సైతం తుంగలో తొక్కింది. చివరకు ఏబీ వెంకటేశ్వరరావును ఎవరెవరు కలుస్తున్నారో నిఘా పెట్టింది. ఈ కారణంగానే ఆయనను కలిసేందుకు ఏ పోలీస్ అధికారి ఆసక్తి చూపలేదు.
ఒకవేళ ఆయనపై అభిమానం ఉన్నా.. కలిసిన తరువాత ఎదురయ్యే పరిణామాలు వారికి తెలుసు. అందుకే ఏబీ వెంకటేశ్వరరావుకు అవమానకర రీతిలో వీడ్కోలు జరిగింది. అయితే గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ సర్కార్ పై మొండి పట్టుదలతో పోరాడారు వెంకటేశ్వరరావు. చివరకు అనుకున్నది సాధించారు. పోలీస్ డ్రెస్ లోనే పదవీ విరమణ పొందారు. అంతకంటే గౌరవం ఇంకా ఏమి ఉంటుందని.. ప్రభుత్వం ఎంత అగౌర వపరిచినా.. ఆత్మవిశ్వాసంతో అడుగు వేశానని ఏబి వెంకటేశ్వరరావు భావోద్వేగంతో ప్రకటన చేశారు. మొత్తానికైతే ఏబి వెంకటేశ్వరరావు ఉదంతం పోలీస్ శాఖకు ఒక గుణపాఠమే.