ఆంధ్రప్రదేశ్

అవయవదానానికి రండి

విజయవాడ, ఆగస్టు 2: ఆరోగ్యశ్రీ పథకంపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు. విజయవాడలో అవయవదానంపై అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..” రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 45 రోజులే అయింది. అప్పుడే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి. గత ప్రభుత్వం చేసిన తప్పులపై రాష్ట్ర ముఖ్యమంత్రి శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ తీసేస్తారని ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఆరోగ్యశ్రీ కొనసాగుతుంది.. తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దు. ఆరోగ్యశ్రీకి సంబంధించి ఆస్పత్రులకు కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. సొంత ఊరులో మాజీ సీఎం మెడికల్ కాలేజీకి పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించలేకపోయారు.. ఇది మీ పరిస్థితి. మొన్ననే లోకేశ్ జగన్ మోహన్ రెడ్డి కాదని లేవన్ మోహన్ రెడ్డి అన్నారు. తరువాత జీరో జగన్ మోహన్ రెడ్డి అంటార”ని ఎద్దేవా చేశారు.తాను కూడా అవయవదానం చేయనున్నట్టు మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రకటించారు. ”అవయవదానం చేసిన వారికి చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాను. అవయవదానం చాలా ముఖ్యమైనది. ప్రాణం పోసేవాడు దేవుడు.. ప్రాణం నిలిపేవాడు డాక్టర్. అవయవదానం చేసేందుకు గొప్ప మనస్సు ఉండాలి. అవయవదానం చేయడానికి అందరూ ముందుకు రావాలి. అవయవాలు దానం చేసేవారు చనిపోయినా బతికే ఉంటారు. తెలంగాణలో 8 ఏళ్లలో 800 మంది ముందుకు వచ్చారు. ఏపీలో అవయవదానం చేసేవారు తక్కువ మంది ఉన్నారు. దేశంలో 90 వేల మంది అవయవాలు దానం చేసేందుకు ముందుకు వచ్చారు. దేశ వ్యాప్తంగా 5 లక్షలు మంది అవయవాలు లేక చనిపోతున్నారు.అవయవదానం చేసేందుకు మతాలు అడ్డువస్తున్నాయని అంటున్నారు. ప్రతిమనిషి దేవుడితో సమానం. అవయవదానం చేస్తే.. పైన ఉన్న దేవతలు కూడా ఆశీర్వదిస్తారు. అవయవదానం చేసేందుకు ఐపీఎస్, ఐఏఎస్, ఇతర ఉన్నత అధికారులు కూడా ముందుకు రావాలి. అలా చేయడం వల్ల ప్రతిఒక్కరూ ముందుకువచ్చే అవకాశం ఉంది. అవయవదానాన్ని ప్రోత్సహించేలా సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేయాలి. అంతే కాకుండా స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ నాయకుల ద్వారా అవగాహన కల్పించాల”ని మంత్రి సత్య కుమార్ యాదవ్ సూచించారు.