ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

నైరుతి రాకతో వానలే… వానలు

వాతావరణ శాఖ కూల్ న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవనాలు ఏపీలోకి ఎంటరయినట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమలోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు ప్రవేశించాయని, ఇవి రాష్ట్రవ్యాప్తంగా మరింత విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు కోస్తా ఆంధ్ర ప్రదేశ్ & పరిసర ప్రాంతాలపై గల ఉపరితల అవర్తనము ఇప్పుడు పశ్చిమ మధ్య దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళా ఖాతంపై దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్-ఉత్తర తమిళనాడు తీరాలకు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ఉందినైరుతి రుతుపవనాలు మూడ్రోజుల ముందుగానే ఏపీలోకి ప్రవేశించాయి. రాయలసీమలోకి ఎంటరైన రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఈ ఏడాది మాన్‌సూన్ ఎఫెక్టుతో ఏపీలో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

పలుచోట్ల పిడుగులతో కూడిన వానలు పడే అవకాశమున్నట్టు హెచ్చరిస్తున్నారు. రెండ్రోజులపాటు తేలికపాటి వర్షాలు, ఆ తర్వాత ఐదురోజులు మోస్తరు నుంచి విస్తారంగా వానలు పడతాయని చెప్తున్నారు.నైరుతి రాకతో ఏపీలో పలుజిల్లాలో అకస్మాత్తుగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. విశాఖలో ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. పలుచోట్ల రోడ్లపై చెట్లు కూలడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎన్టీఆర్‌ జిల్లాలోని జగ్గయ్యపేటలో ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడింది. అనంతపురంలో భారీ వాన పడటంతో పలుచోట్ల విత్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కర్నూలు జిల్లాలోని మంత్రాలయం, కోడుమూరులో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు రుతుపవనాలు విస్తరించడంతో వర్షాలు కురుస్తున్నాయి.మరోవైపు తెలంగాణలోనూ వానలు పడుతున్నాయి. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, రంగారెడ్డి, వికారాబాద్‌, హైదరాబాద్‌, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరి, నేరేడ్‌మెట్‌, ఉప్పల్‌, రామంతాపూర్‌, మేడిపల్లి, బోడుప్పల్ ఏరియాల్లో వాన పడింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. సుమారు గంటకు పైగా భారీ వర్షం కురవడంతో హుస్నాబాద్ పట్టణంలోని ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వికారాబాద్ నియోజకవర్గం బంటారం మండలం నాగ్వారం వద్ద వాగులో కారు కొట్టుకుపోయింది. కారులో ఉన్న నలుగురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.