ఆంధ్రప్రదేశ్ రాజకీయం

మండలికి కీలక పదవి...

విజయవాడ, ఆగస్టు 13: మండలి బుద్ధ ప్రసాద్ అంటే పరిచయం అక్కరలేని పేరు. కులాలు, మతాలకు అతీతంగా ఆయనను అందరూ అభిమానిస్తారు. మండలి బుద్ధ ప్రసాద్ కుటుంబం అంటే అదొక గౌరవం. అదొకరకమైన ఆప్యాయత. వివాదాల జోలికి పోరు. అవినీతి మచ్చ తనకు అంటనివ్వరు. మృదుస్వభావి. ఇలా చెప్పుకుంటూ పోతే మండలి బుద్ధ ప్రసాద్ ఎన్నో క్వాలిఫికేషన్లు ఉన్నాయి. ఆయనను వేలెత్తి ప్రత్యర్థులు కూడా ఎత్తి చూపలేరు. రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఆయనకు చేతకావు. కొన్ని దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న మండలి బుద్ధ ప్రసాద్ ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యేగానే కొనసాగుతుండటంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.మండలి బుద్ధ ప్రసాద్ తండ్రి మండలి వెంకట కృష్ణారావు 1972లో అవనిగడ్డ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1978 ఎన్నికల్లోనూ ఆయన గెలిచారు. 1983 ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా పనిచేశారు. తెలుగు భాషకోసం ఆయన పరతపించేవారు. అలాంటి నేత కు జన్మించిన మండలి బుద్ధప్రసాద్ కూడా తెలుగు భాష కోసం నిరంతరం శ్రమిస్తారు. ఎక్కడ తెలుగు మహాసభలు జరిగినా అక్కడ హాజరై తన కున్న అభిప్రాయాలను చెబుతారు. తెలుగు భాషపై మమకారాన్ని తండ్రి నుంచి అందిపుచ్చుకున్న ఆయన రాజకీయ వారసత్వాన్ని కూడా అదే స్థాయిలో అందుకున్నారు. ఇంకా అభ్యర్థిని ప్రకటించని టీడీపీ వైఎస్సార్ మంత్రివర్గంలో… 1999లో మండలి బుద్ధ ప్రసాద్ అవనిగడ్డ నుంచి శాసనసభ్యుడిగా గెలిచారు. కాంగ్రెస్ లో ఉండి 2004 ఎన్నికల్లోనూ ఆయన విజయం సాధించారు. 2004 లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రి వర్గంలో ఆయన పనిచేశారు. పశుసంవర్థక, పాడి పరిశ్రమ శాఖ బాధ్యతలను చేపట్టారు. తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో ఆయనకు గెలుపు లభించలేదు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆయన కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరారు. 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2015 లో ఆయన శాసనసభ డిప్యూటీ స్పీకర్ పదవిని పొందారు. సీనియర్ నేతగా ఆయన మెతక వైఖరి ఆయనకు పదవులను తెచ్చి పెట్టలేకపోయిందనే వారు అనేక మంది ఉన్నారు. 2024లో టీడీపీ నుంచి జనసేనలో చేరిన మండలి బుద్ధ ప్రసాద్ తిరిగి అవనిగడ్డ నుంచి గెలిచారు. కానీ ఈసారి ఆయనకు మంత్రి వర్గంలో స్థానం లభించలేదు. సీనియర్ నేతగా ఉన్న మండలి బుద్ధ ప్రసాద్ ఎన్నికలకు ముందు జనసేనలో చేరి గెలవడమే మంత్రి పదవి దక్కకపోవడానికి కారణంగా చెబుతున్నారు. అయితే ఆయన మనస్తత్వం తెలిసిన పార్టీ అగ్రనాయకత్వం ఆయనకు ఏదో ఒక పదవి ఇవ్వాలని డిసైడ్ అయిందని తెలిసింది. మరోసారి ఆయనను డిప్యూటీ స్పీకర్ లేదా? మరో ముఖ్యమైన పదవిని కట్టబెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. కేబినెట్ ర్యాంక్ పదవి వస్తుందని చెబుతున్నారు. అదే జరిగితే మండలి బుద్ధ ప్రసాద్ అభిమానులకు ఆనందానికి కొదవ ఉండదు. మరి ఏం జరుగుతుందనేది చూడాలి.