తెలంగాణ రాజకీయం

నాడు కారుకూతలు, నేడు పథకాల్లో కోతలు

లోక్ సభ ఎన్నికలు నా పాలనకు రెఫరెండం అన్న రేవంత్ మాటకు దిక్కు లేదు. తెలంగాణలో కాంగ్రెస్ వైఫల్యంపై కాంగ్రెస్ అధిష్టానమే కమిటీ వేసింది. నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా తప్పును సరిదిద్దు కోలేవని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. మంగళవారం నాడు తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, పాల్గొన్న మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ శాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడారు.
నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఆ ఇంటి మీది కాకి ఈ ఇంటి మీద వాలనివ్వను అన్న రేవంత్ .. ఇంటింటికి తిరిగి కండువాలు కప్పుతున్నాడు. వైఎస్ హయాంలో ఎంతో మంది ఎమ్మెల్యేలను లాక్కున్నాడు .. కానీ తెలంగాణను ఆపలేక పోయాడు. తెలంగాణ అనేది నిరంతర జ్వాల .. దానిని నిరంతరం కాపాడుకుంటాం. తెలంగాణ తెచ్చిన పార్టీగా, పదేళ్లు గొప్పగా పాలించిన పార్టీగా నిరంతరం పోరాడతాం. నలుగురు ఎమ్మెల్యేలను లాక్కోవడం మూలంగా బీఆర్ఎస్ పార్టీని బలహీనపర్చగలం అనుకుంటే పొరపాటు .. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుతోనే సాధ్యం .. అవి సాధ్యంకాని హామీలు కాబట్టి మీరు విజయవంతం కాలేరు. రాష్ట్రంలో రెండు నెలలుగా ఫించన్లు ఇవ్వడం లేదని అన్నారు.
రైతుబంధు ఎప్పుడిస్తారని రైతులు అడుగుతున్నారు. కోరి తెచ్చుకున్న మొగడు కొట్టినా పడాలి, తిట్టినా పడాలి అన్నట్లు పరిస్థితి ఉంది. రైతుభరోసా సంగతి దేవుడెరుగు .. రైతుబంధుకే దిక్కు లేదు. రుణమాఫీకి సంబంధించి రూ.19 వేల కోట్లకు రూ.14 వేల కోట్లు ఇచ్చాం. ఎన్నికల నాటికి మిగిలిపోయిన రైతాంగానికి రుణమాఫీ చేస్తారా ? చేయరా ? ప్రకటించండి. బాధ్యత వహించే, ఘనత వహించే మీడియా ఏం చేస్తుంది .. ఇదే కేసీఆర్ హయాంలో జరిగి ఉంటే ఆ మీడియా ఊరుకునేదా ? ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు పది పూర్తైతే రూ.10 వేలు, ఇంటర్ పూర్తయితే రూ.15 వేలు, డిగ్రీ పూర్తయితే రూ.25 వేలు పీజీ పూర్తయితే రూ.లక్ష, ఎంఫిల్, పీహెచ్డీ పూర్తిచేస్తే రూ.5 లక్షలు అన్నారు .. ఇప్పటి వరకు ఒక్కరికైనా ఇచ్చారా  అని ప్రశ్నించారు.  
రాష్ట్రంలోని మేధావులు ఈ విషయంలో ప్రభుత్వాన్ని నిలదీయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

దేశంలో ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ మోడీ దెబ్బకు చతికిలబడింది .. చివరలో రాహుల్ పాదయాత్రతో కొంచెం లేచి నిలబడింది. దేశ జనాభా రెండుగా చీలిన కూలక సమయంలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతారాహిత్యం వహించింది. మోడీ అనుకూల, మోడీ వ్యతిరేక వర్గాలుగా విడిపోవడానికి కారణం కాంగ్రెస్ వైఫల్యం ఉంది. బీజేపీ గెలుపుకు బీఅర్ఎస్ సహకరించిందని కాంగ్రెస్ పార్టీ చెప్పడానికి సిగ్గుండాలని అన్నారు. రేవంత్ సొంతూరు కొండారెడ్డి పల్లిలో బీజేపీకి లీడ్ వచ్చింది. తెలంగాణలో బీజేపీకి అధిక స్థానాలు రావడంపై ఏఐసీసీ కమిటీలు వేసింది. బీజేపీని నిలువరించడంలో విఫలమైందని కాంగ్రెస్ పార్టీ అంగీకరించిందని అన్నారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ ఖచ్చితంగా పుంజుకుంటుందని అన్నారు.