తెలంగాణ

అప్పులపై వాడీవేడి చర్చ...బీఆర్ఎస్ పై భట్టి మండిపాటుః

హైదరాబాద్, జూలై 30: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా సాగుతున్నాయి. ప్రభుత్వ విధానాలపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తుండగా, అంతే స్థాయిలో అధికార పార్టీ కూడా ప్రతి స్పందిస్తోంది. ఆరోపణలు ప్రత్యారోపణలతో సభ వాడివేడిగా సాగుతోంది. ఈ క్రమంలోనే సోమవారం నిర్వహించిన శాసనసభ సమావేశాలు ఆసక్తికరంగా సాగాయి. ఉదయం 10 గంటలకు మొదలైన శాసనసభ అర్ధరాత్రి 1.30 గంటల వరకు కొనసాగింది. బడ్జెట్ పద్దులపై అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన చర్చలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న కీలక నిర్ణయాలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అడ్డగోలు వ్యవహారాలపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యంగా అదనపు విద్యుత్ ఉత్పత్తి, బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపై భట్టి విక్రమార్క తనదైన శైలిలో విమర్శలను గుప్పించారు. పదేళ్ల పాలనలో అదనపు విద్యుత్ ఉత్పత్తిని చేపట్టని భారతీయ రాష్ట్ర సమితి సర్కారు.. రాష్ట్రంపై మాత్రం అప్పులు భారాన్ని మోపిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ ఉత్పాదన తమ ఘనతగా చెప్పుకొని రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టించిందంటూ ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో విద్యుత్ ఉత్పత్తి సరఫరా మెరుగుపడినట్లు భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు. సామాజిక మాధ్యమాల ద్వారా కొందరు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి ఆరోపించారు. యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టు పేరుతో ఏటా 30 వేల కోట్ల రూపాయల భారాన్ని అప్పటి భారతీయ రాష్ట్ర సమితి ప్రభుత్వంపై మోపిందన్నారు. ప్రాజెక్ట్ నుంచి ఫ్లై యాస్ తరలించేందుకు సరైన రవాణా సౌకర్యం కల్పించలేని దుస్థితి ఏర్పడిందని, దీనివల్ల అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నట్లు భట్టి ఈ సందర్భంగా సభలో వెల్లడించారు. యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టుపై ఎన్జీటీ 2022లో నిషేధం విధించిందని, అప్పటి కెసిఆర్  ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకుండానే చేతులెత్తేసిందని, దీనికి కారణం ఏమిటో చెప్పాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఆ ప్రాజెక్టును చక్కదిద్దేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు అప్పటి సర్కారు ప్రయత్నించిందని విమర్శించారు. ఈ రంగం అభివృద్ధికి తమ ప్రభుత్వం అధిక కేటాయింపులు చేసిందని వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి గృహ జ్యోతిని అమలు చేస్తామని స్పష్టం చేశారు. బ్రాహ్మణ పరిషత్తుకు తగినన్ని నిధులు కేటాయిస్తామన్న భట్టి విక్రమార్క.. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు అర్హత నిష్పత్తిని 1:100 చేయాలన్న విజ్ఞప్తులు ప్రభుత్వం దృష్టికి వచ్చాయన్నారు. నోటిఫికేషన్ సమయంలోనే అర్హత ప్రాతిపదికను 1:50గా నిర్ణయించినందున ఎవరైనా కోర్టుకు వెళితే సమస్యలు ఎదురై పరీక్ష ఆలస్యమవుతుందన్న ఉద్దేశంతోనే తాము నిర్ణయం తీసుకోలేకపోతున్నామని భట్టి పేర్కొన్నారు. అయినప్పటికీ నిరుద్యోగులు నుంచి వస్తున్న విజ్ఞప్తులను పరిశీలించి దానిపై ఎలా ముందుకెళ్లాలి అన్న దానిపై నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తొలి 10 ఏళ్లలో ప్రభుత్వాన్ని నడిపి రాష్ట్రాన్ని అప్పుల మయంగా చేసిన భారతీయ రాష్ట్ర సమితి నేతలకు మాట్లాడే హక్కు లేదని బట్టి విక్రమార్క విమర్శించారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని అభినందించాల్సిన అవసరం ఉందని, కానీ బీఆర్ఎస్ నేతలు ఆ దిశగా ఆలోచన చేయడం లేదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉండాల్సిన తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత బీఆర్ఎస్ కే దక్కుతుందని విమర్శించారు.