నంద్యాల: భారతీయ వైద్య సంఘం నంద్యాల శాఖ ఆధ్వర్యంలో, భారత్ సీరమ్స్, వ్యాక్సిన్స్( బి ఎస్ వి) కంపెనీ సహకారంతో స్థానిక మధు మణి నర్సింగ్ హోమ్ సమావేశ భవనంలో నంద్యాల ప్రాంత వైద్యులకు నిరంతర వైద్య విద్య సదస్సు నిర్వహించారు.
నంద్యాల శాఖ అధ్యక్షురాలు డాక్టర్ వసుధ రాణి అధ్యక్షతన, కార్యదర్శి డాక్టర్ పనిల్ కుమార్ నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఐఎంఏ మాజీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొని సదస్సు ప్రారంభించారు. ఈ సదస్సులో కాన్పు తర్వాత ఐరన్ లోపం వలన వచ్చే రక్తహీనత చికిత్సా విధానాలపై స్త్రీ వ్యాధి నిపుణురాలు డాక్టర్ అనూష, గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ ప్రాథమిక దశలో గుర్తించడం ఎలా అన్న అంశంపై డాక్టర్ గీతా వాణి మల్టీమీడియా ప్రజెంటేషన్ ద్వారా వైద్యులకు వివరించారు.
డాక్టర్ అనూష మాట్లాడుతూ ప్రసవం తర్వాత చాలామంది స్త్రీలలో ముఖ్యంగా పేద కుటుంబాలకు చెందిన వారిలో ఐరన్ లోపం వలన రక్తహీనత సంభవించడం అధికంగా ఉందని, రక్తహీనత ఉన్న స్త్రీలలో నీరసం, కళ్ళు తిరగడం, ఆయాసం, నాడి వేగం పెరగడం,చర్మం పాలిపోయి ఉండడం లాంటి లక్షణాలు కనిపిస్తాయని, ఆ సమయంలో రక్తహీనతను సరి చేయాల్సిన అవసరం ఉంటుందని లేకుంటే గుండె ఫెయిల్యూర్ లోకి వెళ్లే అవకాశం ఉంటుందన్నారు. వీరికి రక్తం ఎక్కించడం లేదా ఫెర్రిక్ కార్బాక్సీ మాల్టోస్(ఎఫ్ సి ఎం) సరైన మోతాదులో ఎక్కించడం ద్వారా సరి చేయవచ్చన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ వైద్యులు డాక్టర్ సహదేవుడు, డాక్టర్ మధుసూదనరావు, ఐఎంఏ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి, నంద్యాల శాఖ కార్యదర్శి డాక్టర్ పనిల్ కుమార్, రాష్ట్ర ఐఎంఏ వర్కింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు.