కాకినాడ: సామాన్యుల పై భారాలు వేస్తూ, దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టే విధంగా రూపొందించిన కేంద్ర బడ్జెట్ 2024కు నిరసనగా సిపిఎం నాయకులు ఆందోళన చేపట్టారు. కాకినాడ లోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద మంగళవారం సిపిఎం నగర కమిటి ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా నాయకులు పాల్గొని కేంద్ర ప్రభుత్వ తీరు పై ధ్వజమెత్తారు.
ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కన్వీనర్ ఎం. రాజశేఖర్, జిల్లా నాయకులు దువ్వ శేషబాబ్జీ, జి. బేడిరాణి, నగర సీనియర్ నాయకులు కె. సత్తిరాజు, ట్రేడ్ యూనియన్ నేత సిహెచ్. రాజ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కాకులను కొట్టి గద్దలకు వేసే చందంగా ఉందని విమర్శించారు.
అదేవిధంగా ఒకప్రక్క ఆంధ్రప్రదేశ్ ఎంపీల సహాయంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ కనీసం విభజన చట్టం హామీలు అమలుకు గాని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి గాని నిధుల కేటాయింపు గురించి స్పష్టత లేదన్నారు. రాజధాని నిర్మాణానికి గ్రాంట్ రూపంలో కాకుండా అప్పు రూపంలో 15,000 కోట్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించడం ద్వారా బిజెపి మరోసారి మన రాష్ట్రానికి అన్యాయం చేసిందన్నారు. ప్రజలంతా కేంద్ర బడ్జెట్ ను వ్యతిరేకించాలన్నారు. టిడిపి, జనసేన ఎంపీలు పార్లమెంటు లో రాష్ట్ర ప్రజల వాణి వినిపించి, ప్రత్యేక హోదా సాధించడానికి చిత్తశుద్ధి గా కృషి చేయాలన్నారు. వ్యవసాయం, చిన్న మధ్యతరహా పరిశ్రమలను ఆదుకోవాలని కోరుతున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు, నగర కమిటీ సభ్యులు మలక వెంకట రమణ, దుంపల ప్రసాద్, కె. సత్తిబాబు, సూరిబాబు లతో పాటు చంద్రమళ్ళ పద్మ, నర్ల ఈశ్వరి, డి. క్రాంతి కుమార్, ఆర్. ఈశ్వరరావు, మేడిశెట్టి వెంకట రమణ, అనపర్తి ఏడుకొండలు, ఎం. రవి, తలుపులమ్మ, రాణి, వాసు, ఎస్.కె. పద్మ, ఎన్. సూర్యనారాయణ, సంజయ్ తదితరులు పాల్గొన్నారు..