తెలంగాణ రాజకీయం

పాపం… సంజయ్… ఒంటరేనా

కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి తెలియకుండా కాంగ్రెస్ కండువా కప్పుకున్న డాక్టర్ సంజయ్ విషయంలో జగిత్యాల కాంగ్రెస్ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక నాయకత్వంతో సంబంధం లేకుండా జాయిన్ చేసుకోవడంతోపాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తాము ఎదుర్కొన్న కేసుల పరంపర గురించి కూడా వారంతా బాధపడుతున్నారు. అప్పుడు తమను ముప్పు తిప్పలు పెట్టాడానికి కారణమైన ఎమ్మెల్యే సంజయ్‌ను కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకోవడం సరైన నిర్ణయం కాదని జగిత్యాల కాంగ్రెస్ నాయకులు కుండబద్దలు కొడుతున్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఏకంగా తన పదవికి రాజీనామా చేసేందుకే సిద్ధమయ్యారు. దీంతో డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ జగిత్యాల ద్వితీయ శ్రేణి నాయకులతో కలిసి పనిచేసే అవకాశం ఉంటుందా అన్నదే అంతు చిక్కని ప్రశ్న. సీనియర్ కాంగ్తెస్ నాయకులు ఆయన నాయకత్వంలో పార్టీలో కొనసాగేందుకు ఆసక్తి చూపుతారా లేక.. అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తారా అన్న చర్చ సాగుతోంది.

మరోవైపున దశాబ్దానికి పైగా అనుబంధం పెనవేసుకున్న బీఆర్ఎస్ పార్టీలోనూ సంజయ్‌కి అనుకూలంగా ఉండే సెకండ్ క్యాడర్ లేకుండా పోయింది. తాను కాంగ్రెస్ పార్టీలో చేరినందున తనతో కలిసి నడిచేందుకు రావాలని డాక్టర్ సంజయ్ నుండి ఆహ్వానాలు అందుతున్నా సుముఖత వ్యక్తం చేస్తున్న వారే కరువైనట్టుగా సమాచారం. అధికార కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినట్టయితే బావుంటుదని ఆయన సముదాయించి చెప్తున్నప్పటికీ, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో పాటు ఇతర నాయకులు పార్టీ మారేందుకు మాత్రం సానుకూలత వ్యక్తం చే్యడం లేదని తెలుస్తోంది. జగిత్యాలలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలను గమనిస్తే మాత్రం పూర్వ పార్టీకి చెందిన వారే అయినా.. జాయిన్ అయిన పార్టీకి చెందిన వారే అయినా కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేతో కలిసి వచ్చే అవకాశాలైతే కనిపించడం లేదు.

ప్రస్తుతం స్థానికంగా నెలకొన్న పరిణామాలు మాత్రం సంజయ్ ని ఒంటరిని చేసినట్టుగానే కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ నాయకులు కలిసి రాక.. కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వాగతించే పరిస్థితి లేకపోయిన తీరును ఆయన ఎలా అధిగమిస్తారన్నదే మిస్టరీగా మారింది..!