- దేశంలో రెండోస్థానంలో నిలిచిన తెలంగాణ
- 2020-21లో ఎఫ్‌సీఐ రికార్డు కోనుగోళ్లు
- రాజ్యసభలో ప్రకటించిన కేంద్రప్రభుత్వం
ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం పంజాబ్‌కు దీటుగా నిలుస్తున్నదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గత ఏడాది(2020-21) తెలంగాణ నుంచి 1.41 కోట్ల టన్నుల ధాన్యం సేకరించినట్టు ప్రకటించింది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) ద్వారా పంజాబ్ తర్వాత అత్యధికంగా ధాన్యం కొనుగోళ్లు చేసిన రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నది. 2020-21లో 2.02 కోట్ల టన్నులతో పంజాబ్ మొదటి స్థానంలో నిలిచింది. రాజ్యసభలో ఓ ప్రశ్నకు కేంద్ర పౌరసరఫరాలశాఖ మంత్రి సాద్వినిరంజన్ జ్యోతి ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. గతేడాది తెలంగాణ నుంచి ఎఫ్‌సీఐ 1.41 కోట్ల టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా.. ఇందులో వానకాలంలో 48.85 లక్షల టన్నులు, యాసంగిలో 92.53 లక్షల టన్నులు సేకరించినట్టు పేర్కొన్నారు. ఈ రెండు రాష్ర్టాల్లోనే రికార్డుస్థాయిలో ధాన్యం కొనుగోలు చేసినట్టు తెలిపారు.
కోటి టన్నులకు మించి ధాన్యం కొనుగోళ్లు చేసిన రాష్ర్టాలు దేశంలో ఈ రెండు మాత్రమేనని పేర్కొన్నారు. 2019-20లో ఎఫ్‌సీఐ తెలంగాణ నుంచి రూ. 20,416 కోట్ల విలువైన 1.11 కోట్ల టన్నులు, 2020-21లో రూ. 26,622 కోట్ల విలువైన 1.41 కోట్ల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. ఏపీలో 2020-21లో రూ.15,594 కోట్ల విలువైన 82.60 లక్షల టన్నుల మాత్రమే సేకరించింది. ‘తెలంగాణ ప్రభుత్వం ముమ్మాటికి రైతుప్రభుత్వం. సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో అనతికాలంలోనే వ్యవసాయరంగంలో అద్భుత విజయాలు సాధించాం. తెలంగాణ రైతులు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ విధానాన్ని ఇలాగే కొనసాగించి వ్యవసాయరంగాన్ని మరోస్థాయికి తీసుకెళ్తాం’అని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు.
యాసంగిసాగు పెరుదలలో తెలంగాణ టాప్
రెండేండ్లలో యాసంగి సాగు పెరుగుదలలో తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో నిలిచిందని కేంద్రప్రభుత్వం తెలిపింది. గత రెండేండ్లలో దేశవ్యాప్త యాసంగి సాగువిస్తీర్ణం పెరుగుదల, రాష్ర్టాలవారీగా వివరాలు ఇవ్వాలని కోరుతూ రాజస్యభ ఎంపీలు సంజయ్ సేథ్ (యూపీ), కేసీ వేణుగోపాల్ (రాజస్థాన్) అడిగిన ప్రశ్నకు కేంద్రం లిఖిత పూర్వక సమాధానం ఇచ్చింది. దీని ప్రకారం 2020లో దేశవ్యాప్తంగా యాసంగిలో 68.88 హెక్టార్లలో సాగవగా, 2021కి 80.46 లక్షల హెక్టార్లకు పెరిగింది. మొత్తంగా 11.58 లక్షల హెక్టార్ల విస్తీర్ణం పెరిగింది. తెలంగాణలో 2020లో 7.47 లక్షల హెక్టార్లలో పంట సాగవగా, 2021 నాటికి 11.24 లక్షల హెక్టార్లకు పెరిగింది. అంటే ఒక్క ఏడాదిలోనే సాగు విస్తీర్ణం 3.77 లక్షల హెక్టార్లు పెరిగింది. ఇది దేశవ్యాప్తంగా పెరిగిన విస్తీర్ణంలో 32.55 శాతం.
సాగు విస్తీర్ణంలో దేశంలోనే రెండో స్థానంలోకి యాసంగిలో సాగైన పంటల విస్తీర్ణం పరంగా తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. పశ్చిమబెంగాల్ 2021లో 15.75 లక్షల హెక్టార్ల పంట సాగుతో మొదటిస్థానంలో ఉన్నది. 11.24 లక్షల హెక్టార్ల సాగుతో తెలంగాణ రెండోస్థానంలో నిలిచింది.