తెలంగాణ రాజకీయం

కాంగ్రెస్ గూటికి గులాబీ నేతలు క్యూ

తెలంగాణ రాజకీయ వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 9 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మరికొంత మంది హస్తం పార్టీ వైపు చూస్తున్నారు. అయితే బీఆర్ఎస్ నేతలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వైపు ఎందుకు చూడడంలేదని విశ్లేషకుల్లో చర్చ జరుగుతోంది.

రాష్ట్రంలో వలసలు ఊపందుకున్నాయి. గులాబీ నేతలంతా క్యూ కట్టి హస్తం గూటికి చేరుతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. రేవంత్ రెడ్డి వ్యూహాలు అన్నీ అనుకున్నట్టు ఫలిస్తున్నాయి. అయితే బీఆర్ఎస్ నుంచి వచ్చే నేతలంతా కాంగ్రెస్ పార్టీ వైపు మాత్రమే చూస్తున్నారు తప్ప……బీజేపీ వైపు మాత్రం ఎవరూ చూడడం లేదు. బీజేపీ కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చిన పార్టీ. ఇటీవలే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు ధీటుగా ఎనిమిది సీట్లు సాధించి, గతంలో కంటే ఎక్కువగా ఓటు శాతాన్ని పెంచుకుంది. ఇంత బలం కలిగిన ఆ పార్టీ……గులాబీ నేతలను ఎందుకు ఆకర్షించలేకపోయింది? బీజేపీలో నేతలు ఎందుకు చేరడం లేదని బీజేపీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నాయి. కాగా ఇటీవలే మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి బీజేపీలో చేరుతారని జోరుగా ప్రచారం జరిగినప్పటికీ……అదంతా ప్రచారాలకే పరిమితం అయింది. బడా నేతలే కాకుండా క్షేత్ర స్థాయిలో ఉండే చిన్న కార్యకర్తలు కూడా బీజేపీలో చేరడానికి ఇష్టపడడం లేదని తెలుస్తోంది. కిషన్ రెడ్డి, బండి సంజయ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్, డీకే అరుణ వంటి పెద్ద నేతలు ఉన్నా బీజేపీలోకి ఇతర పార్టీలు ఎందుకు చేరడం లేదని చర్చ మొదలైంది.

అయితే కాంగ్రెస్, బీజేపీ సిద్ధాంతాలు, విధానాలు వేర్వేరుగా ఉంటాయి. బీజేపీలో చేరాలి అనుకునే నేతలు ముందుగా ఆయన పదవికి రాజీనామా చేసిన తరువాతనే ఆ పార్టీలో చేరాలి అనే షరతులు ఉంటాయి. బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరాలి అనుకునే నేతలంతా తమ పదవికి రాజీనామా చేశాకే బీజేపీలో చేరాలనే కండిషన్ పెట్టడంతో నేతలు బీజేపీ వైపు చూడట్లేదని తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీలో పెద్దగా ఇలాంటి షరతులు ఏమీ ఉండకపోవడంతో ఎమ్మెల్యేలు వరుస పెట్టి ఆ పార్టీలో చేరిపోతున్నారు. గతంలో బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తమ పదవులకు రాజీనామా చేసిన తరువాతే ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. మొన్నటి దాకా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పని చేసిన కిషన్ రెడ్డికి మరోసారి కేంద్ర మంత్రిగా అవకాశం దక్కడంతో తన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయడంతో ఆ పోస్టు ఖాళీగా ఉంది. దీంతో సరైన నిర్ణయాలు తీసుకునే సారథి కరవయ్యారు. వీటంన్నిటి దృష్ట్యా బీజేపీలో చేరడానికి నేతలు ఆసక్తి చూపడం లేదని విశ్లేషకులు అంటున్నారు.

ఇకనైనా చేరికలపై దృష్టి పెంచి, సమర్థవంతమైన సారథిని నియమించాలని బీజేపీ శ్రేణులు కోరుతున్నాయి. ఉండడానికి రాష్ట్రంలో 8 మంది ఎంపీలు ఉన్నా…..వారిలో వారికే పడడం లేదనే ప్రచారాలు జరుగుతున్నాయి. ఇక ఎన్నికల ముందు రాష్ట్రంలో హడావుడి చేసిన బీజేపీ అగ్రనేతలు సైతం ఇప్పుడు పార్టీ పరిస్థితిని పెద్దగా పట్టించుకోవడం లేదట. ఇలాగైతే రాష్ట్రంలో బీజేపీ బలపడేది ఎలా అనే ప్రశ్నలు కార్యకర్తల నుంచి బలంగా వినిపిస్తున్నాయి.