తెలంగాణ ముఖ్యాంశాలు

పంచాయితీ ఎన్నికలకు సిద్ధంసీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్తె: లంగాణ‌లో పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు మ‌రి కొద్దిరోజుల్లోనే న‌గారా మోగ‌నుంది. త్వ‌ర‌లోనే ఎన్నిక‌ల షెడ్యూల్‌ను విడుద‌ల చేసి, ఆగ‌స్టు నెల చివ‌రి వ‌ర‌కు పంచాయ‌తీ ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఐదేండ్ల క్రితం ఎన్నిక‌ల్లో కేటాయించిన‌ రిజ‌ర్వేష‌న్ల ప్ర‌కారమే ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం.
జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కీలక నిర్ణయం తీసుకున్న‌ట్లు స‌మాచారం. ఇప్పటికే సర్పంచుల పదవీకాలం ముగిసి ఆరు నెలలు కావస్తున్నందున రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు లేకుండా గత రిజర్వేషన్లలే కొనసాగించాలని, ఆగష్టు నెలలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ సమావేశంలో మంత్రి సీతక్కతో పాటు ప‌లువురు ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి వారం రోజుల క్రితం ఆదేశించిన సంగ‌తి తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలు, రాబోయే ఎన్నికల్లో వాటి పెంపునకు సంబంధించిన అంశాలను వెల్లడించాలని అధికారులకు సీఎం సూచించారు. గత పంచాయతీ ఎన్నికల్లో అనుసరించిన విధానం, రానున్న పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తీరును రేవంత్‌కు అధికారులు వివరించారు.
ఇప్పటికే కులగణనకు ఆమోదం తెలిపినందున, దాని ఆధారంగా పంచాయతీ ఎన్నికలకు వెళితే ఎలా ఉంటుందని, అందుకు ఎంత సమయం తీసుకుంటారని అధికారులను సీఎం ప్రశ్నించారు. కర్ణాటకలో 2015లో, బీహార్‌లో 2023లో కుల గణన చేశారని, ఆంధ్రప్రదేశ్‌లో కులగణన చేసినా వివరాలు ఇంకా బయట పెట్టలేదని అధికారులు వివరించారు.
2011లో కేంద్ర ప్రభుత్వం అనుసరించిన కులగణన ఫార్మాట్‌ 53 కాలమ్స్‌తో ఉన్నదని, దానికి మరో మూడు కాలమ్స్‌ జోడించి కులగణన చేపడితే కనీసం అయిదున్నర నెలల సమయం పడుతుందని తెలిపారు. బీసీ రిజర్వేషన్ల పెంపుతో పాటు స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఆగిపోకుండా త్వరగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో రిజర్వేషన్ల పెంపు అంశంపై సుదీర్ఘ చర్చ సాగింది. మొత్తానికి ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో గ‌త ఎన్నిక‌ల్లో కేటాయించిన రిజ‌ర్వేష‌న్ల ప్ర‌కార‌మే పంచాయ‌తీ ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం.