ఆర్ఎస్‌ను ట్రాక్‌లో పెట్టడంపై ఆ పార్టీ అధినేత కేసీఆర్ దృష్టిసారించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్.. ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఒక్క స్థానంలో కూడా గెలవలేక ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ చతికిలపడింది. ఈ ఓటమి తర్వాత పార్టీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయబోతున్నారు కేసీఆర్. దీనికి సంబంధించిన కసరత్తును ఆయన ఇప్పటికే మొదలుపెట్టినట్లు ఆ పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.మరోసారి ఉద్యమ పార్టీ లక్షణాలను పార్టీకి తీసుకొచ్చే దిశగా కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమంలో పార్టీ గ్రామస్థాయిలో కూడా బలంగా ఉండేది. ప్రత్యేకంగా గ్రామస్థాయిలో పార్టీకి నాయకులంటూ లేకపోయినా ప్రజలే కార్యకర్తలుగా పని చేశారు. పార్టీ అనుబంధ సంఘాలు కూడా బలంగా పనిచేశాయి. ఉద్యమ సమయంలో ప్రతి రంగానికి ఒక అనుబంధ సంఘాన్ని ఏర్పాటు చేశారు కేసీఆర్. ఆటో యూనియన్ నుంచి సింగరేణి వరకు ప్రతి రంగానికి అనుబంధ సంఘం ఉంది.
కానీ 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీతో సహా అనేక అనుబంధ సంఘాలు బలహీనపడ్డాయి. పార్టీకి అనుబంధంగా పనిచేసే టీచర్స్ యూనియన్ కూడా ఉనికి కోల్పోయింది. ఇక తెలంగాణ ఉద్యమ సమయంలో చురుగ్గా పనిచేసిన పార్టీ విద్యార్థి అనుబంధ సంఘం టిఆర్ఎస్వి గత పదేళ్లుగా ఎక్కడా పెద్దగా కార్యక్రమాలు చేపట్టలేదు. యూత్ విభాగానికి అసలు నాయకత్వమే లేకుండా పోయింది.ఇక పార్టీ విషయానికొస్తే పొలిటికల్ బ్యూరో గత పదేళ్లుగా క్రియాశీలకంగా పనిచేయలేదు. పార్టీకి జిల్లా అధ్యక్షులున్నా పూర్తిస్థాయి జిల్లా కమిటీలు లేవు. ఇక రాష్ట్ర కమిటీలో అన్ని బాధ్యతల్ని భర్తీ చేయలేదు. జిల్లా అధ్యక్షులుగా ఎమ్మెల్యేలు, ఎంపీలను నియమించడం వల్ల అక్కడ కూడా అనేక సమస్యలు తలెత్తాయి. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి ఎదురుదెబ్బ తగలడంతో.. కేసీఆర్ నష్టనివారణ చర్యలకు పూనుకుంటున్నారు. పార్టీని ట్రాక్‌లో పెట్టడంపై ఫుల్ ఫోకస్ చేసిన ఆయన.. ఈ దిశగా పార్టీలో ప్రక్షాళన చేపట్టడంపై దృష్టిసారించారు.
గత కొద్ది రోజులుగా ఫామ్ హౌస్‌లోనే ఉన్న గులాబీ బాస్.. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బీఆర్ఎస్‌ను బలోపేతం చేసేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తున్నారట బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నందున.. ఇక ప్రజా సమస్యలపై పోరాడేందుకు పార్టీని సమాయత్తం చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. ప్రజా పోరాటాలను విజయవంతం చేయడంలో అనుబంధ సంఘాలు, జిల్లా కమిటీలు చురుకైన పాత్ర పోషించాల్సిన అవసరముందని భావిస్తున్నారు. గతంలో ఎమ్మెల్యేలు మాత్రమే పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలను పక్కనపెట్టి యువతకు జిల్లా అధ్యక్షులుగా అవకాశాలు ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా కమిటీల నియామకం కోసం ఒక అడహక్ కమిటీ వేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అలాగే పొలిట్ బ్యూరో సహా రాష్ట్ర కమిటీని పూర్తిస్థాయిలో భర్తీ చేయాలని భావిస్తున్నారు.
మండలాల వారిగా.. గ్రామాల వారిగా జెండా పండుగ నిర్వహించి కొత్త కమిటీలు పని చేయనున్నాయి. కేసీఆర్ కూడా ఏదో ఒక కార్యక్రమం పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు.. రాష్ట్రవ్యాప్త పర్యటనలు చేపట్టాలని భావిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. జిల్లా కమిటీలు, అనుబంద సంఘాలతో ఎప్పటికప్పుడు సమావేశమవుతూ పార్టీ కార్యక్రమాలకు దిశానిర్దేశం చేయనున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ పార్టీకి పూర్వ వైభవం సాధించాలని కేసీఆర్ ఉవ్విళ్లూరుతున్నారు.