స్పేస్ఎక్స్ చరిత్ర సృష్టించింది. అంతరిక్షంలో తొలిసారి ప్రైవేట్ స్పేస్‌వాక్‌ను నిర్వహించింది. ‘పొలారిస్ డాన్’ మిషన్‌లో భాగంగా స్పేస్‌ఎక్స్‌కు చెందిన ఫాల్కన్-9 రాకెట్ ద్వారా మంగళవారం నలుగురు నింగిలోకి వెళ్లారు. వారిలో ఒకరైన ప్రముఖ వ్యాపారవేత్త జేర్డ్ ఇస్సాక్‌మన్ గురువారం తొలుత క్యాప్సూల్ నుంచి బయటకు వచ్చి స్పేస్‌వాక్ నిర్వహించారు. ప్రొఫెషనల్ వ్యోమగాములు కాకుండా.. అంతరిక్షంలో స్పేస్‌వాక్ నిర్వహించిన తొలి వ్యక్తిగా ఇస్సాక్‌మన్ చరిత్ర సృష్టించారు. అనంతరం స్పేస్‌ఎక్స్ ఇంజినీర్ సారా గిల్లిస్ ఆయన్ను అనుసరించారు. అంతరిక్ష నడకను 30 నిమిషాల పాటు నిర్వహించారు.వీరికి రెండు గంటలు సమయం పట్టింది. స్పేస్‌వాక్ సందర్భంగా మస్క్ సంస్థ తయారుచేసిన స్పేస్‌సూట్‌ను వారు పరీక్షించారు. ఐసాక్‌మన్ అంతరిక్షంలో నడుస్తోన్న ఫొటోను మస్క్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. భూమి నుంచి బయలుదేరిన 15 గంటల తర్వాత 1400.7 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకొని పొలారిస్ డాన్ మిషన్ అరుదైన మైలురాయిని అందుకుంది. కాగా, ‘అంతరిక్షం నుంచి తిరిగి వచ్చినప్పుడు మనందరికీ చాలా పని ఉంది, కానీ ఇక్కడ నుంచి భూమి ఖచ్చితంగా పరిపూర్ణ ప్రపంచంలా కనిపిస్తుంది’ అని ఇస్సాక్‌మన్ వ్యాఖ్యానించారు.
విజయవంతమైన ఈ మిషన్ నాసా వంటి ప్రభుత్వ ఏజెన్సీలకు చెందిన ప్రొఫెషనల్ వ్యోమగాములకు అంతరిక్ష ప్రయాణం ఇకపై ప్రత్యేకం కాదని నొక్కి చెబుతుంది. ఒకప్పుడు స్పేస్‌వాక్‌లో వ్యోమగాములను అంతరిక్షం శూన్యంలో సూట్‌ల మాత్రమే రక్షణ కల్పించేవి. వాణిజ్య మిషన్‌లలో భాగంగా స్పేస్ఎక్స్ చేపట్టి పొలారిస్ సిరీస్మూడు మిషన్లలో ఇది మొదటిది. అంగారక గ్రహానికి మానవులను పంపాలనే మస్క్ ప్రాజెక్ట్‌కు మద్దతు ఇచ్చేలా సాంకేతిక పురోగతిని వేగవంతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.ఇక, తొలి వాణిజ్య స్పేస్‌వాక్ విజయవంతం కావడంపై నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం అంతరిక్ష వాణిజ్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు, చైతన్యవంతమైన అంతరిక్ష ఆర్దిక వ్యవస్థను నిర్మించాలనే దీర్ఘకాలిక లక్ష్యాన్ని చేరుకోడానికి తోడ్పడుతుందని ఆయన అన్నారు