ఏపీలో రాహుల్ గాంధీ పర్యటనకు ముహుర్తం ఖరారైంది. జనవరి 9న విశాఖపట్నంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగే ఆందోళన కార్యక్రమాల్లో రాహుల్ గాంధీ పాల్గొనే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధించడంతో ఏపీలో కూడా ఎంతోకొంత ప్రభావం ఉంటుందని ఆ పార్టీ అంచనా వేస్తోంది. ఏపీ రాజకీయాల్లో 2014 నుంచి స్తబ్దత ఏర్పడింది. పార్టీ అధ్యక్షులను మారుస్తున్నా పెద్దగా ప్రయోజనం ఉండట్లేదు.రాష్ట్ర విభజన తర్వాత ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను రఘువీరా రెడ్డి, శైలజానాథ్ నిర్వహించారు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ కోలుకోలేని విధంగా దెబ్బతింది. దాదాపు తొమ్మిదిన్నరేళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కొంతైనా ఏపీ కాంగ్రెస్‌కు ఉత్సాహాన్నిస్తుందని భావిస్తున్నారు.మరోవైపు ఏపీ కాంగ్రెస్ పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఢిల్లీలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ నేతృత్వంలో సమీక్షించారు.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. జనవరి 9న ఏపీలో రాహుల్ గాంధీ పర్యటన ఉంటుందని ప్రాథమికంగా నిర్ణయించారు.విశాఖపట్నంలో జరిగే స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమావేశంలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. ఈ సమావేశంలో ఏపీకి సంబంధించిన కీలక ప్రకటనలు చేయనున్నారు. విభజన హామీల అమలుతో పాటు రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక హోదా వంటి అంశాలపై రాహుల్ ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి.ఏపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా వైఎస్ కుమార్తె షర్మిలను కాంగ్రెస్ పార్టీ బరిలో దింపుతుందని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతున్నా ఆమెకు అంతకు మించిన బాధ్యతలు అప్పగిస్తారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
స్టార్ కాంపెయినర్‌గా అధికార పార్టీపై షర్మిల అస్త్రాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రయోగించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోందిప్రస్తుతం ఏపీలో వైఎస్సార్సీపీ ఉన్న క్యాడర్‌లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓటు బ్యాంకులు మొత్తం ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందినవే కావడంతో అయా వర్గాలను షర్మిల ద్వారా కాస్తైనా వెనక్కి రప్పించాలని తటస్థ ఓటర్లు, పట్టణ ప్రాంత మధ్యతరగతి ఓటర్లను లక్ష్యంగా చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. జనవరిలోనే షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఏపీ కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు సైతం షర్మిల రాకను స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు.