తెలంగాణ

శాటిలైట్ టోల్ వసూళ్లు..ఎలా పనిచేస్తాయి...

హైదరాబాద్, జూలై 29: వేలపై ప్రయాణించాలంటే కచ్చితంగా టోల్‌ చెల్లించాల్సిందే. ఇందుకోసం లైన్‌లో వెయిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఒకప్పుడు డబ్బులు చెల్లించే విధానం నుంచి నేడు ఫాస్ట్‌ట్రాక్‌కి అప్‌గ్రేడ్‌ అవుతూ వచ్చాము. అయితే ఇకపై అసలు టోల్‌ ఫ్లాజాలే ఉండవు. అదేంటి టోల్ ఫ్లాజాలు లేకపోతే టోల్‌ ఎలా వసూలు చేస్తారనే సందేహం కచ్చితంగా వస్తుంది కదూ! దేశంలో శాటిలైట్‌ ఆధారిత టోల్‌ వసూలు వ్యవస్థను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. అసలు ఎలాంటి టోల్‌ ఫ్లాజాలు లేకుండానే వాహనదారుల బ్యాంకు ఖాతాలో నుంచి డబ్బులు టోల్‌ రూపంలో కట్ అవుతాయిత్వరలోనే దేశంలోని అన్ని టోల్‌ ప్లాజాలను మూసివేయనున్నట్లు  కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. ఈ స్థానంలో శాటిలైట్ ఆధారిత టోల్ వసూలు విధానాన్ని అమలు చేయబోతున్నట్లు తెలిపారు. ఇంతకీ శాటిలైట్ బేస్డ్ టోల్ కలెక్షన్ సిస్టమ్ అంటే ఏంటి.? అసలు ఇది ఎలా పనిచేస్తుంది.? ఈ విధానంలో డబ్బులు ఎలా కట్ అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..ప్రస్తుతం టోల్‌ చెల్లించాలంటే వాహనదారులు టోల్‌ ప్లాజాల వద్ద వాహనాలు నిలిపి లైన్‌లో ఉండాల్సిన పరిస్థితి ఉంది. దీంతో కొన్ని సందర్భాల్లో ట్రాఫిక్‌ జామ్‌ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే శాటిలైట్ ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టమ్‌లో, కారులో ఇన్‌స్టాల్ చేసిన ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా టోల్‌ కట్ అవుతుంది. శాటిలైట్‌ ఆటోమేటిక్‌గా కారు ప్రయాణించిన దూరాన్ని లెక్కిస్తుంది. దీని ఆధారంగా ఎంత టోల్‌ కట్‌ అవ్వాలో అంత ఆటోమెటిక్‌గా కట్ అవుతుంది. ఈ వ్యవస్థను శాటిలైట్ బేస్డ్ టోల్ కలెక్షన్ సిస్టమ్ లేదా GPS ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టమ్ అంటారు.శాటిలైట్ ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టమ్ కారులో ఇన్‌స్టాల్ చేసిన ఆన్‌ బోర్డ్‌ యూనిట్ సహాయంతో పనిచేస్తుంది. దీని సహాయంతో ఉపగ్రహం మీరు ప్రయాణిచిన దూరాన్ని ట్రాక్‌ చేస్తుంది. హైవేలపై ఏర్పాటు చేసిన కెమెరాల ఆధారంగా వాహన సమాచారం ఉపగ్రహానికి అందుతుంది. ఆన్‌ బోర్డ్‌ యూనిట్‌తో లింక్‌ చేసిన వాలెట్‌లో ఉండే డబ్బులు టోల్‌ రూపంలో కట్ అవుతాయి. ఆన్‌బోర్డ్ యూనిట్‌ను వాహనదారులు తమ వాహనాల్లో ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. కొత్తగా వచ్చే వాహనాల్లో ఈ వ్యవస్థ ఇన్‌బిల్ట్‌గా వచ్చే అవకాశం ఉంది.జీపీఎస్‌ ఆధారంగా టోల్‌ వసూలు చేసే ఈ విధానం ప్రపంచంలోనే మొదటిదని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. కొత్త టోల్ వసూలు విధానం అమలులోకి రావడంతో డ్రైవర్లు టోల్ వద్ద ఆగాల్సిన అవసరం ఉండదు. దీని వల్ల హైవేపై ట్రాఫిక్‌ జామ్ జరగదు, దీంతో సమయం వృథా అవ్వదు. ఈ విధానంతో ప్రయాణం మరింత సులభతరం అవుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు.