ఏపీ ప్రభుత్వానికి అడుగడుగునా సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయా.. హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు పెద్ద తలనొప్పిగా మారాయా.. ఒక్క పథకం అమలుకే అన్ని కోట్ల భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడే అవకాశం ఉన్న నేపథ్యంలో.. మిగిలిన వాటి అమలు ఎలా అనే మాటలు ప్రస్తుతంరాజకీయ విశ్లేషకుల నోట వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో, సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామంటూ వరాల జల్లు కురిపించింది. అందులో ప్రధానంగా యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు కల్పించడం, ప్రతి నెల రూ.3000 నిరుద్యోగ భృతి, స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15000, ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేల ఆర్థిక సహాయం, ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, ప్రతి మహిళకు నెలకు రూ.1500, మహిళలకు ఫ్రీ బస్సు ఇలా హామీలను ఇచ్చారు సీఎం చంద్రబాబు.సూపర్ సిక్స్ అంటూ ఎన్నికల ముందు నుండే టీడీపీ విస్తృత ప్రచారం నిర్వహించింది. అనంతరం జనసేన, బీజేపీలతో కూటమిగా ఏర్పడ్డ అనంతరం సూపర్ సిక్స్ నేతలందరూ సూపర్ సిక్స్ స్కీమ్స్ ను ప్రజల్లోకి తీసుకెళ్లారు. ప్రజలు కూడా ఓటు అనే ఆయుధం ఉపయోగించి, కూటమికి ఏకంగా 164 సీట్లు ఇచ్చారు. ఇంతటి ఘన విజయాన్ని కూటమి పాలనా పగ్గాలు చేపట్టి 4 నెలలు అయింది.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ లు తమదైన శైలిలో పరిపాలన సాగిస్తున్నారు.ప్రభుత్వం ఏర్పడిందో లేదో అలా వరదలు పలకరించాయి. దీనితో కేంద్రం కొంత ఆర్థిక సహకారం అందించగా, వరద భాదితులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున వరదసాయం అందించారు. అయితే ఇక సూపర్ సిక్స్ ఎక్కడ అంటూ వైసీపీ నేతలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాదు అమలు కానీ హామేలు ఇచ్చి కూటమి నేతలు మోసం చేశారంటూ ఆరోపిస్తున్నారు. ఇక కాంగ్రెస్ అద్యక్షురాలు వైయస్ షర్మిళ ఇటీవల మహిళలకు ఫ్రీ బస్ ఎక్కడా అంటూ పోస్ట్ కార్డ్ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.ఇలాంటి తరుణంలో సూపర్ సిక్స్ అమలుపై ప్రభుత్వం దృష్టి సారించింది. ముందుగా పేద కుటుంబాలకు ఆర్థిక స్వావలంబన కలిగించే దీపం పథకాన్ని దీపావళికి అమలు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ పథకం అర్హులందరికీ వర్తించాలని సీఎం ఆదేశించారు. అంతవరకు ఓకే గానీ, ఈ ఒక్క పథకం 5 ఏళ్లు అమలు చేస్తే ఏకంగా రాష్ట్రంపై రూ.13 వేల కోట్ల భారం పడుతుందని అధికారుల వద్ద ఉన్న లెక్క. ఒక్క స్కీమ్ కే ఇన్ని వేల కోట్ల భారం పడితే.. ఇక మిగిలిన స్కీమ్ ల పరిస్థితి ఏమిటన్నది పొలిటికల్ అనలిస్టుల ప్రశ్న.
అసలే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయాలన్న సంకల్పం ఓ వైపు , మరోవైపు పరిపాలన, అలాగే ఉద్యోగుల జీతాలు, ప్రతి నెలా సామాజిక పింఛన్ పంపిణీ ఇలా ఎన్నో రకాల ఆర్థిక భారాలు ప్రభుత్వంపై ఉన్నాయి. వీటిని అధిగమించి నిరుద్యోగ భృతి, మహిళలకు నెలకు రూ.1500, ఇలా మిగిలిన పథకాల అమలు జరగాలంటే కేంద్రం సాయం కావాల్సిందే. అలాగే అసలు మా ఫ్రీ బస్ ఎక్కడా అంటూ.. ఇటీవల పలువురు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. కాగా త్వరలో ఫ్రీ బస్ కు సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు విడుదలవుతాయని సమాచారం. ఏదిఏమైనా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తున్నా.. అసలు నిధుల లేమి సమస్యను ఏవిధంగా అధిగమిస్తుందో వేచిచూడాలి.