ఆంధ్రప్రదేశ్ రాజకీయం

టీడీపీలోకి యువతకే పెద్ద పీట

తెలుగుదేశం పార్టీలో యువతకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఇప్పటికే మంత్రి పదవుల్లో యువతకే పెద్ద పీట వేశారు. కేంద్ర మంత్రివర్గంలో సైతం ఇద్దరు యువ ఎంపీలు చోటు దక్కించుకున్నారు. కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ లు కేంద్ర మంత్రులు అయ్యారు. తాజాగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించారు. మాజీ స్పీకర్ జిఎంసి బాలయోగి కుమారుడు, అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్ కి సైతం లోక్ సభలో కీలక బాధ్యతలు అప్పగించారు చంద్రబాబు. మరోవైపు పార్టీ కార్యవర్గాలను రద్దుచేసి.. యువతకు బాధ్యతలు అప్పగించాలని డిసైడ్ అయ్యారు. గతానికి భిన్నంగా చంద్రబాబు ఈసారి వ్యవహరించారు. ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో ఎక్కడా మొహమాటలకు పోలేదు. పొత్తులతో ముందుకు సాగడంతో 31 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాలను వదులుకున్నారు. మరోవైపు సీనియర్లను పక్కన పెట్టి వారి వారసులకు, యువతకు ప్రాధాన్యం ఇచ్చారు. వారికే టిక్కెట్లు కట్టబెట్టారు.

ఎన్నికల్లో టిడిపి ఒంటరిగా 135 స్థానాల్లో విజయం సాధించింది. 16 పార్లమెంట్ స్థానాలను సైతం సొంతం చేసుకుంది. కానీ చంద్రబాబు సీనియర్లను పక్కనపెట్టి యువతకు క్యాబినెట్లో స్థానం కల్పించారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసుల రెడ్డి లాంటి సీనియర్లు ఉన్నా.. శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి హ్యాట్రిక్ కొట్టిన కింజరాపు రామ్మోహన్ నాయుడుకు కేంద్ర క్యాబినెట్లో చోటు కల్పించారు. గుంటూరు ఎంపీ గా ఎన్నికైన పెమ్మసాని చంద్రశేఖర్ కు కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కింది. తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగానరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలను చంద్రబాబు ఎంపిక చేశారు. ఈ ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టిడిపిలో చేరారు శ్రీకృష్ణదేవరాయలు. టిడిపి టికెట్ పై పోటీ చేసిన ఆయన 1,59,729 ఓట్లతో గెలుపొందారు. చంద్రబాబు నమ్మకాన్ని వమ్ము చేయకుండా అత్యధిక మెజారిటీతో గెలిచారు. దీంతో ఆయనను తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేతగా ఎంపిక చేశారు చంద్రబాబు.

మరోవైపు లోక్ సభ మాజీ స్పీకర్ జిఎంసి బాలయోగి కుమారుడు హరీష్ మాధుర్ అమలాపురం ఎంపీగా ఎన్నికయ్యారు. 3,42,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆయనను లోక్సభలో పార్టీ విప్ గా నియమించారు చంద్రబాబు. మొత్తానికైతే పార్టీలో యువ రక్తం నింపేలా చంద్రబాబు ప్లాన్ చేసుకుంటున్నారు.