ఏపీలో సీఎం జగన్ ఎలక్షన్ 2024 కి సిద్దమవుతున్నారు. వైనాట్ 175 అంటూ తన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. అందులో భాగంగా సగానికపైగా అభ్యర్థులను మారుస్తూ జాబితా సిద్దం చేస్తున్నారు. మరో వారం రోజుల్లో ఎన్నికల ప్రాచారాన్ని కూడా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో టికెట్ విషయంలో భంగపడ్డ అభ్యర్థులు ఇలా తమ అసమ్మతి రాగాన్ని వినిపిస్తున్నారు. అన్నయ్యకు టికెట్ ఇవ్వొద్దని ఓ తమ్ముడు.. కుట్ర చేశారంటూ ఓ ఎమ్మెల్యే ఆవేదన. నాన్ లోకల్‌కు వద్దంటూ మరో నేత మండిపాటు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ సీటు – హీటు పెరిగిపోతోంది. వైసీపీలో టికెట్లు రానివాళ్ల ఆవేదన ఆగ్రహంగా మారి నిరసనల స్వరం వినిపిస్తోంది.వైసీపీలో.. అసెంబ్లీ, ఎంపీ సీట్లలో ఇన్‌ఛార్జీల మార్పులు చేర్పుల కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటికే నాలుగు లిస్టులు వచ్చాయి. 68 అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లో మార్పులు జరిగాయి. టికెట్లు రానివాళ్లు, ఈ మార్పులపై మండిపడుతున్నారు. తిరువూరులో వైసీపీ ఎమ్మెల్యే రక్షణ నిధి స్థానంలో..ఇన్‌ఛార్జీగా స్వామిదాస్‌ను నియమించింది వైసీపీ అధిష్టానం.
దీంతో ఎమ్మెల్యే రక్షణనిధి సంచలన వ్యాఖ్యలు చేశారు. టిక్కెట్ దక్కకుండా చేయడానికి గత నాలుగైదు నెలల నుంచి తనపై కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. తనను ఇంతగా బాధపెట్టిన తర్వాత అధిష్ఠానం పిలిచినా వెళ్లబోనన్నారు ఆయన. రానున్న ఎన్నికల్లో తప్పకుండా పోటీచేస్తానన్న రక్షణనిధి.. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు.ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి సొంత ఇంటి నుంచే అసమ్మతి సెగ తగులుతోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నల్లపురెడ్డికి కోవూరు అసెంబ్లీ టికెట్ ఇవ్వొద్దంటూ, ఆయన సోదరుడు రాజేంద్రనాథ్ రెడ్డి..వైసీపీ అధిష్టానానికి విజ్ఞప్తి చేసిన ఆడియో బయటకు రావడం కలకలం రేపింది. కార్యకర్తలను ప్రసన్నకుమార్‌రెడ్డి పక్కనపెట్టారని ఆ ఆడియోలో రాజేంద్ర ఆరోపించారు. ఇక అమలాపురం వైసీపీలో అసమ్మతి సెగలు రేగాయి.
ఆత్మీయ సమావేశం పేరుతో వైసీపీ నేత కుంచె రమణారావు బల ప్రదర్శన చేశారు. మంత్రి విశ్వరూప్ టార్గెట్‌గా పరోక్షంగా విమర్శలు ఎక్కుపెట్టారు. అమలాపురం సీటు.. స్థానికులకే ఇవ్వాలని రమణారావు డిమాండ్ చేశారు. అయితే సీట్ల సర్దుబాటు పూర్తయ్యాక గొడవలు సర్దుమణుగుతాయని, అసమ్మతి స్వరాలకు అడ్డుకట్ట పడుతుందని వైసీపీ అధిష్టానం భావిస్తోంది.