పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇవాళ ప్రధాని మోదీని కలిశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆమె 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌లో ఉన్న మోదీ నివాసానికి వెళ్లారు. ఇటీవల బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ ఇద్దరూ ఢిల్లీలో తొలిసారి కలుసుకున్నారు. రాష్ట్రానికి బాకీ ఉన్న నిధులను విడుదల చేయాలని మమతా కోరినట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ వ్యాక్సిన్లను కూడా అధిక మొత్తంలో రిలీజ్ చేయాలని ఆమె అభ్యర్థించారు. యశ్ తుఫాన్ సమీక్ష సమయంలో స్వల్ప వ్యవధి పాటు మే నెలలో ఇద్దరూ మాట్లాడుకున్న విషయం తెలిసిందే.
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర పేరును మార్చాలన్న పెండింగ్ అంశాన్ని కూడా మోదీతో గుర్తు చేస్తున్నట్లు దీదీ తెలిపారు. దీని గురించి ఆలోచిస్తామని మోదీ చెప్పినట్లు ఆమె వెల్లడించారు. పార్లమెంట్‌లో దుమారం రేపుతున్న పెగాసస్ వ్యవహారంపై ప్రధాని మోదీ అఖిల పక్ష భేటీ నిర్వహించాలన్నారు. ఈ అంశంలో సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టాలని దీదీ కోరారు. ఇవాళ ఉదయం ఢిల్లీలో కాంగ్రెస్ నేత కమల్‌నాథ్‌ను ఆమె కలిశారు. రేపు సోనియాతోనూ దీదీ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ ఉదయం మమతా బెనర్జీ ఢిల్లీ చేరుకున్నారు.