తెలంగాణ రాజకీయం

కొత్త సీఎస్, డీజీపీ…?

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల కోడ్‌ ముగియడంతో తిరిగి ప్రజాపాలనపై ఫోకస్ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగానే అత్యంత కీలకమైన పోలీస్‌ శాఖలో భారీ ప్రక్షాళనకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. కొత్త టీంను సెట్‌ చేసుకోవడంపై సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే కసరత్తులు పూర్తి చేశారని, ఐపీఎస్‌ అధికారుల బదిలీలు పెద్ద సంఖ్యలో జరిగే ఛాన్స్ ఉన్నట్టు టాక్. డీజీపీ, పలువురు పోలీస్‌ కమిషనర్లు సహా పలు కీలక పోస్టుల్లో ఉన్న అధికారులకు స్థాన చలనం తప్పదనే చర్చ జోరుగా నడుస్తోంది. కీలక బాధ్యతల్లో కొత్త అధికారులను నియమించడంతో పాటు ఇప్పటికే ఒకటికి మించి అదనపు పోస్టులతో పని భారం ఉన్న అధికారులకు ఉపశమనం కలిగించే ఛాన్స్ ఉంది. ఈ మేరకు ఒకట్రెండు రోజుల్లోనే ఉత్తర్వులు జారీ చేసే చాన్స్‌ ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం డీజీపీ హెచ్‌ఓపీఎఫ్‌ హెడ్‌ఆఫ్‌ పోలీస్‌ ఫోర్స్‌గా ఉన్న రవిగుప్తా స్థానంలో కొత్త డీజీపీగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు సీవీ ఆనంద్, శివధర్‌రెడ్డి, జితేందర్‌ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం డీజీ ర్యాంకులో ఉన్న సీవీ ఆనంద్‌ అత్యంత కీలకమైన ఏసీబీ డీజీ పోస్టులో ఉన్నారు.

డీజీ ర్యాంకులో ఉన్న మరో అధికారి జితేందర్‌ హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం సీనియర్‌ ఐపీఎస్‌ శివధర్‌రెడ్డి వైపే మొగ్గు చూపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం అడిషనల్‌ డీజీ ర్యాంకులో ఇంటిలిజెన్స్‌ చీఫ్‌గా ఉన్న శివధర్‌రెడ్డిని ఇటీవల ఏర్పడిన రెండు డీజీపీ ర్యాంకు ఖాళీల భర్తీలో భాగంగా పదోన్నతి ఇచ్చి పోలీస్‌ బాస్‌గా నియమించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం డీజీపీ ర్యాంకులో నలుగురు సీనియర్‌ ఐపీఎస్‌లు కొనసాగుతున్నారు. వీరిలో రవిగుప్తాతో పాటు అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్స్ టైంలో అనూహ్యంగా రోడ్డు సేఫ్టీ అథారిటీ చైర్మన్‌గా బదిలీ అయిన అంజనీకుమార్, సీవీ ఆనంద్, జితేందర్‌ ఉన్నారు. డీజీపీ ర్యాంకులోనే విజిలెన్స్‌ డీజీగా ఉన్న రాజీవ్‌రతన్‌ గుండెపోటుతో హఠాన్మరణం పాలయ్యారు. అదేవిధంగా టీఎస్‌ నార్కోటిక్స్‌ బ్యూరో డైరెక్టర్‌గా పనిచేసిన సందీప్‌ శాండిల్య కొద్దిరోజుల క్రితం పదవీ విరమణ పొందారు. ఇలా రెండు డీజీపీ ర్యాంకులు ఖాళీ అయ్యాయి.ప్రస్తుతం హైదరాబాద్‌ సీపీగా ఉన్న కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, ఇంటిలిజెన్స్‌ అడిషనల్‌ డీజీగా ఉన్న శివధర్‌రెడ్డిలకు డీజీపీలుగా పదోన్నతి లభించే ఛాన్స్ ఉంది.

కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ మొహంతి, వరంగల్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌జా, రామగుండం సీపీ శ్రీనివాసులుకు స్థాన చలనం కలిగే ఛాన్స్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇంటిలిజెన్స్‌ ఏడీజీ పోస్టులో ఉన్న శివధర్‌రెడ్డికి డీజీపీగా బాధ్యతలు అప్పగిస్తే ఆ స్థానంలోకి మరో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి రమేశ్‌రెడ్డి వెళ్లే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అడిషనల్‌ డీజీగా ఉన్న శిఖా గోయల్‌ వద్ద కీలక పోస్టులైన సీఐడీ, మహిళా భద్రత విభాగం, టీఎస్‌ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరోలు ఉన్నాయి. వీటిలో కొన్నింటిని ఇతర ఐపీఎస్‌లకు అప్పగించనున్నారు.