శ్రీలంకతో రెండో టీ20 వాయిదా
శ్రీలంక పర్యటనలో ఉన్న టీమిండియా ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా కరోనా బారిన పడ్డాడు. దీంతో ఇండియా-శ్రీలంకల మధ్య ఈరోజు జరగాల్సిన రెండో టీ20 మ్యాచ్ వాయిదా పడింది. ఇతర ఆటగాళ్లందరికీ కోవిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల్లో అందరికీ నెగెటివ్ అని తేలితే ఈనాటి మ్యాచ్ ను రేపు నిర్వహించే అవకాశం ఉంది. పాండ్యాకు కరోనా పాజిటివ్ అని తేలిన వెంటనే ఇరు జట్లు వెంటనే ఐసొలేషన్ లోకి వెళ్లాలని ఆదేశాలు అందాయని క్రికెట్ వర్గాలు తెలిపాయి. ఆటగాళ్లందరి కరోనా రిపోర్టులు వచ్చేంత వరకు వారు ఐసొలేషన్ లోనే ఉండనున్నారు.
మరోవైపు కృనాల్ పాండ్యాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో… పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్ ల ఇంగ్లండ్ పర్యటన ప్రశ్నార్థకంగా మారింది. ఇంగ్లండ్ తో సిరీస్ కోసం లండన్ లో ఉన్న భారత ఆటగాళ్లలో ముగ్గురు గాయాల బారిన పడటంతో… వీరిద్దరినీ ఇంగ్లండ్ కు పంపుతున్నట్టు బీసీసీఐ నిన్న ప్రకటించింది. ప్రస్తుతం వీరు శ్రీలంకలోనే ఉన్నారు. ఇప్పుడు వీరికి కరోనా నెగెటివ్ అని తేలితేనే ఇంగ్లండ్ కు వెళ్లే అవకాశం ఉంటుంది.