తెలంగాణ రాజకీయం

తెరపైకి ప్రోటోకాల్ రచ్చ

తెలంగాణలో ప్రోటోకాల్‌ ఫైట్‌ స్టార్ట్‌ అయ్యింది. ప్రొటోకాల్‌ పాటించలేదని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి నిరసనకు దిగడం హాట్‌ టాపిక్‌గా మారింది. చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సబితను స్టేజ్‌పైకి పిలవకుండా.. ఓడినవారిని పిలవడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. ఎమ్మెల్యేల హక్కులను కాలరాస్తున్నారంటూ అధికారపార్టీపై నిప్పులు చెరిగారు. ప్రోటోకాల్‌ ఇష్యూపై ఘాటుగా రియాక్ట్‌ అయ్యారు బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్. అధికార కాంగ్రెస్‌.. ఎమ్మెల్యేల హక్కులను కాలరాస్తోంది. ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తోందంటూ.. స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కి బహిరంగ లేఖ రాశారాయన. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల హక్కులను కాలరాస్తూ ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. శాసససభ్యుల హక్కులను ఉద్దేశపూర్వకంగా రేవంత్ సర్కార్ ఉల్లంగిస్తోందని మండిపడ్డారు. ఇప్పటికైనా ఎమ్మెల్యేల హక్కులు, ప్రోటాకాల్ ఉల్లంఘనలు జరగకుండా అడ్డుకోవాలి స్పీకర్‌ను కోరారు.

ఈ మేరకు సీఎస్, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అవసరమైతే ఈ అంశాన్ని అసెంబ్లీ సమావేశాల్లో కూడా లేవనెత్తుతామన్నారు కేటీఆర్. రాష్ట్రంలో ప్రోటోకాల్‌ ఉల్లంఘనపై ఇటు మాజీ మంత్రి హరీష్‌ రావు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల హక్కులను కాలరాయడానికి మీరెవరంటూ నిప్పులు చెరిగారు. ఎమ్మెల్యే అయిన మహిళా ప్రజాప్రతినిధికి ఇందిరమ్మ రాజ్యంలో గౌరవం లేదా..? ప్రజలు గెలిపించిన నాయకులకు విలువ లేదా..? ఎమ్మెల్యేగా గెలిచిన మనిషిని విస్మరించి, కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తికి అధికార యంత్రాంగం సలాం కొట్టడం ఏమిటి..? అంటూ సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా ధ్వజమెత్తారు. ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్న ఆయన.. ప్రోటోకాల్ విషయంలో ప్రజాప్రతినిధులకు జరుగుతున్న అవమానం పట్ల స్పీకర్ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇలా రాష్ట్రంలో లేటెస్ట్‌గా ప్రోటోకాల్‌ రగడ నడుస్తోంది. ఎమ్మెల్యే సబిత ప్రోటోకాల్‌ ఘటనపై బీఆర్ఎస్ నేతలు నిప్పులు కక్కుతున్నారు. మరి ఇష్యూ ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి