‘అభినయ శారద’గా పేరుగాంచిన నటి జయంతి మరణం విచారకరం: చంద్రబాబు
ప్రముఖ సినీనటి జయంతి ( 76) మరణం పట్ల టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు స్పందించారు. ఎన్టీఆర్, ఎంజీఆర్, రాజ్ కుమార్ వంటి ఉద్ధండులతో నటించి ‘అభినయ శారద’గా పేరుగాంచిన జయంతి మరణం విచారకరం అని పేర్కొన్నారు. జయంతి 6 భాషల్లో 500కి పైగా చిత్రాల్లో నటించారని కొనియాడారు.
జయంతి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. జయంతి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు. దక్షిణాది భాషల్లో దిగ్గజ నటిగా కీర్తిప్రతిష్ఠలు సంపాదించుకున్న జయంతి అనేక మరపురాని పాత్రలతో అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు.