జాతీయం రాజకీయం

హుందా రాజకీయాలకు నవీన్ పట్నాయక్

నిరాడంబరతకు, హుందాతనానికి మారుపేరు ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్. మొన్నటి ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోని బీజేడి ఓడిపోయింది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. 25 సంవత్సరాల నవీన్ పాలనకు తెరపడింది. అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన నవీన్ అప్రతిహాసంగా ఒడిశాను ఏలారు. కానీ ఈ ఎన్నికల్లో ఒడిశా ప్రజలు తిరస్కరించారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించిన నవీన్ నేరుగా గవర్నర్ వద్దకు వెళ్లి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. దేశ చరిత్రలో ఇదో అరుదైన అధ్యయనం. ఓటమితో ఎవరు ఇటువంటి చర్యలకు దిగరు. కానీ ఓటమిని హుందాతనంతో ఒప్పుకున్నారు నవీన్. గతంలో తన క్యాబినెట్లో పనిచేసిన దళిత నేత మోహన్ మజిని అభినందనలు తెలిపారు. నేరుగా కలిసి ఆశీర్వదించారు. తాజాగా శాసనసభలో సైతం తన హుందాతనాన్ని చాటుకున్నారు. జనతా దళ్ పార్టీలో 1998లో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు నవీన్ పట్నాయక్. తండ్రి బిజు పట్నాయక్ అకాల మరణంతో రాజకీయాల్లోకి నవీన్ రావాల్సి వచ్చింది.

కనీసం ఆయనకు ఒడిస్సా భాష కూడా తెలియదు. కానీ 1998లో ఎంపీగా పోటీ చేసి గెలిచారు నవీన్. 2000లో తన తండ్రి బిజు పట్నాయక్ పేరి ట బిజు జనతా దళ్ పార్టీని ఏర్పాటు చేశారు. బిజెపితో పొత్తు పెట్టుకుని తొలిసారిగా అసెంబ్లీకి పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీని ఓడించి ఒడిశా పీఠంపై కూర్చున్నారు. అది మొదలు బిజెపితో కలిసి బిజేడి కొనసాగింది. కానీ ఈ ఎన్నికల్లో బిజెపితో పొత్తు పెట్టుకునే క్రమంలో ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఎవరికి వారు పోటీ చేయగా బిజెపి అధికారంలోకి వచ్చింది. బిజెడి ప్రతిపక్షానికి పరిమితమైంది. ఓటమిని హుందాగా అంగీకరించిన నవీన్ పట్నాయక్ నేరుగా గవర్నర్ వద్దకు వెళ్లి తన రాజీనామాను సమర్పించారు. బిజెపి ప్రభుత్వాన్ని ఆహ్వానించారు.ఎన్నికల్లో రెండు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేశారు నవీన్ పట్నాయక్. కానీ ఒక్కచోట మాత్రమే గెలిచారు. గంజాం జిల్లాలోని హింజలి నియోజకవర్గం నుంచి గెలిచిన నవీన్… బోలంగీర్ జిల్లాలోని కంటాభంజీలో మాత్రం ఓడిపోయారు.

మంగళవారం నూతన శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం అసెంబ్లీలో జరిగింది. కార్యక్రమానికి నవీన్ హాజరయ్యారు. ఈ క్రమంలో అందర్నీ పలకరిస్తూ ముందుకు సాగుతున్న నవీన్ ఓ నేత వద్ద ఆగిపోయారు. నవీన్ పై గెలిచిన లక్ష్మణ్ బాగ్ కుర్చీలో నుంచి లేచి నవీన్ కు నమస్కరించారు. తనను తాను పరిచయం చేసుకున్నారు. నవీన్ పట్నాయక్ వెంటనే.. ఓహో మీరేనా నన్ను ఓడించింది.. మీకు అభినందనలు అని చెప్పేసరికి సభలో ఉన్న ముఖ్యమంత్రి, మంత్రులు చప్పట్లతో ఆహ్వానించారు. నవీన్ పట్నాయక్ హుందాతనాన్ని కొనియాడారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ దృశ్యం వైరల్ అవుతోంది. నవీన్ హుందాతనం అభినందనలు అందుకుంటోంది. రాజకీయాలంటే నవీన్ పట్నాయక్ మాదిరిగా చేయాలంటూ నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.