కేంద్రంలో కొత్త ఎన్‌డియే ప్రభుత్వం ఏర్పాటైన నేపధ్యంలో లోక్‌సభ స్పీకర్ ఎంపికపై బీజేపీ అధిష్టానం దృష్టి సారించింది. లోక్‌సభ స్పీకర్ పదవి ఎవరికి ఇవ్వాలనే అంశంపై బిజెపి అగ్రనాయకత్వం కసరత్తు చేస్తోంది.
అయితే లోక్‌సభ స్పీకర్ పదవిని తెలుగుదేశం పార్టీకి ఇవ్వాలని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీపై ఒత్తిడి తెస్తున్నారు. కానీ అనేక సర్దుబాట్లు, సంప్రదింపుల తర్వాత బిజెపి ఎంపికే లోక్‌సభ స్పీకర్ పదవిని ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బిజెపి తరఫున ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి లోక్ సభ స్థానం నుంచి విజయం సాధించిన ఆ రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు పురంధీశ్వరికి లోక్‌సభ స్పీకర్ పదవి ఇచ్చేందుకు బిజెపి నాయకత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఏపీ, తెలంగాణలో బాగా పనిచేసినందున లోక్‌సభ స్పీకర్‌గా పురందేశ్వరి పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. 2014 నుంచి 2019 మధ్య మోదీ తొలి టర్మ్‌లో సుమిత్రా మహాజన్ మహిళా స్పీకర్‌గా ఉన్నారు.
ఇప్పుడు బీజేపీ నారీ శక్తికి పెద్దపీట వేస్తుండడంతో పురంధేశ్వరి పేరును పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. పురంధేశ్వరి మాజీ మంత్రి, హిందీ, ఆంగ్లంలో కూడా మంచి ప్రావీణ్యం ఉన్నందున ఆమె పట్ల పార్టీ అధిష్టానంగా మొగ్గుచూపుతోంది. తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పాటులో పురంధేశ్వరి కీలక పాత్ర వహించారు. ఈ ఎన్నికల్లో పురంధేశ్వరి రాజమండ్రి లోక్ సభ నుంచి వైసీపీ అభ్యర్ధి గూడురు శ్రీనివాస్ చేతిలో 2,39,139 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. పురంధేశ్వరి రాజకీయ ప్రస్థానం పరిశీలిస్తే 2004లో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని బాపట్ల నుంచి 14వ లోక్ సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత డీ లిమిటేషన్‌లో అది ఎస్సీ రిజర్వ్ స్థానం కావడంతో 2009లో విశాఖ పట్నం నుంచి ఎంపీగా పోటీ చేసి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. 2006లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర మానవ వనరులు శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు ఆమె బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత ఏపీ విభజన నేపథ్యంలో ఆమె భారతీయ జనతా పార్టీలో చేరారు.
2014 ఎన్నికల్లో రాజంపేట నుంచి బీజేపీ తరుపున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2024లో రాజమండ్రి నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. ఇంత రాజకీయ నేపధ్యం ఉన్న పురంధీశ్వరి తాజాగా లోక్ సభ స్పీకర్‌గా ఎన్నిక కావడం లాంఛనమే అంటున్నారు. ఒక వేళ లోక్‌సభ స్పీకర్‌గా నియమించబడితే అనంత శయనం అయ్యంగార్, నీలం సంజీవ్ రెడ్డి, జీఎంసీ బాలయోగి తర్వాత ఆ పదవి చేపట్టబోతున్న నాలుగో తెలుగు వ్యక్తిగా ఆమె రికార్డులకు ఎక్కుతారు. అంతేకాదు మీరా కుమార్, సుమిత్రా మహాజన్‌ల తర్వాత మూడో మహిళా స్పీకర్‌గా పురంధేశ్వరి నిలుస్తారని చర్చ జరుగుతోంది.