తెలంగాణలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలపై విచారణ చేపడుతున్న జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా మంగళవారం తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండ రామ్, విద్యుత్ శాఖ అధికారి, నాటి విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేత కె. రఘ కమిషన్ ముందు హాజరై నాటి పరిస్థితులను కమిషన్ దృష్టికి తెచ్చారు. నాటి ప్రభుత్వ పెద్దల ఒంటెత్తు పోకడలు, అనాలోచిత, తొందరపాటు నిర్ణయాల కారణంగా విద్యుత్ కొనుగోళ్ల మొదలు, నూతన విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం వంటి పలు అంశాల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయని వారు కమిషన్‌కు వివరించారు. బీఆర్కే భవన్‌లో కమిషన్ కార్యాలయంలో కమిషన్ ముందు హాజరైన వీరు పలు అంశాలపై సమాచారమిచ్చారు.కొత్తగూడెం జిల్లా మణుగూరు వద్ద గోదావరి తీరంలో 1,080 మెగావాట్ల భద్రాద్రి విద్యుత్ ప్లాంటు.. ఏపీలో నిర్మిస్తున్న పోలవరం పూర్తయితే మునిగే ప్రమాదం ఉందని కేంద్రం హెచ్చరించినా వినలేదన్నారు.
భవిష్యత్తులో గోదావరికి భారీ వరద వచ్చినా ప్లాంటు మునుగుతుందని ఇంజనీర్లు చెప్పినా, వరద రక్షణ గోడలు కడతామన్నారని చెప్పారు. అనుకున్నట్లుగా 2020 ఆగస్టులో కురిసిన భారీ వర్షాలతో భద్రాద్రి విద్యుత్ కేంద్రంలోపలికీ నీరు చేరిందని ఆయన గుర్తుచేశారు. యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణ పనులకు టెండర్లు వేయకుండా బీహెచ్‌ఈఎల్‌కు కాం ట్రాక్ట్ ఇవ్వడం, ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ పవర్, రెనేవబుల్ ఎనర్జీ వైపు వెళుతుంటే గత పాలకులు థర్మల్ పవర్ వైపు దృష్టి సారించటం వంటి అంశాలను కమిషన్ ముందు లేవనెత్తినట్లు తెలుస్తోంది.నాటి కేంద్ర ప్రభుత్వం చెప్పినా వినకుండా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ హడావుడిగా 1000 మెగావాట్ల అదనపు విద్యుత్ కొనుగోలు కోసం ఛత్తీస్‌గఢ్‌తో ఒప్పందాలు చేసుకున్నారనీ, ఈ కొనుగోలుకు ఈఆర్సీ అనుమతి లేకపోయినా, ఉందని అబద్ధాలు చెప్పారని ఆయన కమిషన్ దృష్టికి తెచ్చారు. తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఈ ఒప్పందం రద్దు చేసుకుందనీ, ఆ అనాలోచిత నిర్ణయంతో ప్రభుత్వంపై కోట్లాది రూపాయల అదనపు భారం పడిందని తెలిపారు.
అనంతరం విద్యుత్ శాఖ అధికారి, జేఏసీ నేత కె. రఘు కమిషన్‌ను కలిసి అనేక అంశాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఛత్తీస్‌ఘడ్‌తో విద్యుత్ కొనుగోలు విషయంలో పాత విధానాలను పక్కనబెట్టిన తీరును కమిషన్‌కు వివరించినట్లు తెలుస్తోంది. వెయ్యి మెగావాట్ల ఒప్పందం జరిగితే ఆ సరఫరాయే సరిగా జరగలేదనీ, అదనంగా మరో వెయ్యి మెగావాట్ల విద్యుత్ కోసం హడావుడిగా ఒప్పందం చేసుకున్నారనీ, తర్వాత తప్పు తెలుసుకుని ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని ప్రయత్నించినా అది సాధ్యపడలేదని, గత ప్రభుత్వ నిర్వాకంతో రూ. 2600 కోట్ల మేర ఖజానా మీద భారంపడిన విషయాన్ని గణాంకాలతో సహా వివరించారు. టెండర్లకు వెళ్లకుండా ఏకపక్షంగా కుదుర్చుకున్న ఈ ఒప్పందాన్ని ఆమోదించొద్దని ఆనాడే తాను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్‌ఈఆర్‌సీ)కి 10 పేజీల విజ్ఞప్తి లేఖను అందించానని గుర్తుచేశారు.భద్రాద్రి థర్మల్ ప్లాంట్‌లో సబ్ క్రిటికల్ టెక్నాలజీ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఛాయిస్ కాదనీ, 2010లో డిజైన్ చేసిన యంత్రాలను, టెక్నాలజీని బీహెచ్ఈఎల్ సంస్థ.. ప్రభుత్వానికి అంటగట్టిందని, ఇవేవీ నేటి అవసరాలకు పనికొచ్చేవి కాదని తెలిపారు.
అసలు ప్లాంటు నిర్మించ తలపెట్టిన లొకేషన్ కూడా సరైనది కాదనీ, పర్యావరణ అంశాలను గాలికొదిలేశారని, గోదావరికి వరద వస్తే ప్లాంటు మునగటం ఖాయమని వివరించారు. యాదాద్రి విషయంలోనూ ఇవే తప్పులు జరిగాయని, నిపుణుల మాటను పక్కనబెట్టి బొగ్గు గనులు లేని చోట ప్లాంటు ఆరంభించారనీ, దీనివల్ల రవాణా చార్జీల భారం పెరిగిందని తెలిపారు. 2016లోనే భద్రాద్రి, యాదాద్రి ప్లాంట్ల విషయంలో ప్రభుత్వ నిర్ణయాలు సరికావంటూ రెగ్యులేటరీ కమిషన్ ముందు మొత్తుకున్నా లాభం లేపోయిందన్నారు. దీనివల్ల వేల కోట్ల నష్టం వాటిల్లిందన్నారు.