మద్యం పాలసీకి సంబంధించిన సీబీఐ కేసులో సీఎం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, విక్రమ్ చౌదరి.. సీబీఐ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ డీపీ సింగ్ వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 29న హైకోర్టు విచారణ జరుపనున్నది. మద్యం పాలసీ కేసులో ఇప్పటికే జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్‌ను సీబీఐ జూన్ 26న అరెస్టు చేసింది. అదే నెల 20న ట్రయల్ కోర్టు ఆయనకు రెగ్యులర్ బెయిల్‌ను మంజూరు చేసిన విషయం తెలిసిందే. ట్రయల్ కోర్టు నిర్ణయంపై ఈడీ హైకోర్టును ఆశ్రయించగా బెయిల్‌పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత సీబీఐ ఆయనను జైలులో అరెస్టు చేసింది. అనంతరం మూడురోజుల పాటు కస్టడీకి తీసుకున్నది.
తనను సీబీఐ అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా కోర్టు ఇరువర్గాల వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసింది. రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై 29న వానదలు విననున్నది. ఇప్పటికే ఈడీ కేసులో సుప్రీంకోర్టు ఢిల్లీ ముఖ్యమంత్రికి ఇటీవల బెయిల్‌ను మంజూరు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన సీబీఐ కేసులో జ్యుడీషియల్ కస్టడీపై తిహార్ జైలులో ఉన్నారు.