తెలంగాణ ముఖ్యాంశాలు

సులువు దారి బాధలు తీరి..

  • చోట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
  • ఏండ్లుగా వేధిస్తున్న యాతనలకు చెల్లు..
  • సాఫీగా సాగుతున్న రాకపోకలు
  • అందుబాటులోకి 5 అండర్‌పాస్‌లు, 4 ఆర్‌యూబీలు
  • మరో 16 చోట్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు

సిగ్నల్‌ రహిత ప్రయాణమే లక్ష్యంగా బల్దియా చేపట్టిన వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్‌ఆర్‌డీపీ) సత్ఫలితాలిస్తోంది. ఏండ్ల తరబడి తిష్టవేసిన ట్రాఫిక్‌ చిక్కుముళ్లను ఒక్కొక్కటిగా విప్పుతూ ప్రయాణ కష్టాలు తీర్చుతున్నది. ప్రధాన చౌరస్తాల్లో అండర్‌పాస్‌లు, రోడ్‌ అండర్‌ బ్రిడ్జి (ఆర్‌యూబీ)లు నిర్మిస్తూ సమస్యలకు విముక్తి కలిగిస్తున్నది. గ్రేటర్‌వ్యాప్తంగా ఐదుచోట్ల విశాలమైన అండర్‌పాస్‌లు, 4 చోట్ల ఆర్‌యూబీలను అందుబాటులోకి తెచ్చింది. మరో 10
ఏండ్ల తరబడి యాతనలకు చెక్‌ పడింది. ట్రాఫిక్‌ చిక్కుముళ్లు వీడిపోయాయి. రాకపోకలు సాఫీగా సాగిపోతున్నాయి. గ్రేటర్‌లో సిగ్నల్‌ ఫ్రీ రహదారులు, ట్రాఫిక్‌ చిక్కులకు శాశ్వతంగా చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా ఫ్లైఓవర్‌ల్లే కాదు.. ఆర్వోబీ, ఆర్‌యూబీలను సైతం నిర్మిస్తున్నది. దశల వారీగా వీటిని అందుబాటులోకి తీసుకొస్తున్నది. ఇప్పటివరకు ఐదు అండర్‌పాస్‌లు, నాలుగు చోట్ల ఆర్‌యూబీలు నిర్మించగా, అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఇప్పుడు ఇవి ఎంతగానో ఉపయుక్తంగా ఉంటున్నాయి. ట్రా‘ఫికర్‌’ తొలగి పోవడంతో పాటు సమయం, ఇంధన ఖర్చులు కలిసి వస్తున్నాయంటూ వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మైండ్‌స్పేస్‌ అండర్‌ పాస్

ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని చూపేందుకు ప్రభుత్వం ఎస్‌ఆర్‌డీపీ పనుల్లో భాగంగా రూ. 25.78 కోట్ల వ్యయంతో మైండ్‌స్పేస్‌ జంక్షన్‌లో అండర్‌పాస్‌ను నిర్మించింది. హైటెక్‌సిటీ నుంచి బయోడైవర్సిటీ వైపు వెళ్లే మార్గంలో 365 మీటర్ల పొడవు, 28.80 మీటర్ల వెడల్పు, 5.5 వర్టికల్‌ క్లియరెన్స్‌తో 6 లేన్లతో నిర్మించారు. 2018 ఏప్రిల్‌ 28న అందుబాటులోకి వచ్చింది. ఈ అండర్‌పాస్‌ మీదుగా గంటకు 15వేల వాహనాలు సాఫీగా ప్రయాణాలు కొనసాగిస్తున్నాయి. హైటెక్‌సిటీ నుంచి బయోడైవర్సిటీ జంక్షన్‌ వరకు
5 నిమిషాల్లో చేరుకుంటున్నారు.

త్వరలో మరో 16 ప్రాంతాల్లో

ఎన్నో ఏండ్లుగా రైల్వే క్రాసింగ్‌ల వద్ద వాహనదారులు, పాదాచారులు పడుతున్న కష్టాలకు శాశ్వతంగా చెక్‌ పడనున్నది. రైల్వే శాఖ సహకారంతో 16 రైల్వే లెవల్‌ క్రాసింగ్‌ల వద్ద రూ. 1230 కోట్లతో రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జి (ఆర్వోబీ), రోడ్‌ అండర్‌ బ్రిడ్జి (ఆర్‌యూబీ)లను నిర్మించేందుకు ప్రతిపాదించారు.

శిల్పారామం ఎదురుగా..

మాదాపూర్‌, జూలై 30: మాదాపూర్‌లోని శిల్పారామం ఎదురుగా రూ. 11 కోట్లు, 450 మీటర్ల పొడవుతో నిర్మించిన అండర్‌పాస్‌ను 2018 జనవరి 3న అందుబాటులోకి తెచ్చారు. 7 మీటర్ల క్యారేజ్‌ వేతో కలుపుకొని మొత్తం 7 మీటర్ల వెడల్పుతో నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఈ అండర్‌పాస్‌తో సమయం ఆదా కావడంతో పాటు గమ్యస్థానానికి త్వరగా చేరుకుంటున్నారు. అయ్యప్ప సొసైటీ జంక్షన్‌ మార్గంలో గంటకు ప్రస్తుతం 11 వేలకు పైగా వాహనాలు ప్రయాణాలు కొనసాగుతున్నాయి.

రింగ్‌ రోడ్డులో రయ్‌.. రయ్‌..

మన్సూరాబాద్‌, జూలై 30: ఎల్బీనగర్‌ రింగ్‌రోడ్డులో ఉప్పల్‌ వైపు నుంచి సాగర్‌ రింగ్‌రోడ్డుకు, సాగర్‌ రింగ్‌రోడ్డు నుంచి ఉప్పల్‌ వైపునకు వెళ్లేందుకు నిర్మించిన అండర్‌పాస్‌తో ట్రాఫిక్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టులో భాగంగా రూ. 14.73 కోట్లతో సుమారు 450 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో ఎల్బీనగర్‌ రింగ్‌రోడ్డులో అండర్‌పాస్‌ను నిర్మించారు. మే 28, 2020లో అందుబాటులోకి తీసుకురాగా, ఎల్బీనగర్‌ రింగ్‌రోడ్డు నుంచి ఉప్పల్‌, సాగర్‌ రింగ్‌రోడ్డుల వైపునకు వాహనాలు సాఫీగా వెళ్లిపోతున్నాయి. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వెళ్లే వారికి ఈ రోడ్డు ఎంతో ప్రయోజనకరంగా మారింది. నిత్యం ఈ అండర్‌పాస్‌ మీదుగా 70 నుంచి 80 వేల వాహనాలు ప్రయాణాలు సాగిస్తుంటాయని ట్రాఫిక్‌ పోలీసులు అంచనా వేశారు.

మల్కాజిగిరికి గొప్ప ఊరట..

మల్కాజిగిరి, జూలై 30: సుదీర్ఘ కాలంగా ఎదురు చూసిన ప్రజల నిరీక్షణకు తెరదించుతూ.. మల్కాజిగిరి పరిధిలో రెండు ఆర్‌యూబీలు అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో ట్రాఫిక్‌ కష్టాలు పూర్తిగా తీరిపోయాయి. ఉత్తమ్‌నగర్‌ ఆర్‌యూబీ 2018 ఏప్రిల్‌ 6న ప్రారంభమైంది.రూ 30 కోట్ల వ్యయంతో పూర్తి చేశారు. అంతకు ముందు సఫిల్‌గూడ రైల్వేగేటు వద్ద గంటల తరబడి వాహనాలు బారులు తీరేవి. ఈ ఆర్‌యూబీ పూర్తి కావడంతో వాహనాలు సాఫీగా సాగిపోతున్నాయి. అలాగే ఆనంద్‌బాగ్‌ ఆర్‌యూబీ సైతం రూ. 38 కోట్లతో నిర్మించారు. ఇక్కడ కూడా గతంలో రైల్వే గేటు పడిందంటే నిరీక్షణ తప్పేది కాదు. ఈ రైల్వే అండర్‌ బ్రిడ్జితో మౌలాలి, ఆనంద్‌బాగ్‌, మల్కాజిగిరి నుంచి వెళ్లే వాహనదారులకు గొప్ప ఊరట లభించింది.

కేపీహెచ్‌బీ కాలనీ – హైటెక్‌సిటీ మార్గంలో..

కేపీహెచ్‌బీకాలనీ, జూలై 30: నగరంలో అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటి కేపీహెచ్‌బీకాలనీ-హైటెక్‌సిటీ మార్గం. అనేక మంది ఐటీ ఉద్యోగులు కేపీహెచ్‌బీకాలనీ, కూకట్‌పల్లి, నిజాంపేట, ప్రగతినగర్‌ తదితర ప్రాంతాల్లో నివాసముంటున్నారు. హైటెక్‌సిటీకి వెళ్లి రావాలంటే పురాతన కాలం నాటి రైల్వే అండర్‌ బ్రిడ్జిని ఉపయోగించాల్సి వచ్చేది. ఆర్‌యూబీ ఇరుకుగా ఉండటం, వాహనాల రాకపోకలు పెరిగిపోవడంతో గతంలో ఫ్లైఓవర్‌ను నిర్మించారు. అయినా ట్రాఫిక్‌ సమస్యకు మోక్షం లభించలేదు. నిత్యం 40 నుంచి 50 వేల వాహనాలు ఈ మార్గంలో వెళ్తుండడం వల్ల ఇబ్బందులు తలెత్తేవి. ఈ నేపథ్యంతో కేపీహెచ్‌బీకాలనీ ఏడో ఫేజ్‌ హిందూ ఫార్చ్యూన్‌ అపార్ట్‌మెంట్‌ ఎదురుగా రూ. 66. 59 కోట్లతో 410 మీటర్ల పొడవు, 20.60 మీటర్ల వెడల్పుతో ఆర్‌యూబీని నిర్మించారు. 9 మీటర్ల క్యారేజ్‌ వేతో పాటు హైటెక్‌సిటీ వైపు 9 మీటర్లు, కేపీహెచ్‌బీ కాలనీ వైపు 9 మీటర్ల సర్వీస్‌ రోడ్డును అభివృద్ధి చేశారు. దీంతో కేపీహెచ్‌బీ కాలనీ, ప్రగతినగర్‌, నిజాంపేట, కూకట్‌పల్లి, బాచుపల్లి, కుత్బుల్లాపూర్‌ ప్రాంతాల వాసులతో పాటు గచ్చిబౌలి బయోడైవర్సిటీ, మైండ్‌ స్పేస్‌, అయ్యప్ప సొసైటీ, మాదాపూర్‌లకు సౌకర్యవంతంగా రాకపోకలు సాగించేందుకు వీలు కలిగింది.

ఉప్పుగూడ.. నిరీక్షణ లేదిక..

చాంద్రాయణగుట్ట, జూలై 30:ఉప్పగూడ రైల్వేగేట్‌ను దాటేందుకు వాహనదారులు గంటల కొద్దీ వేచి ఉండాల్సిన పరిస్థితి ఉండేది. ఈ కష్టాలకు చెక్‌ పెట్టాలన్న ఉద్దేశంతో రూ. 20.27 కోట్లతో రైల్వ శాఖ సహకారంతో ఉప్పగూడ రైల్వే గేటు వద్ద ఆర్‌యూబీని నిర్మించారు. 2007 ఆగస్టు 8న అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో సమీప ప్రాంతాలైన సంతోష్‌నగర్‌, డీఆర్‌డీఎల్‌, మిధానిలకు త్వరగా చేరుకునేందుకు వీలు కలిగింది. ఛత్రినాక, కందికల్‌గేట్‌, లాల్‌దర్వాజ, గౌలిపురా, లలితాబాగ్‌, ఉప్పుగూడ ప్రాంతాలకు చెందిన వారికి ఉపయుక్తంగా మారింది.

చింత తీర్చిన ‘చింతలకుంట’

వనస్థలిపురం, జూలై 30 : ఏపీ, సాగర్‌ వైపు వెళ్లే వాహనాల రాకపోకలతో విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న చింతలకుంట వద్ద ఎప్పుడు రద్దీగా ఉండేది. ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా చింతలకుంట చౌరస్తా నుంచి సాగర్‌ రింగ్‌రోడ్‌ దారిలో అండర్‌పాస్‌ను నిర్మించి 2018 మే 1 అందుబాటులోకి తీసుకురావడంతో ఈ ప్రాంతం సిగ్నల్‌ ఫ్రీ చౌరస్తాగా మారిపోయింది. ఒక్క క్షణం కూడా ఆగకుండా అన్ని వైపుల నుంచి వాహనాలు సాఫీగా వెళ్లిపోతున్నాయి. నిత్యం సుమారు 800 నుంచి వెయ్యి వాహనాలు ఈ అండర్‌పాస్‌ ద్వారా వెళ్తున్నట్లు అంచనా.