ఏపీలో కూటమి కట్టి సూపర్ సక్సెస్ అయ్యాయి టీడీపీ, బీజేపీ, జనసేన. మొత్తం 25 ఎంపీల్లో 21 స్థానాలను తమ ఖాతాలో వేసుకున్నాయి. టీడీపీ నుంచి 16మంది, బీజేపీ నుంచి ముగ్గురు, జనసేన నుంచి ఇద్దరు ఎంపీలుగా గెలిచారు. అయితే, ఏపీకి కేంద్ర కేబినెట్‌లో నాలుగు బెర్తులు దక్కుతాయనే టాక్ వినిపిస్తోంది. మూడు టీడీపీకి… ఒకటి బీజేపీకి ఇస్తారనే ప్రచారం నడుస్తోంది. టీడీపీ నుంచి ముగ్గురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయ్. అందులో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు పేరు టాప్‌లో ఉంది. ఢిల్లీ పెద్దలతో రామ్మోహన్‌కు సత్సంబంధాలు ఉన్నాయి. అంతే కాకుండా దీటైన వాగ్దాటి.. పలు అంశాలపై విసృతమైన నాలెడ్జ్ ఉంది. పార్లమెంట్‌లో అతని స్పీచ్‌లకు కూడా మంచి అప్లాజ్ వస్తూ ఉంటుంది. ఈ క్రమంలో రామ్మోహన్ నాయుడుకు పదవి ఖాయమనే ప్రచారం జరుగుతోంది. అలాగే, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి కేంద్ర మంత్రి పదవి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.
ఇక, ఎస్సీ కోటాలో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావుకు ఛాన్స్ దక్కొచ్చని అంటున్నారు. బీజేపీ నుంచి ఇద్దరు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయ్. పురంధేశ్వరి, సీఎం రమేష్… వీళ్లిద్దరిలో ఒకరికి పదవి గ్యారంటీ అంటున్నారు. అటు జనసేనకు ఒక మంత్రి పదవి వస్తుందని తొలుత ప్రచారం జరిగినా.. ప్రస్తుతం ఉన్న సమీకరణాల దృష్ట్యా ఈ సారికి చాన్స్ ఉండకపోవచ్చని అంటున్నారు.