ఆంధ్రప్రదేశ్ రాజకీయం

 పీకల్లోతు కష్టాల్లో ద్వారంపూడి...

కాకినాడ, ఆగస్టు 15: ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి.. ఈ పేరు చెబితే ఠక్కున కాకినాడ పేరు గుర్తుకు వస్తుంది. ఓ రకంగా ఆ నగరాన్ని ఆయన అడ్డాగా మార్చుకున్నారు. వైసీపీలో కీలక నేతగా వ్యవహరిస్తూ.. పలు వ్యాపారాలు చేశారు. అయితే.. ద్వారంపూడి చేసిన వ్యాపారాలు ఇల్లీగల్ అనే వార్తలు గుప్పుమనటమే కాదు.. చాలా చోట్లా కేసులు కూడా నమోదు అయ్యాయి. నాడు ప్రభుత్వం అండతో తప్పించుకున్న ద్వారంపూడికి.. ప్రస్తుతం అన్ని ద్వారాలు మూసిపోయే పరిస్థితి నెలకొంది. వరుసగా కేసులు నమోదు, వివాదాలు, ఆరోపణలు నేపథ్యంలో సదరు నేత ఉక్కిరిబిక్కిరి అవుతున్నారంటూ ప్రచారం సాగుతోంది.ఇటీవల కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై కేసు నమోదైంది. ⁠మున్సిపల్ అధికారుల విధులను ఆయన అడ్డుకున్నారని కాకినాడ రెండో పట్టణ PSలో కేసు నమోదు చేశారు. ⁠రాజ్యలక్ష్మినగర్‌లో అక్రమ నిర్మాణం కూల్చుతుండగా ద్వారంపూడి అడ్డుకున్నారని కేసులో పేర్కొన్నారు. ⁠ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో పాటు మరో 24 మందిపైనా కేసు నమోదు చేశారు. మాజీ కార్పొరేటర్ సూరిబాబు అక్రమ నిర్మాణాలను తొలగించారు. ⁠కూల్చివేత సమయంలో అధికారులతో ద్వారంపూడి ఘర్షణకు దిగారు. గతంలో అన్నీ తానై వ్యవహరించిన నేత.. ఇలాంటి ఎన్నో కేసుల్లో నిందితుడిగా చేరపోవటంతో ద్వారంపూడి అనుచరులు కూడా ఆందోళనకు గురవుతున్నట్లు సమాచారం.మరోవైపు.. రేషన్ బియ్యం స్కామ్‌ను ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ స్కామ్‌లో కాకినాడ సిటీ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడికి ఉచ్చు బిగుస్తోంది. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ కాకినాడలో మకాం వేసి.. వరుసగా తనిఖీలు నిర్వహించారు. సిటీతో పాటు పోర్టులో స్వయంగా మంత్రి నాదెండ్ల తనిఖీలు చేశారు. కాకినాడ పోర్టులో అశోక్ ఇంటర్నేషనల్‌, హెచ్‌ వన్‌ గోడౌన్లలో భారీగా రేషన్ బియ్యం గుర్తించారు. ఆ బియ్యాన్ని ఆఫ్రికాకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం అందుకుని అధికారులు.. రెండు గోడౌన్లు సీజ్‌ చేశారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా అంతా.. ద్వారంపూడి ఫ్యామిలీ కనుసన్నల్లో జరిగిందటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయిజకాకినాడ పోర్టును ద్వారంపూడి.. తన అక్రమాలకు అడ్డాగా మార్చుకున్నాడని మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు. ద్వారంపూడి అరాచకాలు చూసి తానే ఆశ్చర్యపోయానని చెప్పుకొచ్చారు. తనిఖీలు పూర్తి అయ్యేంత వరకూ పోర్టు నుంచి బియ్యం రవాణాను నిలిపివేశారు. రాష్ట్రంలో పేదల పొట్ట కొట్టి అదే రేషన్ బియ్యాన్ని ఆఫ్రికన్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారని మండిపడ్డారు. పౌరసరఫరాల శాఖ సంబంధించి శాఖపరమైన చర్యలతో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని మంత్రి అన్నారు. పూర్తిస్థాయి పరిశీలన జరిపాక.. సీఐడీతో విచారణ కూడా జరిపిస్తామని నాదెండ్ల స్పష్టం చేశారు.వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి.. ఓ దళిత మహిళతో అక్రమ సంబంధంలో ఉన్నారని.. జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ షాకింగ్ కామెంట్స్ చేశారు. దళిత మహిళకు పుట్టిన బిడ్డను.. ద్వారంపూడి ఒళ్లో కూర్చోపెట్టుకుని తలనీలాలు కూడా తీయించారని ఆరోపించారు. తనకు గుర్తింపు కావాలని ఆమె ప్రశ్నించడంతో వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపారు. ఇంటి బయట 28 కెమెరాలు పెట్టి.. కారులో సైతం ట్రాకింగ్ డివైజ్‌లు పెట్టారని చెబుతున్నారు. ఇది రాజకీయం అంశం లాగా కాకుండా.. ఓ మహిళకు జరుగుతున్న అన్యాయంపై మాట్లాడుతున్నామన్నారు బొలిశెట్టి. జనసేన ఆమెకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.ద్వారంపూడి పతనాన్ని ఆయనే రాసుకున్నారని రాజకీయనిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేయటంతో పాటు కొన్ని సందర్భాల్లో జనసైనికులపైనా దాడులు చేయించారనే వార్తలు వినిపించాయి. అంతేకాదు.. ఓ అడుగు ముందుకేసిన మాజీ ఎమ్మెల్యే.. పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ను ఓడించి తీరుతామని చాలెంజ్ చేశారు. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఎక్కడ నుంచి పోటీ చేయాలో నిర్ణయం తీసుకునే అధికారం పవన్ కల్యాణ్‌‌కు లేదని విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే చంద్రబాబు టిక్ పెట్టాలని.. ఎంపీగా పోటీ చేయాలంటే అమిత్ షా టిక్ పెట్టాలని ఎద్దేవా చేశారు. ఓ పార్టీకి అధ్యక్షుడిగా ఉండి..పవన్ కళ్యాణ్‌కి ఈ కర్మ ఏంటని ప్రశ్నించారు. అంతేకాదు.. ఏపీ ప్రజలు రెడ్లనే ఎంపీలు, ఎమ్మెల్యేలుగా గెలిపించాలని అనుకుంటున్నారంటూ ద్వారంపూడి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనంగా మారాయి.మొదటి నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి తీరుపై పవన్‌కల్యాణ్‌ గుర్రుగానే ఉన్నారు. ఇలాంటి నేతల వల్లే రాజకీయాలు భ్రష్టుపడుతున్నాయని విమర్శించారు. గత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పవన్‌.. ద్వారంపూడిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఆయన చేస్తున్న ఇల్లీగల్ వ్యాపారాలు చేస్తున్నారని.. ఆయన ఆటలు సాగనివ్వమంటూ హెచ్చరించారు. ద్వారంపూడి అధహ్‌ పాతాళానికి తొక్కేస్తానని.. లేకుండా పేరు మార్చుకుంటానంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు పవన్‌వైసీపీ అధికారంలో ఉండగా ద్వారంపూడి చాలా అంశాల్లో అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం పేదలకు అందిస్తున్న బియ్యాన్ని సముద్ర మార్గం గుండా ఆఫ్రికన్ దేశాలకు ఎక్స్‌పోర్టు చేస్తూ కోట్లు గడిస్తున్నారని అప్పట్లో ప్రతిపక్షాలు విమర్శించారు. అధికారంతో పాటు అంగబలం ఉన్న చంద్రశేఖర్‌రెడ్డి.. గత ప్రభుత్వ హయాంలో తనపై ఎలాంటి కేసులూ లేకుండా జాగ్రత్త పడ్డారు. ఇప్పుడు సీన్ మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. వస్తున్న ఆరోపణలు, నమోదవుతున్న కేసులతో సదరు నేత ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నారట. పోనీ.. అధిష్టానం నుంచి తనకు ఏదైనా సహాయం అందుతుందని ఆశించినా.. ద్వారంపూడి విషయంలో జగన్‌ అంటీముట్టనట్లుగా ఉంటున్నారని ఆ పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. భవిష్యత్‌లో ఆయన మరిన్ని ఆరోపణలు ఎదుర్కొనే అవకాశాలు లేకపోలేదని రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి.