అంతర్జాతీయం ముఖ్యాంశాలు

భగ్గుమంటున్న బంగ్లా...

ఢాకా, ఆగస్టు 5: బంగ్లాదేశ్ భగ్గుమంటోంది. రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమాలతో బంగ్లాదేశ్ అట్టుడుకుతోంది. బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్ సిబ్బంది, అధికార పార్టీ మద్దతు దారులకు, ఆందోళనకారుల మధ్యన జరుగుతున్న ఘర్షణలతో బంగ్లాదేశ్ రణరంగాన్ని తలపిస్తోంది. తాజాగా చెలరేగిన హింసాత్మక ఘటనల్లో ఇప్పటి వరకూ 91 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. మరణించిన వారిలో పోలీసులు కూడా ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. సిరాజ్‌గంజ్‌లో ఓ పోలీస్ స్టేషన్ మీద దాడి జరగ్గా.. ఈ ఘటనలో 13 మంది పోలీసులు చనిపోయారు.మరోవైపు హింసాత్మక ఘటనల్లో అనేక మంది గాయపడ్డారు. ప్రభుత్వ ఆస్తులు, కార్యాలయాలు ధ్వంసమయ్యాయి. నిరసనకారులు పలుచోట్ల వాహనాలను తగలబెట్టారు. ముఖ్యంగా రాజధాని ఢాకా ప్రాంతం అల్లర్లతో అట్టుడుకుతోంది. పలుచోట్ల అధికార పార్టీ కార్యకర్తలు, విద్యార్థి సంఘాల మధ్యన గొడవలు జరుగుతున్నాయి. ప్రధానమంత్రి షేక్ హసీనా రాజీనామా చేయాలంటూ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. నిరసనలను అణగదొక్కేందుకు పోలీసులు టియర్ గ్యాస్, స్టన్ గ్రెనేడ్లను కూడా ప్రయోగించాల్సి వస్తోందంటే బంగ్లాదేశ్‌లో పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.ఘర్షణల నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా నిరవధిక కర్ఫ్యూ విధించారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా గత నెలలో నిరసనలు మొదలుకాగా.. దేశవ్యాప్తంగా నిరవధిక కర్ఫ్యూను విధించడం ఇదే తొలిసారి. వాట్సాప్, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాపైనా ఆంక్షలు విధించారు. 4 జీ సేవలను నిలిపేశారు. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో కేంద్రం కూడా అప్రమత్తమైంది. బంగ్లాదేశ్‌లో ఉన్న భారతీయ విద్యార్థులు, పౌరులు తమను సంప్రదించాలని అక్కడ ఉన్న భారత రాయబార కార్యాలయం సూచించింది. ఫోన్ నంబర్లను కూడా అందుబాటులో ఉంచింది. విద్యార్థులు, భారత పౌరులు అందరూ తమతో టచ్‌లో ఉండాలని భారత అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.మరోవైపు ఈ ఏడాది జనవరిలో బంగ్లాదేశ్‌‍లో నాలుగోసారి అధికారంలోకి వచ్చిన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు ఈ నిరసనలు తలనొప్పిగా మారాయి. నిరసనకారులు హసీనా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం చర్చల కోసం ఆహ్వానించినప్పటికీ వారు అంగీకరించడం లేదు. ఇక ఆందోళన చేస్తున్న వారు విద్యార్థులు కాదని.. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఆరోపించారు. అలాంటి వారిని అణిచివేయాలంటూ పిలుపునిచ్చారు