జాతీయం రాజకీయం

కర్ఱాటక యూ టర్న్....

కర్ణాటకలోని ప్రైవేట్ కంపెనీలు స్థానిక కన్నడిగులకు రిజర్వేషన్ కల్పించేందుకు రాష్ట్ర కేబెనిట్ ఆమెదించిన బిల్లును గురువారం అసెంబ్లీలో తీర్మానానికి పెట్టే ముందు.. ఆ బిల్లు పట్ల కంపెనీల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకడుగు వేసింది. ప్రైవేట్ జాబ్ కోటా బిల్లును తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని.. దీనిపై పూర్తిగా మరోసారి అధ్యయనం చేశాక.. ముందకెళ్తామని ఉపముఖ్యమంత్రి డికె శివకుమార్ ప్రకటించారు.
గత సోమవారం రాష్ట్ర కేబినెట్ స్థానికులకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలనే అంశంపై నిర్ణయం తీసుకుంది. స్థానికులకు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించేందుకు ‘ది కర్ణాటక స్టేట్ ఎంప్లాయ్ మెంట్ ఆఫ్ లోకల్ కేండిడేట్స్ ఇన్ ది ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ అండ్ అదర్ ఎస్టాబ్లిష్మెంట్స్ బిల్ 2024 రూపొందించారు. ఈ బిల్లును కర్ణాటక కేబినెట్ ఆమోదించి.. గురువారం జరుగునున్న అసెంబ్లీ సమావేశంలో తీర్మానం చేయాలని సిద్ధరామయ్య ప్రభుత్వం భావించింది.ఈ బిల్లు చట్ట రూపం దాల్చితే.. . స్థానికులు అంటే కన్నడ భాష మాట్లాడే కన్నడిగులకు ప్రైవేటు కంపెనీల్లో 70 శాతం ఉద్యోగ రిజర్వేషన్ కల్పించడం తప్పనిసరిగా మారుతుంది.కర్ణాటక ఉద్యోగ రిజర్వేషన్ బిల్లు 2024 ప్రకారం.. రాష్ట్రంలో ఓ వ్యక్తి 15 ఏళ్లకు పైగా నివసిస్తూ ఉండాలి. ఆ వ్యక్తి కన్నడ భాష అనర్గళంగా మాట్లాడం, వ్రాయడం తెలిసి ఉండాలి. పదో తరగతిలో అతను కన్నడ భాష చదివి ఉండాలి. లేదా ప్రభుత్వం పెట్టే కన్నడ భాష పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి.

ఈ ఉద్యోగ రిజర్వేషన్ బిల్లు నియమాల ప్రకారం.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 16ను అనుసరించి ప్రైవేటు సంస్థల్లో 50 శాతం మేనేజ్ మెంట్ జాబ్స్, 70 శాతం ఇతర ఉద్యోగాల్లో కన్నడిగులకు రిజర్వేషన్ కల్పించాలి. కేటగిరి -సి, కేటగిరి – డి లో వంద శాతం కన్నడిగులకే ఉద్యోగాలు కల్పించాలి. ఈ చట్టాన్ని ప్రైవేటు కంపెనీలు మూడు సంవత్సరాల లోపు అమలు పరచాలి. ఉద్యోగాల కోసం అర్హులైన కన్నడిగులు లభించకపోతే.. స్థానికులకు శిక్షణ ఇవ్వాలి. లేకుంటే కనీసం 25 శాతం కన్నడిగు మేనేజ్ మెంట్ పదవుల్లో, 50 శాతం ఇతర ఉద్యోగాల్లో సంస్థలో పనిచేస్తూ ఉండాలి.

ఈ నియమాలను ఉల్లంఘిస్తే.. కంపెనీలకు లేబర్ డిపార్ట్ మెంట్ రూ.10000 నుంచి రూ.25000 వరకు ఫైన్ విధించి.. తదుపరి గడువు ఇస్తుంది. ఒకవేళ ఆ తరువాత కూడా ప్రైవేట్ కంపెనీలు నియమాలు పాఠించకపోతే రోజుకు రూ.100 రూపాయలు ఫైన్ కట్టాలి.కానీ ఈ బిల్లుకు వ్యతిరేకంగా కర్ణాటకలో ప్రైవేట్ కంపెనీలు తీవ్రంగా స్పందించాయి. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ కంపెనీల సంఘం నాస్కామ్ ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఒక ప్రకటన చేసింది. “కర్ణాటక ప్రభుత్వం స్థానికులకు ప్రైవేట్ కంపెనీల్లో రిజర్వేషన్న కల్పించడానికి తీసుకురానున్న చట్టం అమలైతే తీవ్ర పరిణామాలుంటాయి. అందుకే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం.

ఈ బిల్లులోని అంశాల వల్ల రాష్ట్ర అభివృద్ది ప్రమాదంలో పడే అవకాశం ఉంది, కంపెనీలు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లేందుకు ప్రయత్నిస్తాయి.. పైగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని చూస్తున్న అంతర్జాతీయ కంపెనీలు కూడా వెనుకడగు వేసే ప్రమాదముంది.” అని నాస్కామ్ అధికారంగా ప్రకటనలో పేర్కొంది.ఈ ప్రకటన తరువాత ఉపముఖ్యమంత్రి కంపెనీలకు అన్యాయం జరగదని హామీ ఇచ్చారు. కానీ కంపెనీలు సంతృప్తి చెందకపోవడంతో ఆయన ప్రైవేట్ జాబ్ కోటా బిల్లును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.