- అంతర్జాతీయ మార్కెట్‌లోకి మన వస్ర్తాలు
- ఆరునెలల్లో అపెరల్ పార్కులో ఉత్పత్తి మొదలు
- 12 వేలమందికి ఉపాధి.. 80 శాతం మహిళలే
- మున్సిపల్, పరిశ్రమల, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్
- సిరిసిల్లలో గోకల్‌దాస్ గార్మెంట్ యూనిట్‌కు శంకుస్థాపన
అంతర్జాతీయ వస్త్ర మార్కెట్‌లోకి అతి త్వరలో సిరిసిల్ల బ్రాండ్ వస్ర్తాలు ప్రవేశించనున్నాయని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. వస్త్ర పరిశ్రమకు కేంద్రబిందువైన సిరిసిల్లలో అపెరల్ పార్కు ఉండాలన్న ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల కలను రాష్ట్ర ప్రభుత్వం సాకారం చేసిందని తెలిపారు. సిరిసిల్లలోని పెద్దూరులో 65 ఎకరాల్లో నెలకొల్పుతున్న అపెరల్ పార్కులో అంతర్జాతీయ ప్రమాణాలతో పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయని చెప్పారు. ఈ సంస్థలు తయారుచేసే వస్ర్తాలు అంతర్జాతీయ మార్కెట్‌కు వెళ్తాయని వెల్లడించారు. అపెరల్ పార్కులో 12 వేల మందికి ఉపాధి లభిస్తుందని, అందులో 80 శాతం మహిళలకే అవకాశం ఉంటుందని వివరించారు. అపెరల్ పార్కులో రూ.23.58 కోట్లతో నిర్మిస్తున్న గోకల్‌దాస్ గార్మెంట్ పరిశ్రమ భవనానికి మంత్రి కేటీఆర్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. పట్టణంలోని19వ వార్డులో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను ప్రారంభించి, కలెక్టరేట్‌లో జిల్లా అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. అపెరల్ పార్కులో నిర్వహించిన సమావేశంలో మంత్రి ప్రసంగించారు. మన పిల్లలకు స్థానికంగానే ఉపాధి లభించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం టెక్స్‌టైల్, అపెరల్ పాలసీని తీసుకొచ్చిందని వివరించారు.
సిరిసిల్లకు మంచిరోజులు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిరిసిల్లకు మంచిరోజులు వచ్చాయని మంత్రి కేటీఆర్ అన్నారు. 2005లోనే ఇక్కడ అపెరల్ పార్కు నెలకొల్పుతామని అప్పటి ప్రభుత్వం హామీ ఇచ్చినా దానిని నెరవేర్చలేదని, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో అది సాకారం అవుతున్నదని చెప్పా రు. ఈ అపెరల్ పార్కులో ఆరు నెలల్లో గోకల్‌దాస్ కంపెనీ ఉత్పత్తులు ప్రారంభిస్తుందని తెలిపారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు మరిన్ని సంస్థలు ముందుకొస్తున్నాయని పేర్కొన్నారు. వస్త్ర ఉత్పత్తిలో సిరిసిల్ల బ్రాండ్ ఇమేజ్ మార్కెట్లో ఖ్యాతి గడించేలా శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గత పాలకుల నిర్లక్ష్యంతో ఉరిశాలగా మారిన సిరిసిల్ల.. నేడు వేలకోట్ల రూపాయల వ్యాపారంతో బతుకమ్మ చీరలు, స్కూల్ యూనిఫాంల తయారీ ద్వారా సిరిసంపదలతో తులతూగడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. కార్మికుడినే యజమానిని చేయాలన్న ఆలోచనతో రూ.400 కోట్లతో వర్కర్ టు ఓనర్ వంటి బృహత్తర పథకాన్ని ప్రవేశపెట్టామని తెలిపారు. గోకల్‌దాస్ కంపెనీ 1,200 మందికి, వరంగల్‌లో యంగ్‌వన్ సంస్థ 12 వేల మందికి, కేరళకు చెందిన కిటెక్స్ 4 వేల మందికి ఉపాధి కల్పించనున్నాయని కేటీఆర్ చెప్పారు.
సకల సౌకర్యాలు కల్పిస్తాం
స్థానిక మహిళలకు కుట్టుపనిలో ప్రభుత్వమే నైపుణ్య శిక్షణ ఇస్తుందని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఇక్కడ ఉపాధి పొందే మహిళలకు అన్ని సౌకర్యాలు కల్పించే బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందని హామీ ఇచ్చారు. పార్కులో బేబీ కేర్ సెంటర్ కూడా ఏర్పాటుచేస్తామని తెలిపారు. చేనేత, మరమగ్గాల కార్మికులకు రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని త్వరలో అమలు చేస్తామని పేర్కొన్నారు. నేతన్నలకు చేయూత పథకంతో ప్రభుత్వ అండగా నిలిచిందని, కరోనా కష్టకాలంలో రూ.110 కోట్లు ఇచ్చి ఆదుకున్నదని గుర్తుచేశారు. రాష్ట్రంలో నాణ్యమైన పత్తి లభిస్తుందని సౌత్ ఇండియా మిల్స్ అసోసియేషన్ వెల్లడించిన విషయాన్ని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. రైతులు, నేతన్నల ఆత్మహత్యలు లేని రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటేనని స్వయానా కేంద్ర ప్రభుత్వమే ప్రశంసించడం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలకు నిదర్శనమని స్పష్టంచేశారు. కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ సంచాలకులు శైలజా రామయ్యర్, జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్, టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్‌రావు, జెడ్పీ చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ, గోకల్‌దాస్ ఇమేజెస్ సంస్థ ఎండీ సుమీర్ హిందూజా తదితరులు పాల్గొన్నారు.
మౌనికకు నర్సింగ్ కాలేజీలో ఉద్యోగం
- మాట నిలబెట్టుకున్న మంత్రి కేటీఆర్
కరెంట్ షాక్‌తో భర్తను కోల్పోయిన మహిళకు ఉద్యోగం ఇప్పించి మాట నిలుబెట్టుకున్నారు మంత్రి కేటీఆర్. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని కొండాపూర్‌కు చెందిన తీనేటి దినేశ్‌రెడ్డి ఇటీవల కరెంట్‌షాక్‌తో మరణించాడు. గత సోమవారం జిల్లా పర్యటనకు వచ్చిన కేటీఆర్.. దినేశ్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. వారి దయనీయస్థితిని చూసి చలించిపోయి, దినేశ్‌రెడ్డి భార్య మౌనికకు ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. సిరిసిల్ల నర్సింగ్ కళాశాలలో అటెండర్‌గా ఉద్యోగ అవకాశం కల్పించారు. కాగా, శుక్రవారం సిరిసిల్లకు వచ్చిన కేటీఆర్.. మౌనికకు ఉద్యోగ నియామకపత్రాన్ని అందజేశారు. ఐదురోజుల్లోనే హామీని నెరవేర్చిన మంత్రికి మౌనిక కృతజ్ఞతలు తెలిపారు.