తెలంగాణ

కాక రేపుతున్న బీజేపీ అధ్యక్ష పదవి...

హైదరాబాద్, ఆగస్టు 1: బీజేపీలో అధ్యక్ష పదవి కాక రేపుతోంది. అధ్యక్షులు ఎవరు ఈటల రాజేందరా..? డీకే ఆరుణా..? రోజుకొక పేరు తెరమీదకు వస్తుండటంతో ఢిల్లీ పెద్దలు ఎవరికి పగ్గాలు అప్పజెపుతారన్నది అంతుపట్టడం లేదు. ఇంతకీ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై అంత చర్చ ఎందుకు?.. అధ్యక్ష పదవికి పార్టీలో కొత్తగా చేరిన నేతలు పనికి రారా..? పాత నేతలే ఉండాలనే రూల్ ఉందా..? లేక నరనరాన మత భక్తి నింపుకుంటేనే పదవులుంటాయా..? అందుకు బండి సంజయ్, కిషన్ రెడ్డిలే నిదర్శనమా..?రాష్ట్ర బీజేపీలో అధ్యక్ష పీఠం పంచాయితీ మరింత ముదురుతోంది. పార్టీ రాష్ట్ర కార్యలయం దాటి ఢిల్లీ వినువీధుల్లో అధిష్టాన పెద్దలతో కుస్తీ పడుతోంది. అధ్యక్ష రేసులో నిన్నటి దాకా కొత్త పాత నేతల పేర్లు వినిపించాయి. నేడు అది వార్ వన్ సైడ్ అన్నట్టు కొత్త నేతల పేర్లే ఫోకస్ అవుతున్నాయి. అధ్యక్షపగ్గాలు చేపట్టడానికి మాకేం తక్కువ అన్నట్టు మొన్నటి దాకా అందరు పోటీ పడి  ఎవరికి వారు పైరవీలు చేసుకోవడంలో బిజీబిజీగా ఉండిపోయారు. కానీ పాత కొత్త నేతల పంచాయితీ రాష్ట్ర బీజేపీలోనే కాదు … ఢిల్లీ పెదలకు కూడా గందరగోళంగా తయారైన నేపథ్యంలో పాత బీజేపీ నేతలంతా డైలామాలో పడినట్లు తెలుస్తోంది.
జాతీయ స్థాయిలో మోడీ, అమిత్ షా వర్సెస్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, నితిన్ గడ్కారీల మధ్య బీజేపీలో గ్రూప్ వార్ నడుస్తోంది. మోడీ, అమిత్ షాలు ఆర్ఎస్ఎస్‌కు పార్టీలో ప్రాధాన్యత తగ్గించాలని చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే మోడీ క్రేజీ తగ్గుతున్న నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ అప్రమత్తం అవుతోందంటున్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో బీజేపీకి సోలో మెజార్టీ రాకపోవడంతో  మోడీ క్రేజ్ తగ్గిందనడానికి అదే నిదర్శనమన్న వాదన ఆర్ఎస్ఎస్ వినిపిస్తుంది. అందులో భాగంగానే మోడీ అమిత్ షాలు ఒకవైపు ఆర్ఎస్ఎస్ ఒకవైపు అన్న చందంగా బీజేపీ పరిస్థితి మారిందంట.ఆర్ఎస్ఎస్ నేతలంతా ఒకవైపు, నాన్ ఆర్ఎస్ఎస్ నేతలంతా మరోవైపు అన్నట్టుగా డిల్లి తరహా వ్యవహారమే రాష్ట్ర బీజేపీలో కనిపిస్తోంది. అందుకు నిదర్శనం పాత నేతలైనా కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు మాత్రమే మంత్రి పదవులు ఇచ్చి, మిగతా పార్లమెంట్ సభ్యులకు మొండి చేయి చూపించడమే అంటున్నారు. అది మిగితా సభ్యులకు తెలిసినా  అవకాశం వచ్చే వరకు బీజేపీని అంటిపెట్టుకుని ఉండాలని భావిస్తున్నారంట. కొత్తగా పార్టీలో చేరి ఎంపీలైన నేతలు తమకు పార్టీ పరంగా అవకాశం రాకపోతే కచ్చితంగా తమ భవిషత్ చూసుకునే పరిస్థితి కనిపిస్తుందంటున్నారు.ఇక మరోవైపు కొత్త నేతలకే రాష్ట్ర అధ్యక్ష పదవని తేలడంతో ఆ పంచాయితి కొత్త నేతల మధ్య కాక రేపుతోంది. ఈ అధ్యక్ష పంచాయితిని చూడలేక సీనియర్ నేతలెవరు పార్టీ కార్యాలయ మెట్లు ఎక్కడానికి ఇష్టపడటం లేదంట. ప్రధానంగా అధ్యక్ష రేసులో ఈటల రాజేందర్, డీకే ఆరుణ పేరు బలంగా వినిపిస్తుండటంతో అధ్యక్ష పదవి కోసం అశ పడ్డ మిగిలిన నేతలంతా అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ క్రమంలో అధికార ప్రతినిధులెవరు కూడా బీజేపీ పార్టీ ఆఫీస్ ధరి దాపుల్లో కనిపించడం లేదు.అధ్యక్ష పదవి ఎవరికి అన్నది అటుంచుతే కొత్త పాత నేతల పంచాయితీని తట్టుకోలేకే గతంలో కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, మజితేందర్ రెడ్డి, ఎన్నెం శ్రీనివాస్ రెడ్డి, విజయశాంతి, వివేక్ వెంకటస్వామి, ఏనుగు రవీందర్ రెడ్డి, మధుసుదన చారీలతో పాటు చాల మంది పార్టీకి దూరమయ్యారు. గతంలో వారి విషయంలో పాత నేతలంతా గుర్రుగా వుండి, టార్గెట్ చేసి పార్టీ నుంచి వెల్లేలా చేశారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే తంతూ కొనసాగుతోంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలను పార్టీ పాత నేతలు టార్గెట్ చేస్తుండటంతో ఆ పార్టీలో ఎవరు ఉండటానికి ఇష్ట పడటం లేదు.ప్రస్తుతం అధ్యక్ష పదవి గనక కొత్త నేతలకు ఇస్తే సహించేది లేదని, సంఘ్ పరివారులు తేల్చిచెప్తున్నారు. అయితే తమ నేతలకే అధ్యక్ష పీఠం దక్కుతుందని ఈటల, డీకే వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. దాంతో ఆ పంచాయతీ పార్టీ శ్రేణులకే అంతుపట్టకుండా తయారైంది. మొత్తమ్మీద అధ్యక్ష పదవి కొత్త నేతకా లేక మత భక్తి నింపుకున్న పాత నేతకా అనేది చర్చనీయంశంగా మారింది.