తెలంగాణ రాజకీయం

రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన  పోచారం శ్రీనివాస్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు పక్షపాతి అని, రైతుల కోసం పాటుపడే వ్యక్తి అని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రేవంత్‌రెడ్డి స్వయంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. రేవంత్ సమక్షంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పోచారం మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి రైతులకు మంచి చేస్తున్నారని ప్రశంసించారు. రేవంత్ చేపడుతున్న రైతు అనుకూల పనులకు గర్విస్తున్నామని, రేవంత్ యువకుడు అని, మరో 20 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించే సత్తా ఉందని పోచారం మెచ్చుకున్నారు.అంతకు ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వెళ్లారు. బిఆర్‌ఎస్ పార్టీ తరపున బాన్సువాడ నుంచి ఆయన ఎంఎల్‌ఎగా గెలుపొందారు. దీంతో కాంగ్రెస్ పార్టీలోకి రావాలని పోచారానికి రేవంత్‌రెడ్డి ఆహ్వానం పలికారు.

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా పోచారాన్ని కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఒత్తిడి తీసుకొస్తున్నట్టు సమాచారం. బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ పై ఉన్న భక్తితో ఆ పార్టీలో ఉంటారా? లేక మంత్రి పదవి ఆశ చూపితే కాంగ్రెస్ పార్టీలో చేరుతారా? అనే తెలియాల్సి ఉంది. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఈ విషయం హాట్ టాఫిక్‌గా మారింది. బిఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు 13 మంది ఎంఎల్‌ఎలకు రేవంత్ రెడ్డి గాలం వేస్తున్నట్టు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో హైదరాబాద్‌లోని పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బిఆర్‌ఎస్ మాజీ ఎంఎల్‌ఎ బాల్క సుమన్ ఆధ్వర్యంలో పోచారం ఇంటిని బిఆర్ఎస్ కార్యకర్తలు ముట్టడించారు. దీంతో పోలీసులు, బాల్కసుమన్‌కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.