నెల్లూరు, ఆగస్టు 15: మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఎవరికీ దొరకడం లేదు. అస్సలు కనపడటం లేదు. పార్టీ కార్యక్రమాలను కూడా పట్టించుకోవడం లేదు. అనిల్ కుమార్ యాదవ్‌ను రాజకీయాల్లో ఒక పడిలేచిన కెరటంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యే అయ్యారు. ఒకటి కాదు రెండు సార్లు ఎమ్మెల్యేగా నెల్లూరు పట్టణ ప్రజలు గెలిపించుకున్నారు. ఇక వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏకంగా నీటిపారుదల శాఖ మంత్రి అయయారు. నెల్లూరు జిల్లాలో తనకు తిరుగులేదని భావించిన అనిల్ కుమార్ యాదవ్ ఒక ఊపు ఊపారు. అనిల్ కుమార్ యాదవ్ వైఎస్ జగన్ కు వీరాభిమాని. ఆయన మాటల్లో, చేతల్లో ఎప్పుడూ పంచ్ ల మీద పంచ్ లు ఉండేవి. 2014 ఎన్నికల్లోనూ, 2019 ఎన్నికల్లోనూ అనిల్ కుమార్ యాదవ్ స్పీడ్ చూసిన వారు ఎవరైనా ఆయనకు ఫిదా కావాల్సిందే. ప్రత్యర్థులను విమర్శించడంలో దిట్టగా పేరొందారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ మీద, అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం మీద నిప్పులు చెలరేగే వారు. అనిల్ అన్నగా అందరికీ సుపరిచితమైన ఆయన వైసీపీ లో ఫైర్ బ్రాండ్ లీడర్ గా గుర్తింపు పొందారు. అయితే అదే సమయంలో తన మొండి వైఖరి అనుకోండి… కలుపుకోలేని మనస్తత్వం అనుకోండి నెల్లూరు జిల్లాలో కీలక నేతలకు దూరమయ్యారు. సొంత పార్టీ నేతలకే మింగుడు పడని అనిల్ కుమార్ యాదవ్ ను దెబ్బతీసేందుకు కాచుక్కూర్చుని ఉండేలా శత్రువర్గాన్ని బాగానే తయారు చేసుకున్నారు. అదే ఆయనకు 2024 ఎన్నికల్లో రాజకీయంగా ఇబ్బందికరంగా మారింది. చివరకు నెల్లూరు పట్టణ వైసీపీ టిక్కెట్ ను ఆయన దూరం చేసుకోవాల్సి వచ్చింది. ఆయనకు చివరకు నెల్లూరు టిక్కెట్ లేకుండా పోయింది. ఆయనను నెల్లూరు నుంచి వైఎస్ జగన్ పల్నాడు జిల్లాకు బదిలీ చేయాల్సి వచ్చింది. 2024 ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంటు టిక్కెట్ ఇచ్చారు. ఇక ఇష్టం లేకపోయినా తలూపి.. వేరే దారిలేక అనిల్ కుమార్ యాదవ్ పోటీకి దిగారు. నరసారావుపేటలో కూడా అదే దూకుడు ప్రదర్శించారు. తీరా పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఆయన అడ్రస్ లేకుండా పోయింది. పల్నాడు జిల్లాలో జరుగుతున్న ఘర్షణలు, హత్యలపై కూడా ఆయన స్పందన కరువైంది. ఇక నెల్లూరు జిల్లాలో కూడా అనిల్ కుమార్ యాదవ్ పూర్తిగా పట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఆయన కొన్నాళ్లు రాజకీయాలకు విరామం ప్రకటించాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఎక్కువగా చెన్నైలోనే ఉంటున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మళ్లీ నెల్లూరు జిల్లా నుంచే రాజకీయాలు చేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలియవచ్చింది. కొంత గ్యాప్ ఇచ్చిన తిరిగి నెల్లూరు పట్టణ నియోజకవర్గంలో మళ్లీ రాజకీయం మొదలుపెట్టాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. అనిల్ ఎక్కడ అంటూ వైసీపీ కార్యకర్తలే అడుగుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
Related Articles
ఈ నెలాఖరుకే అభ్యర్ధులు... 3 పార్టీలు ముమ్మర కసరత్తు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తోంది. నవంబర్ మ…
వైసీపీ నేతల్లో అంతర్మధనం.. 2024లో టీడీపీ గెలిస్తే…
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా వైసీపీ గెలు…
విపక్షాలను ఏకం చేస్తున్న జగన్
అక్టోబర్ 18, 2022 సరిగ్గా ఇక్కడే మొదలైంది పవన్ కళ్యాణ్- టీ…