ఆంధ్రప్రదేశ్ రాజకీయం

పడి… లేచిన.. ఆ ముగ్గురు

అసెంబ్లీ ఎన్నికలలో బరిలో నిలిచి ఓడిపోయిన ముగ్గురు బీజేపీ లీడర్లు.. పార్లమెంటు ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి పార్లమెంటులో అడుగు పెట్టబోతున్నారు. ఆ ఇద్దరూ నేతలు తమ సిట్టింగ్ స్థానాలు నిలబెట్టుకోగా, మరోకరు కొత్తగా‌ పార్లమెంటులో అడుగు బెట్టబోతున్నారు. కరీంనగర్ ఎంపీగా రెండవసారి భారీ మెజారిటీతో గెలుపొందారు బండిసంజయ్. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడుగా బిజేపి పార్టీ బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు ఆయన. ప్రజాసంగ్రామ యాత్రతో‌ అప్పటి బీఅర్ఎస్ ప్రభుత్వంపై‌ పోరాటం చెయడంలో సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. 2018లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసిన బండిసంజయ్ ఓటమి చెందడంతో తరువాత జరిగిన పార్లమెంటు ఎన్నికలో‌ భారీ మెజారిటితో గెలుపొందారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా పనిచేసి కార్యకర్తల్లో జోష్ తీసుకువచ్చి బీజెపికి మంచి ఊపు తీసుకువచ్చారు. బండిసంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే హుజురాబాద్, దుబ్బాక బై ఎలక్షన్స్లో బిజేపి ఘన విజయం‌‌ సాధించింది.

2023 అసెంబ్లీ ఎన్నికలు వచ్చే సరికి పార్టీ అధ్యక్షుడు నుండి‌ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో కరీంనగర్ అసెంబ్లీకి‌ పోటి చేసారు. స్టార్ క్యాంపెయినర్‎గా రాష్ట్రం అంతా విస్తృత ‌ప్రచారం చేస్తునే పార్టీ అధిష్టానం అదేశాల మేరకు‌ కరీంనగర్ ‌అసెంబ్లీకీ పోటి చేసారు. అప్పటి మంత్రి గంగుల కమలాకర్ చేతిలో ‌స్వల్ప మెజారిటీతో ఓటమి చెందినా ఇప్పుడు జరిగిన పార్లమెంటు ఎన్నికలలో రికార్డు మెజారిటీతో గెలిపొందారు. కరీంనగర్ పార్లమెంటు ‌చరిత్రలోనే అత్యధికంగా 2,25,209 మెజారిటీతో గెలుపొందారు. ఇక ఈటెల రాజేందర్ కమలాపూర్ నియోజకవర్గం, హుజురాబాద్ ‌నియోజకవర్గాల నుండి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. 2023 నవంబర్‎లో జరిగిన‌ శాసనసభ ఎన్నికలలో హుజురాబాద్, గజ్వేల్ రెండు నియోజకవర్గాలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసారు. రెండు నియోజకవర్గాలలో కూడా నిరాశ ఎదురయింది. కమలాపూర్, హుజూరాబాద్ నియోజక వర్గాల నుండి వరుసగా ఏడుసార్లు గెలిచారు ఈటెల. కేసీఆర్‎ను విభేదించి బిజేపిలో చేరిన ఈటెలని భారీ మెజారిటీతో గెలిపించారు హుజురాబాద్ ఓటర్లు.

ఉప ఎన్నికల తరువాత హుజురాబాద్ పట్టించుకోక పోవడంతో పాటుగా బీఅర్ఎస్ అభ్యర్థి సానుభూతి ఏర్పాడటం ఈ రెండూ కలిసి వచ్చాయి. ఈటెల రాజేందర్ గజ్వేల్, హుజురాబాద్‎లలో పోటీ చేయడంతో హుజూరాబాద్‎లో క్యాంపెయింగ్ సరిగా చేయక పోవడంతో ఓటమి చెందారు. హుజురాబాద్‎లో ఓడినా తన పట్టు నిలుపుకునేందుకు భారతదేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం మల్కాజ్‌గిరి నుండి భాజపా అభ్యర్థిగా పోటీ చేశారు. ఆరు నెలల‌ ముందు నుండే మల్కాజ్‌గిరిలో వివిధ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్న రాజేందర్ ఏకంగా 3,91,475 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ధర్మపురి అరవింద్ గత పార్లమెంటు ఎన్నికలలో బీజేపీ నుండి అనూహ్యంగా టికెట్ దక్కించుకుని కేసిఆర్ కూతురు, అప్పటి ‌స్థానిక ఎంపి కవితపై భారీ మెజారిటీతో గెలుపొందారు. పసుపుబోర్డు తీసుకువస్తానని.. లేకుండా తాను రాజీనామా చేస్తానని బాండ్ పేపర్‎పై‌ సంతకం చేసి కవిత‎పై విజయం ‌సాధించారు‌. అనుకున్న విధంగానే కేంద్రాన్ని ఒప్పించి పసుపుకి సంబంధించిన ‌స్పైస్ బోర్డుని తీసుకువచ్చారు.

అయితే బిజేపి అధిష్టానం ‌కొరుట్ల నుండి ఎమ్మెల్యేగా‌ పోటీ చేయాలని అదేశించడంతో కొరుట్ల నుండి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటిచేశారు. కోరుట్ల ఫలితం కలిసిరాకున్నా.. ఇప్పుడు నిజామాబార్ ఎంపిగా రెండవసారి పోటీ చేసి కాంగ్రెస్ ‌సీనియర్ నాయకులు జీవన్ రెడ్డిపై ‌గెలుపోందారు. రెండవసారి పార్లమెంటులో అడుగు పెట్టబోతున్నారు అర్వింద్. ఈ ముగ్గురు బిజేపి‌ సీనియర్ నేతలు అప్పుడు ‌అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి చెందినప్పటికీ.. ఇప్పుడు ‌జరిగిన పార్లమెంటు ఎన్నికలలో భారీ విజయాలు‌ సాధించారు.