గుంటూరు, ఆగస్టు 2: ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదేళ్లుగా ఇసుక విక్రయాల్లో అమలు చేసిన విధానాలతో నిర్మాణ రంగం కుదేలైంది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుక విక్రయాలను నిలిపివేసి ఉచిత ఇసుక పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న 43 మెట్రిక్ టన్నుల ఇసుకను ప్రజలకు ఉచితంగా అందిస్తున్నట్టు ప్రకటించింది. ఈ పథకాన్ని ఆర్భాటంగా ప్రకటించినా ఆచరణలో జనాలకు మాత్రం ఏ మాత్రం ప్రయోజనం దక్కడం లేదు. పట్టణాలు, నగరాల్లో ధరల్లో ఏమాత్రం వ్యత్యాసం రాలేదు. గత మే నుంచి ఒకే రకమైన ధరలు కొనసాగుతున్నాయి. ఏపీ ప్రభుత్వ పాలసీలో ఉన్న లోపభూయిష్టమైన విధానాలే దీనికి అసలు కారణంగా కనిపిస్తోంది. కృష్ణానదికి పొరుగున ఉన్న విజయవాడ వంటి నగరంలో నాలుగున్నర టన్నుల ట్రాక్టర్ ఖరీదు రూ.5వేలు పలుకుతోంది. ఆరు చక్రాల టిప్పర్ ఖరీదు రూ.15వేలుగా ఉంది. నగరంలోని చాలా ప్రాంతాలకు టిప్పర్లు వెళ్లే అవకాశం లేకపోవడంతో ఇసుకను తప్పనిసరిగా ట్రాక్టర్లలో రవాణా చేయాల్సి వస్తోంది. ఫలితంగా వినియోగదారుడికి చేరే సరికి ఇసుక ఖరీదు భారీగా పెరిగిపోతోంది.ఐదేళ్లుగా ఆవురావురుమంటూ ఉన్న చోటామోటా నేతలు ప్రభుత్వం మారగానే ఇసుక రీచ్‌లను తమ గుప్పెట్లోకి తీసుకోవడంలో సఫలం అయ్యారు. గతంలో జేపీ వెంచర్స్ పేరిట డ్రామా నడిస్తే ప్రస్తుతం ఉచితం పేరుతో మరో డ్రామా నడుస్తోంది. ఏ నియోజక వర్గంలో ఇసుక రీచ్‌లు ఉంటే ఆ నియోజక వర్గ ప్రజాప్రతినిధులే ఇసుక విక్రయాలను శాసిస్తున్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే ఇసుక విక్రయాల్లో వేలు పెట్టొద్దని చెబుతున్నా దానిని వినిపించుకునే స్థితిలో ఆ పార్టీ నాయకులు లేరు. ఐదేళ్లు కష్టపడ్డాం, ఇప్పుడు తమ వంతు వచ్చిందనే ఉద్దేశం చాలా చోట్ల కనిపిస్తోంది. గత వారం పది రోజులుగా కృష్ణాజిల్లాలో జరుగుతున్న ఘటనలే దీనికి అద్దం పడుతున్నాయి. జగ్గయ్యపేట, నందిగామ, కంచికచర్ల ప్రాంతాల్లో ఇసుక డంప్‌లను స్థానిక నాయకులు గుప్పెట్లో పెట్టుకున్నారు.ఏపీలో ప్రధానంగా కృష్ణా నది పరివాహక ప్రాంతంలో లభించే ఇసుకకు హైదరాబాద్ వరకు డిమాండ్ ఉంటుంది. జగ్గయ్యపేట నుంచి హైదరాబాద్‌కు తరలిపోయే ఇసుక లారీలకు లెక్క కూడా ఉండదు. వీటిని కట్టడి చేయడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైంది.
లోడింగ్ అసలు సమస్య… ఇసుక ధరలు తగ్గకపోవడానికి అసలు కారణం రీచ్‌లలో తగిన ఏర్పాట్లు లేకపోవడమే ప్రధాన కారణంగా కనిపిస్తుంది. ఇసుక అమ్మకాలను నియంత్రించే ఏర్పాట్లు ఎక్కడా పక్కాగా జరగలేదు. మైనింగ్ శాఖ కూడా ప్రభుత్వ పెద్దల్ని మభ్య పెట్టడంలో విజయం సాధించింది.ఇసుక ఉచితం, ఎవరైనా తీసుకెళ్లొచ్చని చెప్పినా ఎవరికి వారు రీచ్‌లలో ఇసుకను తీసుకెళ్లే పరిస్థితులు ఉండవు. వినియోగదారుడు నేరుగా ఇసుకను రీచ్ నుంచి తెచ్చుకునే అవకాశమే ఉండదని ప్రభుత్వం ఇప్పటికీ గుర్తించలేదు. ఉద్దేశపూర్వకంగానే ఈ సమస్యను గుర్తించడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. ఉచిత ఇసుక పేరుతో కావాల్సిన వారికి ఆజమాయిషీ కట్టబెట్టేందుకే నిబంధనల రూపకల్పన చేశారనే అనుమానాలు కూడా ఉన్నాయి.ఉచిత ఇసుక పాలసీ అమల్లోకి వచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్లకు వాటి అమలు బాధ్యత అప్పగించారు. జిల్లా కలెక్టర్లు తమ కింద పనిచేసే జేసీలు, మైనింగ్ సిబ్బందిపై ఆధారపడటం తప్ప క్షేత్ర స్థాయిలో పరిస్థితుల్ని, మార్కెట్ మాఫియాల గురించి ఆలోచించలేదు. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుల చెల్లింపుకు విధివిధానాలు, కరెంట్ అకౌంట్ల నిర్వహణ,సీనరేజీ వసూళ్ళపై శ్రద్ధ పెట్టలేదు. దీంతో ఇప్పటికే ఇసుక వ్యాపారంలో ఆరితేరిన సిండికేట్లు మైనింగ్ సిబ్బందితో కుమ్మక్కై దందా మొదలు పెట్టేశాయి.మొదట వచ్చిన వారికి మొదట ప్రాతిపదికన ఇసుక అని చెబుతున్నా స్థానికంగా పట్టున్న వారికే మొదటి ప్రాధాన్యత దక్కుతోంది. ఇసుక తరలింపు కోసం వెళ్లే టిప్పర్లకు రోజుల తరబడి నిరీక్షణ తప్పడం లేదు. ఒక టిప్పర్‌లో 20టన్నులు తరలిస్తే దానిని నాలుగు ట్రాక్టర్లుగా విక్రయించుకోవచ్చు. ఈ క్రమంలో ఒక్కో లోడ్‌కు మూడ్రోజుల సమయం పడుతోందని గొల్లపూడికి చెందిన ఓ బిల్డింగ్ మెటిరియల్ సప్లయర్ చెప్పాడు. మూడ్రోజుల పాటు లారీ కిరాయి, డ్రైవర్ జీతభత్యాలు, డ్రైవర్ బేటా, డీజిల్ ఖర్చు కలుపుకుంటే తాము వసూలు చేసే ధర న్యాయమైనదేనని చెబుతున్నారు.ప్రభుత్వ పాలసీలో ఇసుక ఉచితం అని ఉన్నా సామాన్య ప్రజలు ట్రాక్టర్లు, టిప్పర్లను ఎక్కడి నుంచి తెచ్చుకోగలరని దళారులు చెబుతున్నారు. ఇసుక ధర తగ్గాలంటే రీచ్‌లలలో వసూళ్లు తగ్గి లోడింగ్ వీలైనంత తక్కువ సమయంలో పూర్తి చేయడం ఒక్కటే పరిష్కారమని చెబుతున్నారు. గత ఏడాది కాలంగా ఉన్న ధరలే ప్రస్తుతం కూడా కొనసాగుతున్నాయని.. మే, జూన్ నెలలో మాత్రమే కాస్త పెరిగాయని, పాత ధరలకు ఇప్పుడున్న ధరలకు తేడా లేదని విజయవాడ నిడమానూరుకు చెందిన మరో సప్లయర్ చెప్పాడు. ఇలా చేస్తే మేలు… ఏపీలో ప్రభుత్వం మారేనాటికి 84లక్షల మెట్రిక్ క్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులో ఉందని దానిని మొత్తం టీడీపీ నాయకులు కాజేశారని ఇటీవల వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆరోపించారు. టీడీపీ కొత్త పాలసీ ప్రారంభించే నాటికి 43లక్షల క్యూబిక్ మీటర్లు మాత్రమే నిల్వలు ఉన్నాయని చంద్రబాబు చెబుతున్నారు. ఇందులో ఎవరి మాట నిజమో కానీ జనానికి మాత్రం ఇసుక తక్కువ ధరకు దొరకడం లేదు. ఆన్‌లైన్‌లో విక్రయించే ఇసుకను నేరుగా ఎవరైనా ఆంక్షలు లేకుండా బుక్ చేసుకునే సదుపాయం కల్పించాలి. రవాణా ఛార్జీలను ప్రభుత్వమే నిర్ణయించాలి. స్టాక్ పాయింట్ లేదా రీచ్ నుంచి ఎంత దూరానికి ఎంత చెల్లించాలనే ధరను పట్టణాలు, మునిసిపాలిటీలు, సెమీ అర్బన్, రూరల్ ప్రాంతాల వారీగా ధరలను నిర్ణయించాలి. ఇసుక బుక్ చేసుకున్న తర్వాత గరిష్టంగా 24 గంటల్లోగా డెలివరీ జరిగేలా వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఇసుక తరలింపులో దళారుల ప్రమేయాన్ని పూర్తిగా నియంత్రించాలి.
ఇసుకను అధిక ధరలకు విక్రయించినా, అక్రమంగా నిల్వ చేసిన వారిపై కఠిన చర్యలు, జరిమానాలు విధించడంతో పాటు వాటిని సక్రమంగా పాటించాలి. పట్టణాలు, కార్పొరేషన్లకు సమీపంలో ఉండే ప్రభుత్వ స్థలాల్లో స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేయడం ద్వారా రవాణా భారాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. ఆన్‌లైన్‌లో ఇసుకను పొందే వ్యవస్థ మీద పక్కాగా నిఘా ఉంచాలి. ఎవరైనా స్వేచ్ఛగా ఇసుకను పొందే అవకాశం కల్పిస్తూనే దానిని దుర్వినియోగం చేస్తే చట్టపరమైన చర్యలకు బాధ్యులవుతారనే నిబంధనను బుకింగ్ సమయంలోనే స్ఫష్టం చేయాలి. స్టాక్ పాయింట్లలో గుత్తాధిపత్యం లేకుండా బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద పోలీసుల ఆధ్వర్యంలో నడిపే ప్రీపెయిడ్ ఆటో వ్యవస్థల తరహాలో టోకెన్ డెలివరీ మెకానిజం ఏర్పాటు చేయాలి. ఇసుక రవాణా ద్వారా దళారులు లబ్ది పొందకుండా నిరుద్యోగులకు ఉపాధి కల్పించే మార్గంగా ఉపయోగిస్తే ఎక్కువ మందికి లబ్ది కలుగుతుంది. ఇసుక విక్రయాల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం రాకపోగా, అప్రతిష్ట మాత్రం తప్పడం లేదు. దీనిపై దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే ఉచిత ఇసుక ప్రహసనంగా మారే ప్రమాదం ఉంటుంది.