ఈ ఎన్నికల్లో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఓడిపోయారు. రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి చేతిలో 76 వేల ఓట్లతో ఓటమి చవిచూశారు. బిజెపి నుంచి ఆరుగురు పోటీ చేయగా.. ముగ్గురుకి ఓటమి ఎదురైంది. అందులో కిరణ్ కుమార్ రెడ్డి ఒకరు. అయితే రాజంపేట నియోజకవర్గం క్రిటికల్ అని తెలిసినా కిరణ్ రంగంలోకి దిగారు. అయితే ఆయన ఓడిపోయినా కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చింది. ఏపీలో కూటమి ప్రభుత్వం విజయం సాధించింది. అటు సోదరుడు కిషోర్ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఇటువంటి తరుణంలో కిరణ్ కుమార్ రెడ్డి సేవలను వేరే విధంగా వినియోగించుకోవాలని బిజెపితో పాటు చంద్రబాబు భావిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో నల్లారి కుటుంబానికి ప్రత్యేక రాజకీయ నేపథ్యం.
సుదీర్ఘకాలం ఆ కుటుంబం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగింది. తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన కిరణ్ పలుసార్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెక్ చెప్పడంతో ఎప్పుడూ మంత్రి పదవి దక్కలేదు. రాజశేఖర్ రెడ్డి రెండోసారి అధికారంలోకి వచ్చిన తరుణంలో.. అనూహ్యంగా స్పీకర్ పదవి కిరణ్ కుమార్ రెడ్డికి వరించింది. 2010లో రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో రోశయ్య సీఎం అయ్యారు. కొద్ది రోజులకే ఆయనను మార్చి స్పీకర్ గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ హై కమాండ్ అవకాశం ఇచ్చింది. మూడేళ్ల పాటు ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా కిరణ్ వ్యవహరించారు. ఉమ్మడి ఏపీకి ఆయనే చివరి సీఎం.రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీతో విభేదించారు కిరణ్ కుమార్ రెడ్డి. సమైక్యాంధ్ర పార్టీని స్థాపించారు. 2014ఎన్నికల్లో పోటీ చేశారు. ఒక్క స్థానాన్ని కూడా గెలవలేకపోయారు. అయితే ఓట్లు చీల్చి వైసిపి ఓటమికి కారణమయ్యారు. అక్కడ నుంచి పొలిటికల్ గా సైలెంట్ అయ్యారు. 2019 ఎన్నికల్లో సైతం కనిపించలేదు. కానీ ఈ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరారు.
కానీ ఎక్కువ రోజులు అక్కడ ఇమడ లేకపోయారు. బిజెపి హై కమాండ్ పెద్దల పిలుపు మేరకు ఆ పార్టీలో చేరారు. ఏపీలో పొత్తుల్లో భాగంగా రాజంపేట ఎంపీ స్థానం నుంచి పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థి మిధున్ రెడ్డికి గట్టి పోటీ ఇచ్చారు. అయితే అటు కేంద్రంలో బిజెపి అధికారంలోకి రావడం, ఇటు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో విజయం సాధించడంతో కిరణ్ కు మంచి ఛాన్స్ ఇవ్వాలని కేంద్ర పెద్దలు భావిస్తున్నారు. కిరణ్ విషయంలో చంద్రబాబు సైతం సుముఖంగా ఉండడంతో ఆయన పేరును గవర్నర్ పోస్ట్ కు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి రాష్ట్రంపై కిరణ్ కు మంచి పట్టు ఉంది. ప్రస్తుతం తెలంగాణ గవర్నర్ గా ఉన్న తమిళ సై తిరిగి రాజకీయాల్లో ప్రవేశించారు.
తమిళనాడు రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. తెలంగాణలో బిజెపి ఎనిమిది ఎంపీ సీట్లను గెలుచుకుంది. ఈ తరుణంలో రాష్ట్రంపై సమగ్ర అవగాహన ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గవర్నర్ అయితే బిజెపికి తప్పకుండా ప్రయోజనం చేకూరుతుంది. అందుకే కిరణ్ పేరు ఖరారు చేసినట్లు సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.