రేవంత్ కేబినెట్ విస్తరణకు హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందా? లేక మరింత ఆలస్యం కానుందా? తెలంగాణలోని కాంగ్రెస్ కీలక నేతలకు ఢిల్లీకి వెళ్లడం వెనుక అసలేం జరుగుతోంది? అధిష్టానం నుంచి సంకేతాలు వచ్చాయా? మంత్రి విస్తరణతోపాటు పార్టీ పదవులు ఓ కొలిక్కి వచ్చేనా? అవుననే సంకేతాలు ఆ పార్టీ వర్గాల నుంచి బలంగా వినిపిస్తోంది.తెలంగాణ కేబినెట్‌లో ఇంకా ఆరు బెర్త్‌లు ఖాళీగా ఉన్నాయి. ఇటు మంత్రి పదవులు, అటు పీసీసీ పదవుల కోసం పలువురు నేతలు క్యూలో కనిపిస్తున్నారు. ఎవరి స్థాయిలో వారు లాబీయింగ్ చేసుకుంటున్నారు. ఆ క్రమంలో అతి త్వరలోనే ఆ లాంఛనం పూర్తవుతుందన్న టాక్ బలంగా వినిపిస్తుందిపీసీసీ కార్యవర్గం, మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ హైకమాండ్ త్వరలో నిర్ణయం తీసుకోనుందని తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో జోరుగా చర్చ జరుగుతోంది … ఇదే విషయమై ఢిల్లీ పెద్దలతో చర్చించి, తమ అభిప్రాయాలను పంచుకునేందుకు సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన మహేశ్‌కుమార్‌గౌడ్ వంటి నేతలు ఢిల్లీకి వెళ్లారు.
ఇదిలావుండగా కొన్ని మంత్రి పదవులు, ఉప సభాపతి, చీఫ్ విప్.. ఇలా అన్ని పదవుల నియామకాల్లోనూ సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకోవాలని గతంలో ఒక నిర్ణయానికి వచ్చారు. పీసీసీ అధ్యక్ష పదవిని బీసీ నేతకు ఇచ్చారు. కార్యనిర్వాహక అధ్యక్షులు, ప్రచార కమిటీ ఛైర్మన్ పదవులను ఇతర సామాజిక వర్గాలకు ఇచ్చే అవకాశముంది.మంత్రివర్గ విస్తరణపైనా అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని సమాచారం. కొత్తగా మరో ఆరుగురిని మంత్రివర్గంలోకి తీసుకొనేందుకు అవకాశముంది. వాటిలో ఒకట్రెండు పెండింగ్‌లో పెట్టి మిగిలినవి భర్తీ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. సామాజికవర్గం లెక్కలతో వాకిటి శ్రీహరి ముదిరాజ్, పి.సుదర్శన్‌రెడ్డి, గడ్డం వివేక్‌లకు అవకాశం ఉండొచ్చని తెలుస్తోంది.మరోవైపు ఎన్నికలకు ముందు పార్టీలో చేరే సమయంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలోకి తీసుకుంటామనే హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు .. ఆయనకూ అవకాశం ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది.
హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరూ లేనందున ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, టి.రామ్మోహన్‌రెడ్డిలలో ఒకరికి అవకాశం ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది.ఇదిలావుండగా మైనార్టీల నుంచి ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని పార్టీ ఆలోచిస్తున్నట్లు సమాచారం. నామినేటెడ్, ఎమ్మెల్సీ స్థానాల భర్తీ, పిసిసి చీఫ్ నియామకం పూర్తవ్వడంతో ప్రస్తుతం అందరి దృష్టి మంత్రివర్గ విస్తరణపైనే పడింది.డిసెంబర్ 7న సిఎం రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఇంకా ఆరు కేబినెట్ బెర్తులు ఖాళీగా ఉన్నాయి. హోం మంత్రిత్వశాఖ, మున్సిపల్, విద్య, మైనింగ్‌తో పాటు పలు కీలక శాఖలు సిఎం వద్దే ఉన్నాయి. కేబినెట్ విస్తరణలో పలువురు సీనియర్ మంత్రి పదవులు ఆశిస్తున్నారు. దీంతో ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది.షబ్బీర్‌అలీ, అజారుద్దీన్‌ల పేర్లు కొత్తగా తెరపైకి వస్తున్నాయి. వారిద్దరిలో ఎవరిని మంత్రి పదవి వరించినా, ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాల్సి ఉంటుంది. మరి కాంగ్రెస్ హైకమాండ్, సీఎం రేవంత్‌రెడ్డిల ఈక్వేషన్లు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే.
గుర్రు గుర్రుగా మధు యాష్కీ
తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవిపై గంపెడన్ని ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ గౌడ్‌కు నిరాశే ఎదురైంది. కొత్త పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్‌ని అధిష్టానం నియమించింది. ఈనేపథ్యంలో హై కమాండ్‌పై మధు యాష్కీ గౌడ్ గుర్రుగా ఉన్నారు. వలస వచ్చిన నేతలకే పదవులు ఇస్తారా..? మొదటి నుండి పార్టీలో కష్టపడ్డ వారికి లేవా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మధు యాష్కీ కామెంట్స్‌పై ఇప్పుడు పార్టీ తీవ్రంగా చర్చ జరుగుతోంది.తెలంగాణ ఉద్యమ సమయంలో, అదేవిధంగా పార్టీని నుండి బీఆర్ఎస్‌లోకి జోరుగా వలసలు జరుగుతున్నా పార్టీ వెన్నంటే ఉన్నారు మధు యాస్కీ గౌడ్. రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహారిస్తూ, ప్రత్యేక తెలంగాణ కోసం హై కమాండ్ వద్ద తమ గళం వినిపించారు. మరోవైపు కేంద్రంలోని బీజేపీపై తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ వచ్చారు. అలాంటిది ఈ సారి ఖచ్చితంగా పీసీసి అధ్యక్ష పదవి మధు యాష్కీ గౌడ్‌కు దక్కతుందని పార్టీలో ప్రచారం జరిగింది.
అయితే చివరికి మహేష్ గౌడ్‌కు పీసీసీ చీఫ్ కట్టబెడుతూ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది.పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పదవి కాలం జులై 27 న ముగియడంతో, ముఖ్యమంత్రిగా పూర్తిస్థాయిలో పాలనపై దృష్టి పెట్టాలి. కాబట్టి మరొకసారి తనకు పీసీసీ అధ్యక్ష పదవి చేపట్టే ఉద్దేశం లేదని రేవంత్ రెడ్డి హై కమాండ్‌కు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కొత్త పీసీసీ అధ్యక్షుడు కోసం హై కమాండ్ సామాజిక సమీకరణాలతో కూడిన నివేదికను తెప్పించుకుంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో పీసీసీ అధ్యక్షుడిగా బీసీకి ఇవ్వాలని హై కమాండ్ నిర్ణయం తీసుకుంది.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వలస పోయిన నేతలంతా ఒక్కొక్కరుగా సొంత గూటికి చేరుకుంటున్నారు. అలాగే ఎదో ఒక హామీతోనే పార్టీ కండువా కప్పుకుంటున్నారు. అయితే మొదటి నుండి కష్టపడ్డ తమకు ఎందుకు అవకాశం ఇవ్వట్లేదని మధు యాష్కీ హై కమాండ్‌ను గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. తనకు బయటి పార్టీల నుండి ఎన్ని ఆఫర్లు వచ్చినా, నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి పార్టీ కోసం పని చేసిన తనను హై కమాండ్ పక్కన బెట్టిందని మధు యాష్కీ గౌడ్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి పీసీసీ అధ్యక్ష పదవి దక్కపోవడంతో అధిష్టానం పై మధు యాష్కీ గౌడ్ గుర్రుగా ఉన్నాడట. ఈ వ్యవహారంపై మరొకసారి పార్టీలో తీవ్రంగా చర్చకు దారి తీస్తోంది. మరి హై కమాండ్ మధు యాష్కీ విషయంలో ఈ విధమైన నిర్ణయం తీసుకుంటుంది. ఆయనకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తుందా అనేది చూడాలి..!