ఆంధ్రప్రదేశ్

 గ్రౌండ్ వర్క్ లో   కృష్ణతేజ

కాకినాడ, జూలై  30: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పెషల్ రిక్వెస్ట్ మీద ఏపీకి వచ్చిన కేరళ కేడర్ ఐఏఎస్ మైలవరపు కృష్ణతేజ గ్రాండ్ వర్క్ షురూ చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కృష్ణతేజ రంగంలోకి దిగారు. పిఠాపురంలో సమస్యలు తెలుసుకునేందుకు ఏపీ పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ డైరెక్టర్ కృష్ణతేజ డిప్యూటీ సీఎం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. గ్రామాల్లో తాగునీరు, రోడ్లు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని పవన్ కళ్యాణ్ ఇదివరకే స్పష్టం చేశారు. గ్రామాల్లో సమస్యలపై ఫోకస్ చేసి, వారికి చేరువ అయి కష్టాలు తీర్చడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు. అందులో భాగంగా ఐఏఎస్ కృష్ణతేజ ప్రధానంగా తాగునీటి సమస్య పై దృష్టిసారించారు. పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు మండలం ఏకే మల్లవరంలో చెరువులో కలుషిత నీటి సమస్యపై ఫోకస్ చేశారు. చుట్టూ గోదావరి ఉన్నా, తాగేందుకు గుక్కెడు సురక్షితమైన మంచి నీళ్లు లేక అల్లాడిపోతున్న ఏకే మల్లవరం గ్రామస్తుల సమస్య తెలుసుకునేందుకు అక్కడికి వెళ్లారు కృష్ణతేజ. మల్లవరంలో చెరువుకు వెళ్లే దారి సైతం మొత్తం బురదతో నిండిపోయింది. అసలే వర్షాలు పడటంతో మురుగు పెరిగింది, మరోవైపు దుర్వాసన వస్తున్నా యువ ఐఏఎస్ కృష్ణతేజ ఆ బురదలోనే నడుచుకుంటూ వెళ్లి చెరువును పరిశీలించారు కృష్ణతేజ. చెరువు నిండా గుర్రపు డెక్క ఉండటంతో పాటు కలుషితంగా మారిన నీటిని తాగొద్దని గ్రామస్తులకు ఆయన సూచించారు. త్వరలోనే మల్లంచెరు చెరువు సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. బురదతో నిండిన రోడ్డు స్థానంలో రోడ్లు వేపించి సమస్యను పరిష్కరిస్తామని ఐఏఎస్ కృష్ణతేజ వారికి హామీ ఇచ్చారు.దశాబ్దాలుగా తమ గ్రామస్తులు ఈ మురికి నీటిని తాగుతున్నట్లు చెప్పడంతో అధికారికి షాకయ్యారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి గెలిచి డిప్యూటీ సీఎం కావడంతో తమ సమస్యలు తీరతాయని స్థానికులు ధీమా వ్యక్తం చేశారు. పవన్ ఆదేశాలతో ఇలా ఐఏఎస్ స్థాయి అధికారులు తమ వద్దకు వచ్చి నేరుగా పరిశీలించటంతో తమకు నమ్మకం కలిగిందన్నారు. త్వరలోనే ఏకే మల్లవరం గ్రామస్తుల సమస్యలు పరిష్కారం కావాలని ఆశిద్దాం.