తెలంగాణ

కాళేశ్వరం పూర్తికి రూ.1.47 లక్షల కోట్లు కావాల్సిందేమంత్రి ఉత్తంకుమార్ రెడ్డి

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు కోసం అధిక వడ్డీతో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రుణాలు తీసుకున్నారని తెలంగాణ మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి విమర్శించారు. ప్రాజెక్ట్‌ల విషయంలో గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పెద్ద మాటల యుద్ధమే నడుస్తోంది. ఓ వైపు మీడియా ముందుకొచ్చి బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతుంటే.. ఇందుకు కౌంటర్‌గా మంత్రులు మీడియా, సోషల్ మీడియా వేదికగా ఓ రేంజ్‌లో ఇచ్చిపడేస్తున్నారు. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై శుక్రవారం మంత్రి ఉత్తమ్ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. కాళేశ్వరం వ్యయం రూ.38,500 కోట్ల నుంచి రూ.80 వేల కోట్లకు పెంచారని మండిపడ్డారు. కాగ్‌ ప్రకారం కాళేశ్వరం పూర్తి కావాలంటే రూ.1.47 లక్షల కోట్లు కావాలని స్పష్టం చేశారు. ప్రాజెక్టు రన్నింగ్‌ కాస్ట్‌ కూడా చాలా ఎక్కువని తెలిపారు. అన్ని పంపులు రన్‌ చేస్తే కరెంట్‌ బిల్లే రూ.10 వేల కోట్లు అవుతుందని తేల్చిచెప్పారు.
ఏడాదికి కాళేశ్వరంపై రూ.15 వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందని అన్నారు. అన్ని మోటార్లు రన్‌ చేస్తే వ్యయం ఇంకా పెరుగుతుందన్నారు. 93 వేల ఎకరాల ఆయకట్టు కోసం రూ.94 వేల కోట్లు ఖర్చే చేశారని అన్నారు. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇరిగేషన్‌కు రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు పెట్టారన్నారు. ఎక్కువ ఖర్చయితే.. ఎక్కువ కమీషన్లు వస్తాయని ఇలా చేశారని విమర్శించారు. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టును నిలిపేశారని మంత్రి ఉత్తమ్‌ ఫైర్ అయ్యారు. మేడిగడ్డపై కాంగ్రెస్‌ కుట్ర చేసిందని బిఆర్ఎస్ ఆరోపిస్తుందని చెప్పారు. మేడిగడ్డ కూలినప్పుడు కూడా అధికారంలో బిఆర్ఎస్ ఉందని వివరించారు. మేడిగడ్డ పిల్లర్లు 6 అడుగుల లోపలికి కుంగాయన్నారు. నాసిరకంగా నిర్మించడంతోనే కుంగిందని ఎన్ డి ఎస్ ఏ,  రిపోర్టులో ఉందని తెలిపారు. అక్టోబర్‌ 21వ తేదీన బ్యారేజీ కుంగిందని. కాంగ్రెస్‌ డిసెంబర్‌లో అధికారంలోకి వచ్చిందని గుర్తుచేశారు. మేడిగడ్డ దగ్గర ఎవరో బాంబులు పెట్టినట్లు ఫైల్‌ చేశారని చెప్పారు. బ్యారేజీ కుంగినా మాజీ సీఎం కేసీఆర్‌ నోరు మెదపలేదని మండిపడ్డారు. పూర్తిసామర్థ్యంతో పంపింగ్‌ చేస్తే. ఏదైనా ప్రమాదం జరిగితే. మేడిగడ్డ సమీపంలోని 44 గ్రామాలు కొట్టుకుపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. భద్రాచలం కూడా కొట్టుకుపోతుందని హెచ్చరించారు.
ఎన్డీ ఎస్ఏ సలహా మేరకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల గేట్లు తెరిచామని వివరించారు. మేడిగడ్డ కుంగినప్పుడు గత ప్రభుత్వమే నీళ్లను వదిలిందని తెలిపారు. డీపీఆర్‌లోని అంశాలను గత కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. సెంట్రల్‌ డిజైన్‌ సంస్థ ప్రకారం నిర్మాణం జరగలేదన్నారు. ఒక వ్యక్తి ఆలోచనల ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని చెప్పారు. ఇంత ఘోర తప్పిదం ఎవరూ చేసి ఉండరని అన్నారు. ప్రజలకు బీఆర్ఎస్ నేతలు కేసీఆర్‌, కేటీఆర్‌ క్షమాపణలు చెప్పాలని మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.