ఆంధ్రప్రదేశ్ రాజకీయం

కాంగ్రెస్ లో వైసీపీ విలీనం…

 సార్వత్రిక ఎన్నికల తర్వాత రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తెలంగాణలో విపక్ష బీఆర్‌ఎస్‌ను ఖాళీ చేసేందకు అధికార కాంగ్రెస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌ మొదలు పెట్టింది. దీంతో గులాబీ పార్టీ అప్రమత్తమైంది. ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అసెంబ్లీలో ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం పూర్తయింది. స్పీకర్‌ ఎన్నిక జరిగింది. తొలి కేబినెట్‌ భేటీ కూడా జరిగింది. అధికార కూటమికి 164 సీట్లు రాగా, విపక్ష వైసీపీ 11 స్థానాలకు పరిమితమైంది. దీంతో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. ఈ క్రమంలో జగన్‌ అసెంబ్లీకి వస్తారా.. వచ్చినా తట్టుకుని నిలబడతారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో పులివెందుల నియోజకవర్గంలో మూడు రోజులు పర్యటించిన మాజీ సీఎం, వైసీపీ చీఫ్‌ జగన్‌మోహన్‌రెడ్డి అటు నుంచి అటే బెంగళూరు వెళ్లారు. మూడు రోజులు నియోజకవర్గంలో పార్టీ ఓటమిపై మేధోమధనం చేసిన జగన్‌.. ప్రస్తుత పరిస్థితిలో కూటమిని ఎదుర్కొనేందుకు పార్టీ విలీన ప్రతిపాదనను తెరపైకి తెచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

ఏపీలో ఉనికే లేని కాంగ్రెస్‌తో వైసీపీని విలీనం చేయాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈమేరకు తన ప్రతిపాదనను కర్ణాక పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్‌ ముందు ఉంచినట్లు ప్రచారం జరుగుతోంది. తన చెల్లెలు షర్మిలను తప్పిస్తే.. వైసీపీని కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేస్తానని ఆఫర్‌ ఇచ్చినట్లు చర్చ జరుగుతోంది. ప్రస్తుతం వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో ఎంత మంది పార్టీలో ఉంటారు అనేది తెలియని పరిస్థితి. ఈ క్రమంలో పార్టీని తల్లి కాంగ్రెస్‌లో విలీనం చేయడమే మేలన్న అభిప్రాయానికి వచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈమేరకు తన ప్రతిపాదనను డీకే శివకుమార్‌ ముందు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.ఇటీవలి ఎన్నికల్లో వైసీపీ నాలుగు లోక్‌సభ సీట్లు గెలిచింది. దీంతో ఈ నలుగురిలో కూడా ఎంత మంది పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి. జగన్‌ దూతగా వ్యవహరించే ఎంపీ విజయసాయిరెడ్డి బీజేపీలో చేరతారని తెలుస్తోంది.

ఈమేరకు ఇపన్పటికే సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో వైసీపీ ఉనికే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో జగన్‌ తన ఉనికి కాపాడుకునేందుకే కాంగ్రెస్‌లో వైసీపీ విలీన ప్రతిపాదన చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు.